సీబీఐ కస్టడీకి శివశంకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-26T09:34:52+05:30 IST

సీబీఐ కస్టడీకి శివశంకర్‌రెడ్డి

సీబీఐ కస్టడీకి శివశంకర్‌రెడ్డి

వారం పాటు అనుమతించిన పులివెందుల కోర్టు

పులివెందుల, నవంబరు 25: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ గురువారం పులివెందుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కడప సెంట్రల్‌ జైల్‌లో ఉన్న డి.శివశంకర్‌రెడ్డిని 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై 23వ తేదీ వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచి, గురువారం ఏడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్‌రెడ్డి ప్రస్తావన ఉంది. దీంతో ఈనెల 15న విచారణకు హాజరుకావాలని ఆయనకు సీబీఐ సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక బృందం ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌లో శివశంకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్‌ వారంట్‌ ద్వారా అక్కడి నుంచి తీసుకొచ్చి పులివెందుల కోర్టులో హాజరుపరచగా, కోర్టు 14రోజుల పాటు రిమాండ్‌ విధించింది. తాజాగా కస్టడీ ఆదేశాలతో శంకర్‌రెడ్డిని కడప సెంట్రల్‌ జైలు నుంచి సీబీఐ తమ కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-11-26T09:34:52+05:30 IST