ప్రగతిపథంలో షిప్‌యార్డు

ABN , First Publish Date - 2021-06-21T05:40:36+05:30 IST

దేశంలోనే తొలి నౌకా నిర్మాణ కేంద్రం వి శాఖ హిందూస్థాన్‌ షిప్‌యార్డు ప్రగతిపథంలో పయనిస్తోంది.

ప్రగతిపథంలో షిప్‌యార్డు
షిప్‌యార్డు

80 ఏళ్లలో ఎన్నో విజయాలు

త్వరలో రూ.1800 కోట్ల భారీ ఆర్డర్‌

నేడు షిప్‌యార్డు వ్యవస్థాపక దినోత్సవం 

మల్కాపురం, జూన్‌ 20 : దేశంలోనే తొలి నౌకా నిర్మాణ కేంద్రం వి శాఖ హిందూస్థాన్‌ షిప్‌యార్డు ప్రగతిపథంలో పయనిస్తోంది. షిప్‌యార్డు ఏర్పాటై సోమవారానికి 80 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకుని అంతర్జాతీయంగా ఉన్న షిప్‌యార్డులతో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతోంది. షిప్‌యార్డును 1941 జూన్‌ 21న స్థాపించారు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వాల్‌చంద్‌ హీరాచంద్‌ షిప్‌యార్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలి నౌక జలఉషను అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూతో జలప్రవేశం చేయించారు. షిప్‌యార్డులో ఇప్పటి వరకు దాదాపుగా 200 నౌకలను నిర్మించారు. 2000 నౌకలకు మరమ్మతులు చేపట్టారు. ఐదు సబ్‌మెరైన్లకు విజయవంతంగా మరమ్మతులు చేపట్టి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. త్వరలోనే 1800 కోట్ల రూపాయల భారీ ఆర్డర్‌ను షిప్‌యార్డు దక్కించుకోనుందని అధికారులు పేర్కొన్నారు.

నేడు ప్రత్యేక కార్యక్రమాలు

షిప్‌యార్డు వ్యవస్థాపకుడు వాల్‌చంద్‌ హీరాచంద్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించనున్నారు. అధికారులు, గుర్తింపు యూనియన్‌ నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తొలుత సింథియా జంక్షన్‌లో ఉన్న నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసిన తరువాత షిప్‌యార్డు గేటు వద్ద ఉన్న విగ్రహానికి  పూలమాలలు వేయనున్నారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రితో అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా షిప్‌యార్డు సాధించిన విజయాలపై ప్రత్యేకంగా డిజిటల్‌ అల్బమ్‌ను ప్రారంభించనున్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు.



Updated Date - 2021-06-21T05:40:36+05:30 IST