కువైత్‌లోని జిల్లా వాసులకు షాక్‌

ABN , First Publish Date - 2020-07-08T11:03:09+05:30 IST

వైత్‌లో ఆ దేశ పౌరుల కంటే వివిధ దేశాల నుంచి పనుల కోసం వెళ్లి జీవిస్తున్న వారే అధికంగా ఉన్నారు.

కువైత్‌లోని జిల్లా వాసులకు షాక్‌

ఇతర దేశాల వారిని 30శాతానికి కుదిస్తూ ఆదేశాలు

50వేల మంది జిల్లాకు వచ్చే అవకాశం


రాజంపేట, జూలై 7: కువైత్‌లో ఆ దేశ పౌరుల కంటే వివిధ దేశాల నుంచి పనుల కోసం  వెళ్లి జీవిస్తున్న వారే అధికంగా ఉన్నారు. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించడం, అక్కడున్న చమురు ధరలు భారీగా తగ్గిపోతూ ఉండటంతో ఇతర దేశాల వారి సంఖ్య 30శాతానికి తగ్గించాలని ఆ దేశ ప్రధాని అధ్యక్షతన కేంద్ర కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం చట్టబద్ధత పొందితే కువైత్‌లో ఉన్న ఇతర దేశాలవారు చాలామంది వారి స్వస్థలాలకు వెళ్లాల్సి వస్తుంది. భారతీయులే సుమారు 10 లక్షల మంది వెనుదిరిగే అవకాశం ఉంది. కడప జిల్లాకు చెందిన సుమారు 50వేల పైబడి ఇళ్లకు వస్తారు. 


రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతంలోనే 1.50లక్షల మంది కువైత్‌లో ఉన్నారు.  బద్వేలు, కడప, మైదుకూరు ప్రాంతాల నుంచి కూడా కువైత్‌కు వెళ్లిన వారుకూడా ఉన్నారు. సుమారు 50 సంవత్సరాల నుంచి కువైత్‌కు వలసలు ప్రారంభమయ్యాయి. ఇంటి పని, పలు పరిశ్రమల్లో ఉద్యోగులుగా, డ్రైవర్లుగా, తాపీ మేస్త్రీలుగా, క్లీనర్లుగా, స్వీపర్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాజంపేట, కోడూరు ప్రాంతాలైతే కువైత్‌కు వెళ్లని ఇల్లు లేదు. ఒక్కో ఇంటిలో ఒక్కొక్కరి నుంచి ఇంటిల్లిపాది అక్కడికి వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే ఆ దేశంలో వీసాలు, పాస్‌పోర్టులు లేకుండా, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి కేసుల్లో ఉన్న వారిని క్షమాభిక్ష పెట్టి కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వారివారి దేశాలకు కువైత్‌ ప్రభుత్వం పంపించేసింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన సుమారు 5వేల మంది స్వస్థలాలకు చేరుకున్నారు. కువైత్‌లోని ఇతర దేశీయులను 30శాతానికి కుదిస్తే జిల్లాకు చెందిన 50వేలకు పైబడి ఇంటికి రాక తప్పని పరిస్థితి. దీనివల్ల అనేక ఏళ్లుగా ఉపాధి పొందుతున్న తాము ఇంటికి తిరిగివస్తే పరిస్థితి ఎలా అన్న ఆందోళన వారందరిలో నెలకొంది.


కువైత్‌లో చాలా దుర్భర పరిస్థితులు

కువైత్‌ నుంచి జిల్లాకు చెందిన ఎం.సురే్‌షబాబు సెల్‌ఫోన్‌ ద్వారా ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా వైరస్‌ వల్ల కువైత్‌లో అన్ని పరిశ్రమలు, ప్రధానంగా చమురు పరిశ్రమలు మూతపడ్డాయని, ఎక్కడా భవన నిర్మాణ పనులు జరగడం లేదని చెప్పారు. చట్టవ్యతిరేకంగా ఉన్న వారిని కరోనా లాక్‌డౌన్‌లోనే ఇంటికి పంపారని, ఇప్పుడు ఆదేశంలో ఉన్న తమలాంటివారందరినీ ఇంటికి పంపడానికి చట్టం తెస్తున్నారని అన్నారు. దీని వల్ల తామందరం తప్పని స్థితిలో కువైత్‌ను వదిలి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, 30 ఏళ్లుగా కువైత్‌లో ఉన్న  తమ వాళ్లంతా ఇంటికి వస్తే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-08T11:03:09+05:30 IST