పెన్సిల్ పాళీపై శివ లింగం

ABN , First Publish Date - 2020-02-21T19:41:41+05:30 IST

ప్రముఖ మీనియేచర్ కళాకారుడు ఎల్ ఈశ్వర రావు మహా శివరాత్రి సందర్భంగా తన నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. పెన్సిల్ పాళీపై శివ లింగాన్ని తీర్చిదిద్దారు.

పెన్సిల్ పాళీపై శివ లింగం

భువనేశ్వర్ : ప్రముఖ మీనియేచర్ కళాకారుడు ఎల్ ఈశ్వర రావు మహా శివరాత్రి సందర్భంగా తన నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. పెన్సిల్ పాళీపై శివ లింగాన్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఓ చిన్న సీసాలో కూడా శివ లింగాన్ని రూపొందించారు. 


ఈశ్వర రావు ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జత్ని గ్రామవాసి. మీడియాతో ఆయన మాట్లాడుతూ, మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తాను రెండు కళాకృతులను రూపొందించినట్లు తెలిపారు. రెండు రోజులు శ్రమించి, చిన్న సీసాలోని రాతిపై శివ లింగాన్ని తీర్చిదిద్దానని, ఒక రోజు కృషితో పెన్సిల్ పాళీపై శివ లింగాన్ని తీర్చిదిద్దానని చెప్పారు. సీసాలోని రాతిపై 0.5 అంగుళాల అతి చిన్న కళాకృతిని, పెన్సిల్ పాళీపై 0.5 సెంటీమీటర్ల అతి చిన్న కళాకృతిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. శివ లింగాన్ని తయారు చేయడం కోసం నాలుగు చిన్న, మృదువైన రాళ్ళను సీసాలోకి చొప్పించడానికి చాలా కష్టపడవలసి వచ్చిందన్నారు. 


గతంలో ఆయన పురుషుల హాకీ ప్రపంచ కప్ ట్రోఫీని పెన్సిల్‌ టిప్‌పై చిత్రించారు. గత ఏడాది ఓ సీసా లోపల చర్చిని రూపొందించారు. గత ఏడాది జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మూడున్నర అంగుళాల సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మీనియేచర్‌ను ఓ సీసాలో రూపొందించారు. దీని కోసం ఆయన సబ్బును వాడారు.


Updated Date - 2020-02-21T19:41:41+05:30 IST