కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లడం చూసి షాక్ అయ్యాం: డీకే

ABN , First Publish Date - 2021-05-07T02:36:03+05:30 IST

రాష్ట్రానికి ఆక్సిజన్ కోటా పెంచాలంటూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై

కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లడం చూసి షాక్ అయ్యాం: డీకే

బెంగళూరు: రాష్ట్రానికి ఆక్సిజన్ కోటా పెంచాలంటూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కాంగ్రెస్ పార్టీ ‘‘విస్మయం’’ వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా సీఎం యడియూరప్ప, బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మండిపడింది. కొవిడ్ రోగుల చికిత్స కోసం కర్నాటకకు రోజూ అందిస్తున్న 965 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో)ను 1200 మెట్రిక్ టన్నులకు పెంచాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీనిపై స్టే విధించాలంటూ కేంద్రం హుటాహుటిన ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘కర్నాటకకు ప్రస్తుతం 1,471 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాల్సివుండగా.. కేవలం 865 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇస్తున్నారు. హైకోర్టు ఈ కోటాను పెంచమన్నందుకు కేంద్రం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం చూసి షాక్ అయ్యాం. ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సీఎం యడియూరప్ప, బీజేపీ ఎంపీలు నోరు విప్పరా?’’ అని ప్రశ్నించారు. కాగా కర్నాటకకు ప్రస్తుతం 965 మెట్రిక్ టన్నుల ఎల్ఎంవోను సరఫరా చేస్తున్నామనీ.. హైకోర్టు ఆదేశాలపై వెంటనే స్టే విధించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి విన్నవించారు. 


Updated Date - 2021-05-07T02:36:03+05:30 IST