ఆ నౌక అక్కడే...

ABN , First Publish Date - 2020-11-18T06:04:31+05:30 IST

బంగ్లాదేశ్‌ వాణిజ్య నౌక ‘ఎంవీ మా’ భవితవ్యం తేలిపోయింది. ఇక అది ఎక్కడకూ కదలదు, తెన్నేటి పార్కు వద్దే ఉంటుంది. పర్యాటక శాఖ చొరవ చూపితే... రెస్టారెంట్‌గా మారే అవకాశం ఉంది.

ఆ నౌక అక్కడే...
బంగ్లాదేశ్‌ వాణిజ్య నౌక ‘ఎంవీ మా’

వదిలేసిన యాజమాన్యం

పోటు సమయంలో లోపలకు తీసుకువెళ్లేందుకు విఫలయత్నం

వీలు కాకపోవడంతో చేతులెత్తేసిన మెరైన్‌ కంపెనీ

పర్యాటక కేంద్రంగా మార్చే యోచనలో ప్రభుత్వం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బంగ్లాదేశ్‌ వాణిజ్య నౌక ‘ఎంవీ మా’ భవితవ్యం తేలిపోయింది. ఇక అది ఎక్కడకూ కదలదు, తెన్నేటి పార్కు వద్దే ఉంటుంది. పర్యాటక శాఖ చొరవ చూపితే... రెస్టారెంట్‌గా మారే అవకాశం ఉంది. దీపావళి రోజున అమావాస్య సందర్భంగా సముద్రానికి పోటు వచ్చినప్పుడు నౌక కిందకు నీరు భారీగా వస్తే... టగ్‌ల సాయంతో సముద్రంలోకి తీసుకువెళ్లాలని యాజమాన్యం తరపున అమెరికాకు చెందిన రిసాల్వ్‌ మెరైన్‌ కంపెనీ అన్ని ఏర్పాట్లుచేసింది. అయితే అనుకున్న స్థాయిలో పోటు రాకపోవడంతో నౌకను కదల్చలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో నౌకపై యాజమాన్యం ఆశలు వదిలేసుకున్నట్టు తెలిసింది.


ఖర్చు తడిసి మోపెడు

ఈ నౌకను ఏదో తంటాలు పడి సముద్రంలోకి లాగినా బంగ్లాదేశ్‌ వరకు తీసుకువెళ్లాలంటే... దానికి రాళ్లు తగిలి కింద ఎంత మేర డ్యామేజీ జరిగిందో పరిశీలించాల్సి ఉంది. అటువంటివి ఏమైనా వుంటే రిపేర్లు చేసి, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం హిందూస్థాన్‌ షిప్‌యార్డుతో మాట్లాడారు. వారు డ్రైడాక్‌లో రిపేర్లకు అనుమతించారు. అయితే నౌక అక్కడి వరకు వెళ్లాలంటే... విశాఖపట్నం పోర్టు చానల్‌ ద్వారా వెళ్లాలి. దానికి పోర్టు అనుమతి అవసరం. పాడైన నౌక చానల్‌ ద్వారా వెళుతున్నప్పుడు పొరపాటున మునిగిపోతే... పోర్టులోకి నౌకల రాకపోకలు నిలిచిపోతాయి. ఈ చానల్‌ ద్వారానే నేవీ యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు, కోస్టుగార్డు నౌకలు రాకపోకలు సాగిస్తాయి. వాటికి అడ్డంకి ఏర్పడుతుంది. ఇది చాలా పెద్ద రిస్క్‌తో కూడిన వ్యవహారం. అందుకే పోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. ముందు ఆ నౌకను సముద్రంలోకి లాగి, దాని ఫిట్‌నెస్‌ను సర్వే బృందం పరిశీలించి ఓకే చేస్తేనే అనుమతిస్తామని స్పష్టంచేసింది. ఇవన్నీ జరగాలంటే... ముందు నౌక తీరంలోని రాళ్ల మధ్య నుంచి సముద్రంలోకి రావాలి. అది సాధ్యం కావడం లేదు. భారీ ఖర్చుతో లాగినా, పోర్టు యాంకరింగ్‌, సర్వే చార్జీలు, షిప్‌యార్డు డ్రై డాక్‌ చార్జీలు...అన్నీ కలిపి తడిసి మోపెడవుతాయని, ఆ వ్యయం నౌక ప్రస్తుత విలువ కంటే ఎక్కువ అవుతుందని యాజమాన్యం అడ్వాన్స్‌ షిప్పింగ్‌ లిమిటెడ్‌ ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఆ నౌకను తీరంలో వదిలేయాలని నిర్ణయించింది. అందులోని ఇంధనం తొలగించినందున పర్యావరణానికి ఇబ్బంది లేదని పేర్కొంది. ఇదే విషయాన్ని నౌక కెప్టెన్‌ ఎస్‌కే షాహిల్‌ ఇస్లామ్‌కు నోటీసు ద్వారా తెలియజేసింది. 


రెస్టారెంట్‌గా నౌక?

ఎంవీ మా నౌకను తీసుకువెళ్లే అవకాశం లేదని ముందే గుర్తించిన పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దానిని రెస్టారెంట్‌గా తీర్చిదిద్దడానికి గల అవకాశాలు పరిశీలించాలని ఏపీటీడీసీ సీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఆ మేరకు నౌక యాజమాన్యంతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్‌ వినయచంద్‌కు ఆయన సూచించారు. ఇప్పుడు నౌక యాజమాన్యమే దానిని అక్కడ వదిలేయాలని నిర్ణయించినందున, ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా, నౌకను రెస్టారెంట్‌గా మార్చుకోవచ్చు.

Updated Date - 2020-11-18T06:04:31+05:30 IST