మిగతా రాష్ట్రాలు పాకిస్తాన్‌లో ఉన్నాయా? శివసేన గరంగరం

ABN , First Publish Date - 2020-10-24T17:22:09+05:30 IST

ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ హామీపై శివసేన తీవ్రంగా మండిపడింది.

మిగతా రాష్ట్రాలు పాకిస్తాన్‌లో ఉన్నాయా? శివసేన గరంగరం

ముంబై : ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామన్న బీజేపీ హామీపై శివసేన తీవ్రంగా మండిపడింది. సామ్నా వేదికపై బీజేపీని ఏకిపారేసింది. ‘‘కోవిడ్ వ్యాక్సిన్ పై బీజేపీ రాజకీయాలు చేస్తోంది. బిహార్‌కు కరోనా వ్యాక్సిన్ అందాలి. కానీ ఇతర రాష్ట్రాలేమైనా పాకిస్తాన్ లో ఉన్నాయా? వ్యాక్సిన్ పై అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులున్నాయి.’’ అని సామ్నాలో అభిప్రాయపడింది. కోవిడ్ తో దేశం దేశమే తీవ్రంగా బాధపడుతోందని, కేవలం బిహార్ మాత్రమే కోవిడ్ తో బాధపడటం లేదని అలాంటి సందర్భంలో వ్యాక్సిన్ రాజకీయాలు చేయడం ఏంటని శివసేన తీవ్రంగా ధ్వజమెత్తింది. జాతి, కుల, మత, ప్రాంత భేదాల్లేకుండా అందరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చూస్తామని ప్రధాని మోదీ ప్రకటించారని, కానీ నేడు బీజేపీ మాత్రం బిహార్ ఎన్నికల సందర్భంగా రాజకీయం చేస్తోందని శివసేన ఆక్షేపించింది. బీజేపీకి ఈ విషయంలో ఎవరు మార్గదర్శనం చేస్తున్నారో తమకు తెలియదని, బీజేపీ నాయకత్వంలో ఏం లోపముందో తమకు తెలియదని విమర్శించింది.


బిహార్ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నేతలు ఏమాత్రం కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని, ప్రచార సమయంలో భౌతిక దూరాన్ని పాటించడం లేదని సామ్నాలో మండిపడింది. ‘‘మహమ్మారి వేళ బిహార్ ఎన్నికలే ప్రథమం. అన్ని ర్యాలీలు వర్చువల్ ర్యాలీలుగా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ విషయాల్నే మరిచిపోయినట్లున్నారు. భౌతిక దూరం ఏమాత్రం పాటించడం లేదు. నేతలు హెలికాప్టర్ల సహాయంతో వివిధ ప్రాంతాలకు వెళ్లి, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బిహార్ లో ప్రస్తుతానికి కరోనా వైరస్ లాంటిదేమీ లేదు.’’  సామ్నా వేదికగా శివసేన మండిపడింది. 

Updated Date - 2020-10-24T17:22:09+05:30 IST