హైదరాబాద్ గురించి ఓ సర్వేలో షాకింగ్ నిజాలు.. వరుసగా 17 రోజుల పాటు వర్షం కురిస్తే జరిగేది ఇదే..!

ABN , First Publish Date - 2021-10-17T01:12:46+05:30 IST

హైదరాబాద్‌లో 17రోజుల పాటు నిరంతరాయంగా వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ అంశంపై బిట్స్ పిలానీ, హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ గురించి ఓ సర్వేలో షాకింగ్ నిజాలు.. వరుసగా 17 రోజుల పాటు వర్షం కురిస్తే జరిగేది ఇదే..!

ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే లోపాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయంటున్నారు నిపుణులు. వర్షాలు పడ్డ సమయంలో నగరంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పనక్కరలేదు. కనీసం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కేవలం ఒక రోజు భారీ వర్షం పడితేనే.. నగరమంతా అతలాకుతలం అవుతుంది. మరి 17రోజుల పాటు నిరంతరాయంగా వర్షం పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ అంశంపై బిట్స్ పిలానీ, హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహించిన అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


భారీ వర్షాలు సంభవిస్తే మూసీ నది, హుస్సేన్ సాగర్ సమీపంలోని ప్రాంతాలన్నీ ఎక్కువగా నష్టపోతాయని అధ్యయనం వెల్లడించింది. వరదల సమయంలో మునిగిపోయిన ప్రాంతాలు, దెబ్బతినే భవనాలు తదితర అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కువ రోజులు వర్షం కురిస్తే నగరంలో భవనాలు దెబ్బతినే శాతాన్ని బట్టి అంచనా వేశారు. 17 రోజుల పాటు వర్షాలు కురిస్తే నగరంలోని 38.19% భవనాలు .. 19 రోజుల పాటు వర్షం పడితే 40.82% భవనాలు ఎక్కువ ప్రమాదంలో ఉంటాయట. అలాగే ఒక జోన్ నుంచి మరో జోన్ వరకు వరద లోతు మారుతూ ఉంటుందని అధ్యయనం ద్వారా తెలుస్తోంది. కాప్రా, సరూర్‌నగర్, మలక్‌పేట్, సంతోష్‌నగర్, కార్వాన్, ముషీరాబాద్ మండలాల పరిధిలో వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే చార్మినార్ జోన్ పరిధిలో తక్కువ ప్రభావం ఉంటుందని అధ్యయనంలో తేలింది.


గతంలో భారీ వర్షాలు పడ్డ సమయంలో చేసిన అధ్యయనం ప్రకారం హైదరాబాద్‌లో 17 రోజుల పాటు 440.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే.. 334.23 చదరపు కిలోమీటర్ల నగరం మునిగిపోతుందని తేలింది. జీహెచ్ఎంసీ మొత్తం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. వారి అధ్యయనం ప్రకారం 19 రోజుల్లో 624.2 మి.మీల వర్షపాతం నమోదైతే.. 357.97 చదరపు కిలోమీటర్ల పరిధిలో మునిగిపోతుంది. రివర్ ఎనాలిసిస్ సిస్టమ్ 2డీ సాయంతో హైడ్రాలిక్ మోడల్ ఆధారంగా పరిశోధకులు ఏయే ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది, అక్కడ భవనాలకు ఉన్న ప్రమాద తీవ్రత ఎంత.. తదితర విషయాలను అంచనా వేశారు.

Updated Date - 2021-10-17T01:12:46+05:30 IST