ఈటలకు షాక్‌

ABN , First Publish Date - 2021-08-23T05:59:25+05:30 IST

బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్‌ బరిలో దిగుతున్న..

ఈటలకు షాక్‌

టీఆర్‌ఎస్‌లో చేరిన పింగిలి

ఫలించిన హరీష్‌రావు మంత్రాంగం

బీజేపీకి రాజీనామా చేసిన పలువురు కార్యకర్తలు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి కరీంనగర్‌): బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్‌ బరిలో దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మరోసారి షాక్‌ తగిలింది. తన సామాజిక వర్గానికే చెందిన అత్యంత సన్నిహితుడిగా ఉన్న జిల్లా సహకార బ్యాంకు వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు చుక్కా రంజిత్‌ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు జమ్మికుంట ఇల్లంతకుంట మండలాలకు చెందిన పలువురు బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు జరిపిన మంత్రాంగంతోనే రమేష్‌ ఈటలను వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నద్ధులయ్యారని సమాచారం. త్వరలోనే పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించి సుమారు రెండు మూడు వందల మంది కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌ పెద్దల సమక్షంలో వారు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారని తెలిసింది.


హరీష్‌రావు రాత్రి బసతో మారిన పరిణామాలు

హరీష్‌రావు శనివారం రాత్రి ఆకస్మికంగా హుజూరాబాద్‌కు వచ్చి సింగాపురంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు వసతి గృహంలో బస చేశారు. హుజూరాబాద్‌ నియోజక వర్గానికి చెందిన కొంత మంది ముఖ్య నాయకులతో ఆయన విడివిడిగా సమావేశమై నియోజక వర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సమీక్షించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నుంచి ఈటలతోపాటు బీజేపీలోకి వెళ్లిన వారిలో ఇంకా ఎవరెవరు అక్కడే ఉన్నారు అన్న విషయాలను ఆయన తెలుసుకున్నట్లు సమాచారం. జూన్‌ 12న ఈటల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరగా ఆయనకు అత్యంత సన్నిహితులైన పింగిలి రమేష్‌, రంజిత్‌గౌడ్‌ కూడా ఆయన వెంటే బీజేపీలోకి వెళ్లారు. ఆనాటి నుంచి ఈటలకు అండగా ఉంటూ ప్రచారంలో పాలు పంచుకుంటున్న వారు కొద్ది రోజులుగా సైలెంటయి పోయారు. శుక్రవారం హరీష్‌రావు హుజూరాబాద్‌కు రావడం మరుసటి రోజే వారి ఇరువురు బీజేపీకి రాజీనామా చేసి త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరీష్‌రావు జరిపిన మంతనాల వల్లే వారు తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. 


సామాజిక వర్గాల వారీగా పట్టు సాధించేందుకు యత్నం

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో ముదిరాజ్‌ల ఓట్లు 23,220 ఉన్నట్లుగా లెక్కలు వేశారు. ఆరు సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ తన సామాజిక వర్గమైన ముదిరాజ్‌ల్లో గట్టి పట్టు సాధించారు. పింగిలి రమేష్‌ను టీఆర్‌ఎస్‌లోకి రప్పించడం ద్వారా ముదిరాజ్‌ ఓటు బ్యాంకులో టీఆర్‌ఎస్‌ కూడా తన వాటాను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. గౌడ సామాజిక వర్గంలో మంచి పేరున్న చుక్క రంజిత్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ సామాజిక వర్గానికి కూడా ఇక్కడ 24,200 ఓట్లు ఉన్నాయి. నియోజక వర్గంలోని రెండు మండలాల్లో గట్టిపట్టున్న ఈ నేతలు బీజేపీకి రాజీనామా చేసి ఈటల రాజేందర్‌ను వదిలేసి తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరడం రాజీకీయంగా ఆయనకు నష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరిద్దరితో పాటు ఈటల వెంట ఉన్న ఎక్కటి మధుసూదన్‌రెడ్డి, మద్దెల కుమారస్వామి, క్యాస శంకరయ్య, నల్ల రత్నం, తిరుపతిరావు, కడిపికొండ తిరుపతిరెడ్డి, కంచర్ల రవి, పోల్సాని సత్యనారాయణరావు, చందుపట్ల జితేందర్‌రెడడ్డి, గోలి సుధాకర్‌, జె చిరంజీవితోపాటు సుమారు 200 మంది కార్యకర్తలు బీజేపీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు త్వరలో పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం.


అన్ని కులాల వారీగా నాయకులతో మాట్లాడి ఆయా సామాజిక వర్గాల ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మంత్రి హరీష్‌రావు ఈ క్రమంలో భాగంగానే అన్ని సామాజిక వర్గాల ప్రముఖులను పిలిచి మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కుల సంఘాల భవనాలు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించడంతోపాటు భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు వృత్తి సంఘాల వారిని కూడా ఆయన పిలిచి మాట్లాడుతున్నారు. దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి హరీష్‌రావు సభకు మూడు రోజుల ముందు నియోజక వర్గంలో తన ప్రత్యక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.


ఇక నుంచి ఆయన వారంలో ఒకటి రెండు సార్లు నియోజక వర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ  నియోజక వర్గంలో పార్టీ నాయకులకు శ్రేణులకు మార్గదర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంగుల కమలాకర్‌ కూడా హుజూరాబాద్‌ నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రచిస్తున్న వ్యూహాలను హరీష్‌రావు అందిస్తున్న సూచనలను అమల్లో పెడుతూ పార్టీ శ్రేణులను నేతలను సమన్వయ పరుస్తున్నారు. మోకాలు ఆపరేషన్‌తో పాదయాత్రకు బ్రేక్‌ వేసిన ఈటల రాజేందర్‌ జమ్మికుంటలో ఉంటూ వీలున్న వారిని కలుస్తున్నారు. ఇదే సమయంలో ఆయన వెంట ఉన్న వారందరిని తిరిగి టీఆర్‌ఎస్‌లోకి లాగేయడం ద్వారా ఆయనను ఒంటరి వాడిగా చేయాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. అందులో భాగంగానే ఒక్కొక్కరు బీజేపీకి రాజీనామా చేసి ఈటలను విడిచి వెళ్తున్నారని చెబుతున్నారు.   


ఇద్దరూ.. ఇద్దరే

పింగిలి రమేష్‌ ప్రస్తుతం ఇల్లందకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా, జిల్లా సహకార బ్యాంకు వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. గతంలో ఆయన జమ్మికుంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య విలాసాగరం సర్పంచ్‌ రమాదేవి కూడా బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. చుక్కా రంజిత్‌ జమ్మికుంట మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. ఆయన విత్తన వ్యాపారిగా, పింగిలి రమేష్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.


పింగిలి రమేష్‌ ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వారు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కూడా అదే సామాజిక వర్గానికి వ్యక్తి కావడంతో రమేష్‌ ఆయనకు అంత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆయన జమ్మికుంట మార్కెట్‌ పదవిని ప్రస్తుతం జిల్లా సహకార బ్యాంకు వైస్‌ ఛైర్మన్‌ పదవిని కూడా పొంద గలిగారు. పింగిళి రమేష్‌ ఇప్పుడు ఈటల ను వదిలి మాతృ సంస్థ అయిన టీఆర్‌ఎస్‌లోనే పని చేయాలని నిశ్చయించుకోవడం ఈటల రాజేందర్‌కు పెద్ద దెబ్బే అని  భావిస్తున్నారు.

Updated Date - 2021-08-23T05:59:25+05:30 IST