విరాళాల కోసం.. భారత్ వర్సెస్ పాక్ సిరీస్ నిర్వహిద్దాం..: అక్తర్

ABN , First Publish Date - 2020-04-09T02:22:08+05:30 IST

పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు.. పాకిస్థాన్‌లోనూ కరోనా ప్రభావం

విరాళాల కోసం.. భారత్ వర్సెస్ పాక్ సిరీస్ నిర్వహిద్దాం..: అక్తర్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు.. పాకిస్థాన్‌లోనూ కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. దీంతో ఇరు దేశాలు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడితే.. దాని ద్వారా వచ్చే విరాళాలు ఇరు దేశాలు కరోనాపై చేస్తున్న పోరాటంలో ఉపయోగపడతాయని అక్తర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకుండా.. కేవలం టీవీలకు మాత్రమే పరిమితం చేయాలని ఆయన సూచించారు. 


2007 తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ జరుగలేదు. ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో, ఆసియా కప్‌లో మాత్రమే ఇరు దేశాలు తలపడతాయి. అయితే ఇప్పుడు నెలకొన్ని క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాను ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చానని అక్తర్ పేర్కొన్నారు. ఫలితంతో సంబంధం లేకుండా ఇరు దేశాల ప్రజలు ఈ మ్యాచ్‌లను వీక్షిస్తారని ఆయన పేర్కొన్నారు. 


‘‘ఒకవేళ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే.. మేము ఆనందిస్తాము. బాబర్ ఆజామ్ చేస్తే.. మీరు. మైదానంలో ఫలితం ఎలా ఉన్నా.. ప్రజల దృష్టిలో మాత్రం ఇరు దేశాలు విజేతలే అవుతాయి. మ్యాచ్‌లను కేవలం టీవీలకే పరిమితం చేయవచ్చు. ఇప్పుడు అందరు ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి చూసేవాళ్ల సంఖ్య కూడా చాలా ఎక్కుగా ఉంటుంది. దాని ద్వారా వచ్చే ప్రతీ పైసాను ఇరు దేశాల్లో కరోనాపై జరుగుతున్న పోరు కోసం ఉపయోగించవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. 


అయితే మ్యాచ్‌లను ఇరుదేశాలకు అనుకూలంగా ఉండే దుబాయ్‌లో నిర్వహించాలని సూచించిన ఆయన.. ఆటగాళ్లను ప్రత్యేక విమానాల ద్వారా అక్కడకు తీసుకువెళ్లొచ్చని తెలిపారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య క్రికెట్‌ పరంగా నెలకొన్న విభేదాలు తొలగిపోతాయని.. తద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కూడా నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో ఇరు దేశాలు ఒకరికొకరు సహాయం అందించాలని ఆయన కోరారు. ‘‘ఇండియా మాకు పది వేల వెంటిలేర్లు ఇస్తే.. పాకిస్థాన్ దాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ, మ్యాచ్‌ల గురించి ప్రతిపాదించడమే మా చేతుల్లో ఉంది. తుది నిర్ణయం అధికారులదే’’ అని ఆయన అన్నారు. 

Updated Date - 2020-04-09T02:22:08+05:30 IST