నిగ్గుతేలిన భూఅక్రమాలు

ABN , First Publish Date - 2021-09-01T06:59:46+05:30 IST

మార్కాపురం మండలంలో జరిగిన భూఅక్రమాల నిగ్గు తేలింది. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై వేటుపడింది.

నిగ్గుతేలిన భూఅక్రమాలు
మార్కాపురంలోని తహసీల్దార్‌ కార్యాలయం (ఇన్‌సెట్‌లో) తహసీల్దార్‌ విద్యాసాగరుదు

378.89 ఎకరాలు అన్యాక్రాంతం

11 మంది వీఆర్వోలు, ఒక సర్వేయర్‌ సస్పెన్షన్‌

కంప్యూటర్‌ ఆపరేటర్‌ విధుల నుంచి తొలగింపు

విశ్రాంత తహసీల్దార్‌పై క్రిమినల్‌ కేసుకు కలెక్టర్‌ సిఫార్సు

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఆర్డీవోకు అధికారాలు

మార్కాపురం, ఆగస్టు 31: మార్కాపురం మండలంలో జరిగిన భూఅక్రమాల నిగ్గు తేలింది. బాధ్యులైన రెవెన్యూ అధికారులపై వేటుపడింది. జూన్‌ 30న ఉద్యోగ విరమణ చేసిన తహసీల్దార్‌ పి.విద్యాసాగరుడుపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఆయన రిటైర్డ్‌ కావడానికి ముందు జూన్‌ నెలలో చేసిన భూఅక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జేసీ వెంకటమురళి ఆదేశాల మేరకు వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రత్యేక కలెక్టర్‌ సరళావందనం విచారణ చేశారు. జూన్‌లో  మార్కాపురం మండలంలో మొత్తం 587 ఫైళ్ల మ్యుటేషన్‌ జరిగినట్లు గుర్తించిన ఆమె వాటన్నింటినీ సునిశితంగా పరిశీలించారు. వాటిలో 465 ఫైళ్లలో 702.01 ఎకరాలను ఆన్‌లైన్‌లో మార్చినట్లు నిర్ధారించారు. అందులో 378.89 ఎకరాలు అక్రమంగా చేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి రిటైర్డ్‌ తహసీల్దార్‌ విద్యాసాగరుడుపై క్రిమినల్‌ కేసు నమోదుకు సిఫార్సు చేస్తూ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే  ఏఆర్‌ఐ గోపీ, ఇద్దరు వీఆర్వోలు సస్పెన్షన్‌కు గురికాగా.. మరో 11మంది వీఆర్వోలు, ఒక విలేజ్‌ సర్వేయర్‌ను ఆయన మంగళవారం సస్పెండ్‌ చేశారు. 


378.89 ఎకరాల భూమి అన్యాకాంత్రం

మార్కాపురం మండలంలో జూన్‌లో జరిగిన మ్యుటేషన్లలో మొత్తం 378.89 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్లు విచారణలో వెల్లడైంది. అందులో చింతగుంట్లలో అత్యధికంగా 89.30 ఎకరాల భూమిలో అక్రమాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. ఇడుపూరులో 77.08, రాయవరంలో 65.13, పెద్దయాచవరంలో 45.03, భూపతిపల్లిలో 29.76, గజ్జలకొండలో 19.73 ఎకరాలు, జమ్మనపల్లిలో 15.18, గోగులదిన్నెలో 14.32, మార్కాపురంలో 10.45, శివరాంపురంలో 5.66, మాల్యవంతుని పాడులో 4.01, బొందలపాడులో 2.08, కోలభీమునిపాడులో 0.68, నికరంపల్లిలో 0.41, బడేఖాన్‌పేటలో 0.02 ఎకరాల భూమి అక్రమంగా ఆన్‌లైన్‌ జరిగినట్లు అధికారులు తేల్చారు. 


12 మంది రెవెన్యూ సిబ్బందిపై వేటు 

మార్కాపురం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌ఐ గోపీ, ఇద్దరు వీఆర్వోలు గాయం సుబ్బారెడ్డి(రాయవరం), మాకం కోటయ్య(మార్కాపురం-4)లను గతంలో సస్పెండ్‌ చేశారు. మంగళవారం మరో 11 మంది వీఆర్వోలను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఎస్‌.శ్రీనివాసరెడ్డి(మార్కాపురం-2), కె.రాజశేఖర్‌రెడ్డి (మార్కాపురం-3), జి.శ్రీనివాసరెడ్డి(గజ్జలకొండ-1), వై.గోవిందరెడ్డి (గజ్జలకొండ-2), షేక్‌ ఖాసింవలి(పెద్దయాచవరం), వై.కాశీవిశ్వేశ్వరరెడ్డి(నాయుడుపల్లి), వి.వి.కాశిరెడ్డి(ఇడుపూరు), ఐ.చలమారెడ్డి(కోలభీమునిపాడు), డి.మస్తాన్‌వలి (చింతగుంట, బడేఖాన్‌పేట), ఎం.రామచంద్రరావు(కొండేపల్లి, కృష్ణాపురం, తేల్లాపురం), పి.మల్లికార్జున్‌(భూపతిపల్లి, బొందలపాడు) ఉన్నారు. చింతగుంట్ల గ్రామ సచివాలయ సర్వేయర్‌ ఎం.విష్ణుప్రసన్నకుమార్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. అలాగే మార్కాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పి.నాగరాజును విధుల నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. 


మార్కాపురం ఆర్డీవోకు అధికారాలు

రిటైర్డ్‌ తహసీల్దార్‌ విద్యాసాగరుడు ఆన్‌లైన్‌లో చేసిన ప్రభుత్వ భూముల మ్యుటేషన్లను సరిదిద్దే అధికారాన్ని మార్కాపురం ఆర్డీవో లక్ష్మీశివజ్యోతికి కలెక్టర్‌ అప్పగించారు. వివాదాస్పద పట్టా భూములకు సంబంధించి ఆర్డీవో కోర్టులో అప్పీల్‌ చేయాలని మార్కాపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. 


Updated Date - 2021-09-01T06:59:46+05:30 IST