కరోనా వ్యాప్తిలో కొత్త కోణం.. ఆలస్యంగా వెలుగులోకి కీలక నిజం..!

ABN , First Publish Date - 2020-05-28T14:51:05+05:30 IST

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఇటీవల ఓ కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్‌ ఎలా సోకిందని అధికారులు ఆరా తీయగా... స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌కు చిన్న సమస్యతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యుల్లో ఒకరు వెళ్లినట్టు గుర్తించారు.

కరోనా వ్యాప్తిలో కొత్త కోణం.. ఆలస్యంగా వెలుగులోకి కీలక నిజం..!

క్లినిక్స్‌లో జర భద్రం.. వేదికలుగా మారుతున్న చిన్నా, చితక ఆస్పత్రులు

నిబంధనలు పాటించకపోవడం.. జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణం

ముషీరాబాద్‌లో నాలుగు క్లినిక్‌లు సీజ్‌

అంబర్‌పేటలో నేడో, రేపో పలు క్లినిక్‌ల మూసివేత..? 

తక్కువ విస్తీర్ణంలో ఉండే క్లినిక్‌లలో రోగుల రద్దీ

వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న వైనం

తాజా కేసుల్లో కొన్ని క్లినిక్‌ల ద్వారా వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ!


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఇటీవల ఓ కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్‌ ఎలా సోకిందని అధికారులు ఆరా తీయగా... స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌కు చిన్న సమస్యతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యుల్లో ఒకరు వెళ్లినట్టు గుర్తించారు. మలక్‌పేటలోని ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. కాంటాక్ట్‌ కేసుల పరిశీలన క్రమంలో ఆయన సమీపంలోని వైద్యుడి వద్దకు వెళ్లాడని అధికారులకు ఆ వ్యక్తి చెప్పారు. ఈ రెండు కేసుల్లో వైరస్‌ వ్యాప్తి స్థానికంగా ఉండే క్లినిక్‌ల వల్ల జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. నగరంలో వేల సంఖ్యలో ఉన్న బస్తీలు, కాలనీల్లో చిన్నాచితక క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్లినిక్‌లలో వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఆ ప్రాంతంలో ఎన్ని పాజిటివ్‌ కేసులున్నాయి..? అన్నది పరిశీలించి చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక పరిస్థితులను బట్టి క్లినిక్‌లను మూసి వేస్తున్నామని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. 


గ్రేటర్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా.. చాపకింద నీరులా వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతోంది..? నిత్యం 30, 40 కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బస్తీల్లోని క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలు వైరస్‌ వాహకాలుగా మారుతున్నాయని అధికారులు గుర్తించారు.  పాజిటివ్‌ కేసుల కాంటాక్ట్‌లను పరిశీలించే క్రమంలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. తలనొప్పి, చెవి నొప్పి, మోకాళ్ల నొప్పులు, జ్వరం తదితర కారణాలతో స్థానిక క్లినిక్‌లకు వెళ్తున్న వారికి ఇతరుల నుంచి వైరస్‌ సోకుతోందని భావిస్తున్నారు. ముషీరాబాద్‌, అంబర్‌పేట, జియాగూడ, పహాడిషరీఫ్‌, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో కేసుల నమోదు గణనీయంగా పెరుగుతోంది. జనసాంద్రత ఎక్కువగా ఉండడం ఆ ఏరియాల్లో వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం కాగా.. చిన్న చిన్న క్లినిక్‌లలో ఒకేచోట ఎక్కువ సంఖ్యలో రోగులు గుమిగూడడమూ వైరస్‌ సోకేందుకు కారణమవుతుందని చెబుతున్నారు. ఇటీవల నమోదైన కేసుల్లో ఈ తరహావి ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే ముషీరాబాద్‌లోని నాలుగు క్లినిక్‌లను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. అంబర్‌పేటలో కూడా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లోని ఒకటి, రెండు క్లినిక్‌లను మూసి వేస్తామని ఓ అధికారి చెప్పారు. 


ఒక్కసారిగా పెరుగుదల...

 లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భోలక్‌పూర్‌లో అంతకుముందు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. సడలింపు అనంతరం మూడోరోజు ఓ వ్యక్తికి పాజటివ్‌గా తేలింది. ఆయన ద్వారా కుటుంబంలోని మరో నలుగురికి వైరస్‌ సోకింది. భోలక్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో మొదట్లో సరి, బేసి విధానం పాటించకుండా దుకాణాలు తెరిచారు. కొనుగోలుదారులు  అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో వైరస్‌ వ్యాప్తి చెందిందని అధికారులు భావిస్తున్నారు. అదే ప్రాంతంలో మరికొన్ని కేసులూ నమోదవుతున్నాయి. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో స్థానికంగా ఉండే క్లినిక్‌లను మూసివేశారు. అంబర్‌పేటలో కూడా ఓ ఈఎన్‌టీ వైద్యుడి క్లినిక్‌ వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. మలక్‌పేటలోనూ ఓ క్లినిక్‌కు ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. చిన్నగా ఉండే క్లినిక్‌లలో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదు. కుర్చీలు, తలుపులు, క్లినిక్‌కు వచ్చే రోగులకు శానిటైజర్‌ వేయడమూ చాలాచోట్ల కనిపించడం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకోని నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఓ అధికారి చెప్పారు.  


ప్రమాదం ఉంది...: డాక్టర్‌ హేమలత, హెల్త్‌ ఆఫీసర్‌, జీహెచ్‌ఎంసీ.... 

క్లినిక్‌లు, చిన్న, చిన్న ఆస్పత్రుల వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఇరుకుగా ఉండే క్లినిక్‌లలో రోగులు వేచి ఉంటున్నారు. వైరస్‌ ఉన్నప్పటికీ చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఇటీవల నమోదవుతోన్న కేసుల వివరాలను ఆరా తీస్తే క్లినిక్‌కు వెళ్లామని కొందరు చెబుతున్నారు. అందుకే పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో క్లినిక్‌లను మూసి వేస్తున్నాం. 

Updated Date - 2020-05-28T14:51:05+05:30 IST