శిల్పాచౌదరి కొంప ముంచిన కోటిన్నర?

ABN , First Publish Date - 2021-12-01T08:52:48+05:30 IST

సంపన్న కుటుంబాల మహిళలను వందల కోట్ల రూపాయల మేర మోసగించిన శిల్పాచౌదరి..

శిల్పాచౌదరి కొంప ముంచిన కోటిన్నర?

  • దివ్యారెడ్డికి ఇచ్చి ఉంటే కేసయ్యేది కాదు
  • బడా నిర్మాత కూతురికి 3 కోట్ల ఎగవేత
  • బాధితుల్లో చాలా మందిది  బ్లాక్‌ మనీనే.. ఫిర్యాదుకు వెనుకంజ 
  • హవాలాతో విదేశాలకు 50 కోట్లు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సంపన్న కుటుంబాల మహిళలను వందల కోట్ల రూపాయల మేర మోసగించిన శిల్పాచౌదరి.. ఓ బాధితురాలికి రూ. కోటిన్నర ఇవ్వకపోవడం వల్లే ఆమె బండారం బయటపడింది. దివ్యారెడ్డి నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉంటే.. ఇప్పుడప్పుడే శిల్పాచౌదరి మోసాలు బయటపడేవి కాదని పోలీసులు అంటున్నారు. దివ్యారెడ్డి ఫిర్యాదు తర్వాతే.. శిల్పాచౌదరిపై కేసులు పెరిగాయి. ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. అయితే.. చాలా మంది బాధితులు శిల్పకు ఇచ్చిన మొత్తం లెక్కపత్రం లేని నల్లడబ్బు కావడంతో.. వారు ఫిర్యాదుకు వెనకంజ వేస్తున్నారని తెలుస్తోంది. ‘‘జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పరిధిలో శిల్ప బాధితులు వరుసకడుతున్నారు. మౌఖికంగా ఫిర్యాదు చేస్తున్నారే తప్ప.. లిఖితపూర్వకంగా కంప్లైంట్‌ ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నారు. 


బ్లాక్‌ మనీ కావడం వల్లే.. వారు శిల్పపై కేసుకు సిద్ధపడడం లేదు’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాగా.. ఓ బడా సినీ నిర్మాత కుమార్తె కూడా శిల్పాచౌదరికి రూ. 3 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. శిల్ప హవాలా మార్గంలో రూ. 50 కోట్లు విదేశాలకు మళ్లించినట్లు పోలీసులు నిగ్గుతేల్చారు. ఆ మొత్తాన్ని ఎవరికి పంపారు? అనే కోణంపై దృష్టిసారించారు. శిల్ప దంపతుల మొబైల్‌ ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో శిల్ప దంపతుల వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని, వారిని నాలుగు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శిల్ప తరఫు న్యాయవాదులు దీనికి కౌంటరివ్వడంతోపాటు.. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై బుధవారం వాదోపవాదాలు జరగనున్నాయి.

Updated Date - 2021-12-01T08:52:48+05:30 IST