ఈటల రాజేందర్‌కు షాక్

ABN , First Publish Date - 2021-07-27T21:30:47+05:30 IST

ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న...

ఈటల రాజేందర్‌కు షాక్

కరీంనగర్: ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి ఈటలకు షాకిచ్చారు. టీఆర్ఎస్‌ గుర్తుపై గెలిచామని, టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని కోటి, స్వప్న ప్రకటించడం గమనార్హం. ఇటీవల ఈటల ముఖ్య అనుచరుల్లో ఒక్కరైన బండా శ్రీనివాస్ కూడా ఆయన షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్‌ నియమించారు. శ్రీనివాస్‌ది కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌. ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌.. విద్యార్థి నాయకుని దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ మండల శాఖ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగానూ శ్రీనివాస్ పనిచేశారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయం వేడెక్కుతోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా ఈటల రాజేందర్‌ను ఓడించడం ద్వారా రాజకీయాల నుంచి శాశ్వతంగా ఇంటికి పంపించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం గట్టి పట్టుదలతో ఉన్నది. గత ఆరు ఎన్నికల్లో హుజురాబాద్‌ నియోజకవర్గంలో విజయం సాధించిన ఈటలను ఢీకొట్టడమే కాకుండా రాజకీయాలకు ఆయనను దూరం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఈటల ఢీకొట్ట గలిగిన నాయకుడు ఎవరూ లేకుండా పోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారింది. బలమైన బీసీ నాయకుడిగా ఉన్న ఈటలపై మరో బీసీ నాయకుడిని రంగంలోకి దింపాలా, లేక నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యం కలిగి ఉన్న రెడ్డి అభ్యర్థిని నిలబెట్టాలా, అత్యధిక ఓట్లు ఉన్న దళిత అభ్యర్థిని తెరపైకి తేవాలా అన్న విషయంలో పార్టీ తర్జనభర్జన పడుతున్నది. ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాకున్నా కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ద్వారానే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించింది. 

Updated Date - 2021-07-27T21:30:47+05:30 IST