ఆమె ఐఏఎస్‌ అయినా.. అంగన్‌వాడీలోనే కుమార్తె చదువు

ABN , First Publish Date - 2021-05-09T18:58:56+05:30 IST

ఆమె పేరు శిల్ప ప్రభాకర్‌ సతీష్‌. మాజీ జిల్లా కలెక్టర్‌....

ఆమె ఐఏఎస్‌ అయినా.. అంగన్‌వాడీలోనే కుమార్తె చదువు

  • ప్రజా సమస్యలే ఆమె సమస్యలు
  • కొత్త శాఖను పర్యవేక్షించనున్న శిల్ప

హైదరాబాద్/అడయార్‌ : డీఎంకే అధ్యక్షుడు హోదాలో ఎంకే స్టాలిన్‌ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ముఖ్యంగా ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన  ఒక హామీ ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి వస్తే, ప్రజాసమస్యలపై వంద రోజుల్లో పరిష్కారం చూపుతామని మాట ఇచ్చారు. ఇపుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే స్టాలిన్‌ ఆ అంశంపైనే ఫోకస్‌ పెట్టారు. ఇందులో భాగంగా, ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ శాఖకు ‘ఉంగళ్‌ తొగుదియిల్‌ ముఖ్యమంత్రి’ (మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి) అనే పేరు పెట్టనున్నారు. ఇపుడు ఈ శాఖ పర్యవేక్షణను ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిణికి అప్పగించారు. ఆమె పేరు శిల్ప ప్రభాకర్‌ సతీష్‌. మాజీ జిల్లా కలెక్టర్‌. కర్నాటక రాష్ట్రంలో పుట్టిపెరిగిన ఈమె అక్కడే న్యాయశాస్త్ర విద్యను అభ్యసించారు. ఆ తర్వాత యూపీఎ్‌ససీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 46వ ర్యాంకును సాధించి, తమిళనాడు విభాగంలో ఐఏఎస్‌ అధికారిణిగా కొనసాగుతున్నారు. 2010లో తిరుచ్చి అసిస్టెంట్‌ కలెక్టరుగా పనిచేసిన ఈమె... 2014లో తిరుపత్తూరు డిప్యూటీ కలెక్టరుగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత చెన్నై నగర పాలక సంస్థలోని విద్యా విభాగంగా అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు. 


ఒక యేడాది ఇక్కడ విధులు నిర్వహించిన శిల్ప... హ్యాండ్లూమ్‌ కార్పొరేషన్‌ పాలనావిభాగంలో డిప్యూటీ ఛైర్మెన్‌గా ఉన్నారు. 2018లో తిరునెల్వేలి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆమె... తన పనితీరుతో ఆ జిల్లా వాసుల మన్నలు పొందారు. ముఖ్యంగా కందువడ్డీ బాధితులకు న్యాయం చేయడంలో ఆమె విజయం సాధించి, అందరి ప్రశంసలు మన్నలు పొందారు. అన్నికంటే ముఖ్యంగా తన కుమార్తె గీతను పాలయంక్కోట్టై అంగన్‌వాడీ కేంద్రంలో చేర్చించి, ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రంలోని ప్రముఖ జిల్లాల్లో ఒకటైన తిరునెల్వేలి కలెక్టరుగా వున్నప్పటికీ.. తన కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రానికి పంపించి ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకున్నారు. అంతేకాకుండా, ప్రతిరోజూ తన కుమార్తెను అంగన్‌వాడీ కేంద్రానికి స్వయంగా తీసుకెళ్ళేవారు. ఆ సమయంలో ఆ కేంద్రానికి వచ్చే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులతో ఆమె సాధారణ మహిళగా కలిసిపోయి, వారి కష్టనష్టాలు, సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేవారు.

Updated Date - 2021-05-09T18:58:56+05:30 IST