ముందు ప్రజలను ప్రేమించండి... కమల్‌నాథ్‌కు శివరాజ్ సలహా

ABN , First Publish Date - 2020-10-21T20:29:24+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన 'ఐటెమ్' వ్యాఖ్యల చుట్టూ వివాదం కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్‌ను లూటీ ..

ముందు ప్రజలను ప్రేమించండి... కమల్‌నాథ్‌కు శివరాజ్ సలహా

భోపాల్: మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన 'ఐటెమ్' వ్యాఖ్యల చుట్టూ వివాదం కొనసాగుతూనే ఉంది. మధ్యప్రదేశ్‌ను లూటీ చేసేందుకు, మీ సొంత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఉపయోగించుకోవద్దని కమల్‌నాథ్‌కు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా సలహా ఇచ్చారు. తన వ్యాఖ్యల చుట్టూ బీజేపీ వివాదం రేపుతుండటంపై కమల్‌నాథ్ రాసిన లేఖకు శివరాజ్ ప్రత్యుత్తరం ఇచ్చారు. 'కమల్‌నాథ్ జీ... మధ్యప్రదేశ్‌ను, ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి. మీరు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాకపోయినా మిమ్మల్ని ఇక్కడి ప్రజలు ఆదరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై దృష్టి సారించండి' అని శివరాజ్ తన లేఖలో పేర్కొన్నారు.


దీనికి ముందు కమల్‌నాథ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో, డబ్రా ర్యాలీలో తను ఎలాంటి కించపరచే వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అయినప్పటికీ మీరు (శివరాజ్), మీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తుండటం సరికాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన అంశాల నుంచి తప్పుదారి పట్టించి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ మరోసారి కుట్ర చేస్తోందన్న విషయం రాష్ట్ర ఓటర్లకు బాగా తెలుసునని కూడా కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు. కాగా, కమల్‌నాథ్ 'ఐటెం' వ్యాఖ్యలపై సమగ్ర నివేదక ఇవ్వాలని మధ్యప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ)ని భారత ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బీజేపీ అభ్యర్థి ఇమరతి దేవిని కమల్‌నాథ్ 'ఐటెం' అంటూ సంబోధించడం ఈ వివాదానికి కారణమైంది.

Updated Date - 2020-10-21T20:29:24+05:30 IST