మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై బీజేపీ కసరత్తు..సీఎం ఢిల్లీ టూర్

ABN , First Publish Date - 2020-06-29T17:12:38+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై బీజేపీ అధిష్ఠానవర్గం దృష్టి సారించింది.....

మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై బీజేపీ కసరత్తు..సీఎం ఢిల్లీ టూర్

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై బీజేపీ అధిష్ఠానవర్గం దృష్టి సారించింది. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేశాక మంత్రివర్గ విస్తరణపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సీఎం మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ, ప్రధానకార్యదర్శి సుహాస్ భగత్ లతో కలిసి ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. సోమవారం సీఎం చౌహాన్ తోపాటు ముగ్గురు నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, నరేంద్రసింగ్ తోమార్, జ్యోతిరాదిత్య సింధియాలను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారని ఢిల్లీవర్గాల సమాచారం. వీలైతే సీఎం ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా కలిసే అవకాశాలున్నాయి. సీనియర్ బీజేపీ నేతలను కలిశాక తాను మంత్రివర్గాన్ని విస్తరిస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఏప్రిల్ 21 నుంచి ఐదుగురు సభ్యుల కేబినెట్ పాలిస్తోంది. విధేయులకే మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం యోచిస్తున్నారు. మంత్రివర్గంలో 10 మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన వారికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. బీజేపీ అధిష్ఠానవర్గంలో చర్చల అనంతరం సీఎం చౌహాన్ సోమవారం రాత్రి తిరిగి భోపాల్ కు వస్తారని భావిస్తున్నారు. జులై మొదటివారంలో 30నుంచి 34 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయవచ్చని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ లక్నో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్ర గవర్నరుతో ప్రమాణస్వీకారం చేయించవచ్చని భావిస్తున్నారు. అంతకు ముందు చౌహాన్ హైదరాబాద్ లో చినజీయర్ స్వామిని కలిసి  తిరుపతి స్వామివారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2020-06-29T17:12:38+05:30 IST