Abn logo
Sep 27 2021 @ 23:38PM

సివిల్స్‌లో మెరిసిన పేదింటి బిడ్డ

రమణయ్య

కాంట్రాక్ట్‌ స్వీపర్‌ కొడుక్కు 681వ ర్యాంకు

కటిక పేదరికంలో లక్ష్య సాధన


కడప(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 27: అఖిల భారత సివిల్‌ సర్వీ్‌సలో ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల్లో పేదింటి బిడ్డ ర్యాంకు సాఽధించాడు. కటిక పేదరికంలో కూడా లక్ష్యాన్ని సాధించి విద్యకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు. కడప నగరం మున్సిపల్‌ హైస్కూల్‌ మెయిన్‌ పూర్వ విద్యార్థి రమణయ్య 681వ ర్యాంక్‌ సాధించారు. రమణయ్య తండ్రి పి.తిరుమలయ్య కడప కలెక్టరేట్‌లో కాంట్రాక్ట్‌ స్వీపర్‌గా పనిచేస్తూ ఆఫీ్‌సబాయ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి పి.నాగమణి గృహిణి. వీరికి ముగ్గురు సంతానం కాగా రమణయ్య తమ్ముడు చిన్నబాబు ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. రమణయ్య కడప మున్సిపల్‌ హైస్కూల్‌ మెయిన్‌లో 2007 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 542 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచారు. ఎస్కే విశ్వవిద్యాలయంలో బీటెక్‌ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేశారు. అనంతరం సివిల్స్‌ సర్వీస్‌ పరీక్షకు సిద్ధమయ్యారు. రెండుసార్లు విఫలమై ఉద్యోగానికి రాజీనామా చేసి మూడవసారి 681వ ర్యాంకు సాధించారు.


పట్టుదలతోనే సాధించగలిగా

- రమణయ్య, సివిల్స్‌ 681వ ర్యాంకర్‌

పేదరికంలో ఉన్నప్పటికీ చిన్నతనం నుంచి విద్య పట్ల మక్కువ ఎక్కువ ఉండేది. శ్రద్ధగా చదువుతూ మంచి మార్కులు సాధించాను. కటిక పేదరికం కారణంగా, బీటెక్‌ చదువుతున్న సమయంలో అనంతపురంలో సెక్యూరిటీ గార్డుగా రాత్రి పూట, మధ్యాహ్నం ఓ ప్రైవేటు విద్యా సంస్థలో టీచర్‌గా పనిచేశాను. అలా బీటెక్‌ పూర్తి అయిన వెంటనే హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ బాయ్‌గా, ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తూ ఉద్యోగ అన్వేషణ చేశాను. 2015లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వచ్చింది. జాబ్‌ చేస్తూ రెండుసార్లు సివిల్స్‌ పరీక్ష రాశాను. అయితే సివిల్స్‌కు సెలెక్ట్‌ కాలేదు. చివరకు ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ప్రిపేర్‌ అయ్యాను. సివిల్స్‌లో 681వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకు ద్వారా ఐఆర్‌ఎస్‌ వస్తుంది. అయితే ఐఏఎస్‌ కావాలన్నది లక్ష్యం. మరోసారి పట్టుదలతో కృషి చేస్తాను.