మొదటి హిందుత్వ పార్టీ శివసేనే: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2022-01-25T22:26:06+05:30 IST

సోమవారం ఇరు పార్టీల మధ్య హిందుత్వంపై మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగింది. బాల్ థాకరే 96వ జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారంనాడు మాట్లాడిన ఉద్ధవ్ థాకరే...

మొదటి హిందుత్వ పార్టీ శివసేనే: సంజయ్ రౌత్

ముంబై: భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీకి మధ్య హిందుత్వ యుద్ధం మరింత తీవ్రమైంది. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దేశంలో హిందుత్వం మీద ఎన్నికల బరిలోకి దిగింది తామేనని ఆయన స్పష్టం చేశారు. 1990లో ముంబైలోని విలే పార్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికే ఇందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో శివసేన అభ్యర్థి  రమేష్ ప్రభు హిందుత్వ ఎజెండా మీద పోటీ చేసి విజయం సాధించారని రౌత్ గుర్తు చేశారు. ఆ విధంగా ఎన్నికల రాజకీయాల్లో హిందుత్వం పేరుతో పోటీకి దిగింది శివసేనేనని, తమకు హిందుత్వ పాఠాలు నేర్పొద్దని అన్నారు.


సోమవారం ఇరు పార్టీల మధ్య హిందుత్వంపై మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగింది. బాల్ థాకరే 96వ జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారంనాడు మాట్లాడిన ఉద్ధవ్ థాకరే... బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ తరహాలా హిందుత్వాన్ని అధికారం కోసం శివసేన ఎన్నడూ వాడుకోలేదని, ఆ పార్టీకి తాము దూరమైనా హిందుత్వానికి దూరం కాలేదని అన్నారు. తమకు బీజేపీనే వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. అనంతరం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం బీజేపీపై విమర్శలు కొనసాగించారు. ఎక్కడో అట్టడుగున ఉన్న బీజేపీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది తమ పార్టీయేనని అన్నారు. బాబ్రీ ఉదంతం తర్వాత ఉత్తరభారతంలో శివసేన పవనాలు బలంగా వీచాయని, ఆ దశలో ఎన్నికలకు వెళ్లి ఉంటే శివసేన ప్రధానే దేశాన్ని ఏలేవాడని, అయితే ఆ అవకాశాన్ని తాము బీజేపీకి ఇచ్చామని చెప్పారు.


ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తిప్పికొట్టారు. శివసేన పుట్టక ముందే బీజేపీ ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. ''ఆ పార్టీకి (శివసేన) నేను ఒక విషయం గుర్తుచేయాలని అనుకుంటున్నాను. ఆ పార్టీ పుట్టక ముందే ముంబైలో బీజేపీ కార్పొరేటర్ ఒకరు ఉన్నారు'' అని అన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పటి ర్యాంకు కంటే ఇప్పుడు శివసేన ర్యాంకు దారుణంగా పడిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీతో శివసేన కలిసి ఉన్నప్పటి వరకూ ఆ పార్టీ ఒకటి, లేదా రెండో స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఆ పార్టీ నెంబర్-4కు పడిపోయిందని చెప్పారు.

Updated Date - 2022-01-25T22:26:06+05:30 IST