సచివాలయ ఉద్యోగులకు షాక్‌

ABN , First Publish Date - 2021-10-24T04:48:08+05:30 IST

‘సచివాలయ వ్యవస్థ ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాం. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం.’ అంటూ రెండేళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన చూసి నిరుద్యోగులు సంబర పడ్డారు. కొందరు ప్రైవేట్‌ ఉద్యోగాలను వదులుకొని సర్కారు కొలువుకు సన్నద్ధమయ్యారు. రేయింబవళ్లూ చదివి ఉద్యోగాలు సాఽధించారు. తీరా ఎంపికయ్యాక వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. ఉద్యోగాల ప్రకటన సమయంలో చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితికి ఎంతో తేడా ఉంది. బయోమెట్రిక్‌ కారణం చూపుతూ తాజాగా ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడం వారిని కలవరపెడుతోంది.

సచివాలయ ఉద్యోగులకు షాక్‌

వేతనంలో కోత

బయోమెట్రిక్‌ సాకు

 రెండేళ్లు పూర్తయినా పర్మినెంట్‌ కాని వైనం

సెలవు దినాల్లో పనులకు లేని వేతనం

పనిచెయ్యని బయోమెట్రిక్‌ పరికరాలు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ సాలూరు/ గజపతినగరం, అక్టోబరు 23: ‘సచివాలయ వ్యవస్థ ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాం. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం.’ అంటూ రెండేళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన చూసి నిరుద్యోగులు సంబర పడ్డారు. కొందరు ప్రైవేట్‌ ఉద్యోగాలను వదులుకొని సర్కారు కొలువుకు సన్నద్ధమయ్యారు. రేయింబవళ్లూ చదివి ఉద్యోగాలు సాఽధించారు. తీరా ఎంపికయ్యాక వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. ఉద్యోగాల ప్రకటన సమయంలో చెప్పిన మాటలకు వాస్తవ పరిస్థితికి ఎంతో తేడా ఉంది. బయోమెట్రిక్‌ కారణం చూపుతూ తాజాగా ఉద్యోగుల వేతనాల్లో  కోతలు విధించడం వారిని కలవరపెడుతోంది. 

గత నెల 23 నుంచి ఈనెల 22వరకు విధుల్లో ఉన్న సచివాలయ సిబ్బందికి కొంత వేతనం కోత పడినట్టు చూపుతున్నారు. బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా కోత పెట్టినట్టు తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా వేలాది మంది జీతాల్లో కోత పడింది. సచివాలయ ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రస్తుతం ట్రెజరీలకు అందజేస్తున్నారు. పనిచేస్తున్న సిబ్బందిలో అనేక మందికి హాజరు ఆధారంగా జీతాలు కోత పెడుతూ బిల్లులు పెట్టారు. ఇలా కోత పెట్టిన జీతాలు నవంబరు ఒకటిన అందనున్నాయి. రోజుకు రూ.714 చొప్పున తగ్గించారని చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు ఇచ్చే కాస్త వేతనంలో కూడా బయోమెట్రిక్‌ వంక చూపించి కోతలు పెడుతుండడం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. మరోవైపు వారికి సెలవు రోజుల్లోనూ వివిధ పనులను అప్పగిస్తున్నారు. ఎన్నికల వంటి ప్రత్యేక విధులకూ ఉపయోగిస్తున్నారు. నేడు బయోమెట్రిక్‌ హాజరు చూపి ఉన్నఫళంగా వేతనంలో కోత పెట్టడంతో ఉద్యోగులంతా అయోమయంలో పడ్డారు. జీతాల కోతలకు ప్రాతిపదికగా చెబుతున్న బయోమెట్రిక్‌ పరికరాలు నేటికీ సరిగా పనిచేసిన దాఖలాలు లేవు. ఒకరోజు హాజరుపడితే మరోరోజు గంట ఆలస్యంగా పరికరం పనిచేస్తోంది. నెట్‌ పనిచేయక.. సిగ్నల్‌ లేక కొన్ని రోజులు ఉద్యోగులు బయోమెట్రిక్‌ వేయలేకపోయారు. డివైజ్‌లు కూడా అనేకం మూలకు చేరాయి. కొన్ని సచివాలయాల్లో సిబ్బంది చివరకు కొంత మొత్తాలను పోగు చేసుకుని కొత్త పరికరాలను కొనుగోలు చేసుకుని వాటినే వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృషికి తీసుకువెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. సచివాలయాల్లో కొందరు ఉద్యోగులు నిత్యం క్షేత్రస్థాయికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి సైతం బయోమెట్రిక్‌ వంక చూపించి జీతాలు కట్‌ చేయటం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 

సచివాలయ ఉద్యోగానికి ఎంపిక కాక ముందు ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకుని ఇంతకు రెండు రెట్లు ఎక్కువ జీతం తీసుకున్న వారు ఉన్నారు. పర్మినెంట్‌ కాకముందే ఉద్యోగుల తల్లిదండ్రుల వృద్ధాప్య పెన్షన్‌, రేషన్‌కార్డుతో పాటు  సంక్షేమ పథకాలకు అర్హత లేకుండా చేశారు. రెండేళ్లు పూర్తయిన వెంటనే పర్మినెంట్‌ ఉద్యోగులుగా మారుస్తామని చెప్పి ఇప్పుడు పర్మినెంట్‌ చేసేందుకు మళ్లీ పరీక్షలు పెట్టారు. వాటి ఫలితాలు కూడా వచ్చాయి. తర్వాత పరిస్థితి ఏమిటో వారికే అర్థం కావడం లేదు. అంతలోనే బయోమెట్రిక్‌ కారణం చూపి వేతనంలో కోత విధించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. జీతాల్లో కోత లేకుండా చూడాలని ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


Updated Date - 2021-10-24T04:48:08+05:30 IST