న్యూయార్క్ ఆసుపత్రులను చూస్తే.. గుండె తరుక్కుపోవాల్సిందే!

ABN , First Publish Date - 2020-04-02T03:33:14+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్‌లో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ఒక్క న్యూయార్క్‌లోనే

న్యూయార్క్ ఆసుపత్రులను చూస్తే.. గుండె తరుక్కుపోవాల్సిందే!

న్యూయార్క్: అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్‌లో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతోంది. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటివరకు 76 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. న్యూయార్క్ ఆసుపత్రులకు పేషంట్లు క్యూ కడుతూనే ఉన్నారు. పేషంట్లకు కనీసం బెడ్‌లు కూడా లేకపోవడంతో వైద్యులు వారికి కారిడార్‌లోనే చికిత్స చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు చూసిన వారి గుండె తరుక్కుపోతోంది. న్యూయార్క్‌లోని బ్రూక్‌డేల్ ఆసుపత్రిలో బెడ్‌ల కోసం పేషంట్లు క్యూ కట్టారు. ఈ ఆసుపత్రిలో ఉన్న 370 బెడ్‌లు కూడా ఫుల్ అయిపోయినట్టు ఆసుపత్రిలోని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం న్యూయార్క్ ఆసుపత్రులలో మెడికల్ వార్‌జోన్ నడుస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఆసుపత్రి కూడా నిండిందని, పేషంట్లకు ఎమర్జెన్సీ గదులలో కూడా చికిత్స అందించాల్సి వస్తోందని తమ ఇక్కట్లను తెలియజేశారు. ఇదే సమయంలో పేషంట్లకు సరిపడా వెంటిలేటర్లు కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 


వెంటిలేటర్ల కొరత అంశాన్ని వైద్యులు ఇప్పటికే న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో దృష్టికి తీసుకెళ్లారు. మరోపక్క వెంటిలేటర్ల కొరత గురించి ట్రంప్‌కు చెప్పినా.. ఎటువంటి ఫలితం లేదంటూ ఆండ్రూ మండిపడ్డారు. చైనా నుంచి న్యూయార్క్ ప్రభుత్వం ఒక్కో వెంటిలేటర్‌కు 17 వేల డాలర్లను చెల్లించి మొత్తంగా 425 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి 17 వేల వెంటిలేటర్లను కొనుగోలు చేసినట్టు తెలిపారు. కాగా.. ఆండ్రూ కామెంట్లపై ట్రంప్ కూడా స్పందించారు. న్యూయార్క్ గవర్నర్ చెప్పిన వాటిలో నిజం లేదంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఆయన డెమొక్రట్ కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. ఏ రాష్ట్రానికి వెంటిలేటర్ కావాలన్నా వెంటనే పంపించడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం దగ్గర పది వేల వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయని ఎవరికి అవసరమైతే వారికి వాటిని పంపుతామన్నారు.

Updated Date - 2020-04-02T03:33:14+05:30 IST