విద్యుత్‌ శాఖకు షాక్‌!

ABN , First Publish Date - 2021-09-08T05:31:39+05:30 IST

విద్యుత్‌ వినియోదారులకే కాదు. ప్రభుత్వం ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)కు కూడా షాకిచ్చింది. గత ఆరు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి విద్యుత్‌ బిల్లులకు పైసా విదల్చడం లేదు.

విద్యుత్‌ శాఖకు షాక్‌!




- కార్యాలయాల బిల్లులు చెల్లించని ప్రభుత్వం

- జిల్లా వ్యాప్తంగా బకాయిలు రూ.40.60 కోట్లు

- మొక్కుబడి తంతుగా నోటీసులు జారీ

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ వినియోదారులకే కాదు. ప్రభుత్వం ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)కు కూడా షాకిచ్చింది. గత ఆరు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి విద్యుత్‌ బిల్లులకు పైసా విదల్చడం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. సామాన్య వినియోగదారుడు విద్యుత్‌ బకాయిలు చెల్లించకపోతే కొరడా ఝుళిపించే విద్యుత్‌ శాఖ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల విషయానికి వచ్చేసరికి ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. స్థానిక సంస్థల విషయానికి వచ్చేసరికి పాలకవర్గాలకు తెలియకుండా విద్యుత్‌ బిల్లులు సర్దుబాటు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో 45 శాఖలకు సంబంధించి వందలాది కార్యాలయాలున్నాయి. వీటికి గత ఆరు నెలలుగా విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోయినా విద్యుత్‌ శాఖ అధికారులు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. మొక్కుబడిగా ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసి మమ అనిపించేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 8,75,320 మంది విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి వేలాది మీటర్లు ఉన్నాయి. ఒక్కో కార్యాలయానికి ప్రతి నెల రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయి. ఆరు నెలలకు రూ.కోట్లలో విద్యుత్‌ బకాయిలు ఉన్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. 

 అరకొరగా కేటాయింపులు...

ఈ ఏడాది ఏప్రిల్‌ నెల వరకూ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి దాదాపు రూ.62.60 కోట్లు బిల్లులు బకాయిలుగా ఉంటే...ప్రభుత్వం కేవలం రూ.22 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ.40.60 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. గడిచిన ఆరు నెలలుగా విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో..నెలకు రూ.14 కోట్లకు పైగా బకాయిల జాబితాలో చేరిపోతున్నాయి.  జిల్లాలో అత్యధికంగా నీటిపారుదల శాఖ ఎత్తిపోతల పథకాలకు  సంబంధించి రూ.11.60 కోట్ల విద్యుత్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి రూ.10.71 కోట్లు,  రెవెన్యూ శాఖకు సంబంధించి రూ.1.74 కోట్లు విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో కలెక్టరేట్‌లోని కీలక  విభాగాలు సైతం ఉండడం విశేషం.  ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌, మైనార్టీ వెల్ఫేర్‌, బీసీ, ఎస్సీ వెల్పేర్‌ శాఖలు, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, వ్యవసాయ శాఖ కార్యాలయాల బిల్లులతో పాటు వీధి దీపాల వినియోగ బిల్లులు మాత్రమే ప్రతినెలా చెల్లిస్తున్నారు. మిగిలిన దాదాపు 38 ప్రభుత్వ శాఖల కార్యాలయాల నుంచి బకాయిలు పెరిగిపోతున్నాయి. విద్యుత్‌ శాఖ నోటీసులు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. 




Updated Date - 2021-09-08T05:31:39+05:30 IST