టీడీపీకి ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-04-08T05:32:40+05:30 IST

రాష్ట్రంలో ఉన్న..

టీడీపీకి ఎదురుదెబ్బ

మెచ్చా చేరికతో ఉమ్మడి జిల్లాలో మారిన సమీకరణలు

అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయిన సైకిల్‌


ఖమ్మం/సత్తుపల్లి(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ఉన్న ఒక్కగానొక్క టీడీపీ ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరావు సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య జీరో అయి.. ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. ఎన్నికలు పూర్తయిన కొంతకాలం తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరినా.. పలు సాంకేతిక కారణాలతో ఆయన ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్యేగా అధికారపార్టీకి మద్దతుదారుడిగా కొనసాగుతున్నారు. ఇక పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడేదిలేదని పలు సందర్భాల్లో స్పష్టంచేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా తాజాగా సైకిల్‌ దిగి కారెక్కారు. అంతేకాదు టీడీపీఎల్పీని టీఆర్‌ఎస్‌ శాసనాసభా పక్షంలో విలీనం చేయాలంటూ బుధవారం ఎమ్మెల్యేలు సండ్ర, మెచ్చా.. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి లేఖ ఇవ్వడం, ఆయన దాన్ని ఆమోదించడంతో టీ అసెంబ్లీలో టీడీపీ ప్రతినిధులే లేకుండా పోయారు. 


అసెంబ్లీ ఎన్నికల నాటికి నేటికి మార్పులెన్నో..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఒక్కరే టీఆర్‌ఎస్‌ నుంచి గెలవగా, వైరాలో రాములునాయక్‌ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థులుగా సత్తుపల్లి నుంచి సండ్రవెంకటవీరయ్య, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్‌ నుంచి కొత్తగూడెంలో వనమావెంకటేశ్వరరావు, పినపాకలో రేగా కాంతారావు, పాలేరులో కందాల ఉపేందర్‌రెడ్డి, ఇల్లెందులో ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, మధిరలో మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలంలో పొదెం వీరయ్య విజయం సాధించారు. వీరిలో ప్రస్తుతం భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగుతుండగా.. మిగిలిన వారంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరతారని భావించినా.. సండ్ర ఒక్కరే టీఆర్‌ఎస్‌లో చేరారు.


కానీ టీడీఎల్పీని విలీనం చేయడం సాంకేతికంగా ఇబ్బంది ఉండడంతో ఇంతకాలం ఆయన టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ.. పార్టీపరంగా టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు... సీనియర్‌ నేత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పలుసార్లు మంతనాలు జరిపారని, ఆతర్వాతే మెచ్చా కూడా సీఎం కేసీఆర్‌ను కలవడం, నియోజకవర్గ అభివృద్ధికి హామీలు తీసుకున్నారని సమాచారం. అనంతరం సండ్ర వెంకటవీరయ్యతో కలిసి శాసనసభ స్పీకర్‌కు లేఖ ఇవ్వడంతో టీడీపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మెచ్చా నాగేశ్వరరావు కారెక్కినట్టయ్యింది. ఇప్పటికే జిల్లాలో ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న టీడీపీ కేడర్‌.. దశలవారీగా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోగా.. తాజా పరిణామాలతో ఆ పార్టీకి తీవ్ర నష్టమే మిగిలింది.


Updated Date - 2021-04-08T05:32:40+05:30 IST