ఎంపీ విజయసాయికి ఊహించని షాక్.. ఇలా చేసిందెవరు!?

ABN , First Publish Date - 2021-01-07T18:24:12+05:30 IST

ఎంపీ విజయసాయి రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది.

ఎంపీ విజయసాయికి ఊహించని షాక్.. ఇలా చేసిందెవరు!?

ఎంపీ విజయసాయి రామతీర్థం పర్యటనల్లో మందీమార్బాలంతో హంగామా చేశారా?. అంగబలం, అర్థబలం చూపించేందుకు తహతహలాడారా? తమ పవర్‌తో మొదట కొండపైకి ఎక్కారు. దిగిన తర్వాత పెద్ద రచ్చే జరిగింది. ఆయనకు ఊహించని షాక్‌ తగిలింది. ప్రతిపక్షనేత చంద్రబాబు కొండపైకి ఎక్కినా..గుడిలోకి వెళ్లకుండా తాళాలు వేయించారా?  అప్పటివరకు కూల్‌గా ఉన్న వాతావరణం విజయసాయి ఎంట్రీతో రాజకీయ రణరంగాన్ని తలపించిందా? ఇంతకీ విజయసాయి పర్యటన వైసీపీకి కలిసొచ్చిందా? విజయనగరం జిల్లాలో ఆ పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుందో ఈ కథనంలో చూద్దాం.  


ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్!?

విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన నిరసనలు, దాడులు ఏ పార్టీకి ప్లస్‌ అయ్యాయి? ఏ పార్టీకి మైనస్‌ అయాయన్న చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎంపీ విజయ్‌సాయి రెడ్డి ఎంట్రీతో వైసీపీ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యిందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయట. జనవరి  28న రామతీర్థంలో గుర్తుతెలియని దుండగలు రాముడి విగ్రహ శిరస్సును ఖండించారు. ఆ  శిరస్సును  ఎదురుగా  ఉన్న కోనేరులో పడేశారు.  ఈ విషయం పూజారి ద్వారా బయటకు పొక్కడంతో పెద్ద దుమారమే రేగింది. మరుసటి రోజు  విజయనగరంలో  ఇళ్ల పట్టాల పంపిణి కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.  అప్పటికే  ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లినప్పటికీ ఆయన స్పందించలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రామతీర్థం ఘటనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు, హిందూత్వ సంస్థలు అక్కడికి చేరుకుని ఆందోళనలు ప్రారంభించాయి. నిందితులను శిక్షించాలంటూ నిరహార దీక్షలు చేపట్టి నిరసన తెలిపారు.  అయితే  చంద్రబాబు రామతీర్థం పర్యటన ఈ నెల 2న ఖరారైంది. కానీ ఒకటవ తేదీన విజయసాయిరెడ్డి ఇదంతా చంద్రబాబు ఆయన కుమారుడు టిడిపి నేతలతో చేయించారంటూ ఆరోపించడంతో రగులుతున్న వివాదానికి ఆజ్యం పోసినట్లయింది.


కారు అద్దాలు ధ్వంసం..!

చంద్రబాబు రామతీర్దం వెళ్తున్న సమయానికే.. విజయసాయిరెడ్డి  కూడా రామతీర్థం పర్యటనకు బయల్దేరారు. అప్పటికే  బీజేపీ నేతలు, హిందూత్వ సంస్ధలు  అక్కడ దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు  వస్తున్నారన్న విషయం తెలిసి టిడిపి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.  ఇదే సమయానికి  విజయసాయిరెడ్డి, వైసిపి ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకోవడంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినప్పటికీ విజయసాయి రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలు కొండపైకి వెళ్లారు. అయితే తిరిగి కిందకు వచ్చిన విజయసాయిరెడ్డి,  ఎమ్మెల్యేలపై వాటర్ ప్యాకెట్లు, చెప్పులు విసిరారు. వారి కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు.


విజయసాయి వెళ్లినప్పుడే..!

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు పోలీసులే విజయనగరంలో లారీలు అడ్డుపెట్టి ఆటంకాలు కలిగించారు. రామతీర్దంలో పోటాపోటి నినాదాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి పోలీసులు చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన సమయంలో.. విజయసాయిరెడ్డికి ఎలా అనుమతి ఇచ్చారన్న దానిపై దుమారం రేగింది. అలాగే కొండపైన  రాముని దేవాలయంలోకి చంద్రబాబు లోపలికి వెళ్లకుండా బయట నుంచి తాళాలు వేశారు. కానీ విజయసాయిరెడ్డి వెళ్లినప్పుడు మాత్రం ఆ తాళాలు తెరిచారు. 


టీడీపీకే ప్లస్..!

ఏదేమైనా రామతీర్థం పర్యటన ఎపిసోడ్‌ టీడీపీకే ప్లస్‌ అయ్యిందనే టాక్‌ జిల్లాలో జోరుగా సాగుతోందట. అంతేకాదు చంద్రబాబు మాటల్లో జోష్ కనిపించిందని, ఆ పార్టీ నేతలంటున్నారు.  విజయసాయిరెడ్డి ఫుణ్యమా అని, వైసిపికి కలిసిరాకపోగా..ఆ పార్టీ వారే ఇరకాటంలో పడ్డారని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో మాన్సాస్‌ ట్రస్ట్ చైర్మన్‌ పదవి నుంచి ఆశోక్ గజపతి రాజును తొలగించడం, ఆయనపై విమర్శలు చేయడం, తదనంతర పరిణామాలు కూడా ఫ్యాన్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ హిందూత్వ సంస్థలతో  కలిసి రామతీర్థం ఘటనపై పోరాటాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం ఛలో రామతీర్థంకి పిలుపునిచ్చారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ , సోము వీర్రాజులతో పాటుగా, జాతీయ నాయకులను ఆహ్వనించినట్లు టాక్‌ వినిపిస్తోంది. మొత్తంగా రాముడి చుట్టూ తిరుగుతున్న రాజకీయ దుమారం చివరకు ఏమౌతుందో చూడాలి.


ఇంతకీ వాళ్లెవరు..!?

రామతీర్థానికి విజయసాయిరెడ్డి సడన్ టూర్‌తో అది రచ్చగా మారి చివరకు టిడిపికే కలిసి వచ్చిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో ఇటు టిడిపిని అటు వైసిపి శ్రేణులను అడిగినా ఇదే ఆన్సర్‌ ఇస్తున్నారట. అస్సలు ఆ సమయంలో విజయసాయిరెడ్డి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదని వైసీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. టిడిపి, బిజెపి, హిందూత్వ సంస్థల ప్రతినిధుల ప్రతిఘటన సెగ విజయసాయిరెడ్డికి గట్టిగానే తగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తన మాటలు, చేతలతో ఎదుటి వారిని ఇరకాటంలో పడేసే  విజయసాయిరెడ్డికి.. మొదటిసారి క్షేత్రస్థాయిలో తనపై ఎంత వ్యతిరేకత ఉందో నేరుగా చూశారట. ఎప్పుడు లేనిది, విజయసాయిరెడ్డి  ముఖంలో ఒకింత టెన్షన్ కూడా కనిపించిందంటున్నారు. వైసీపీ నాయకులపై వాటర్ ప్యాకెట్లు విసిరింది ఎవరన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు సొంత పార్టీ నాయకులే విజయసాయిరెడ్డిపై ఇలా కసి తీర్చుకున్నారని చెవులు కొరుక్కుంటున్నారు.

Updated Date - 2021-01-07T18:24:12+05:30 IST