Shocking : ఆమె MBBS చదివి.. బాబా చేతిలో ఇలా మోసపోయిందేంటి.. అసలేం జరిగింది..!?

ABN , First Publish Date - 2021-09-07T19:03:36+05:30 IST

ఆమె ఎంబీబీఎస్‌ చేసింది. అయినప్పటికీ...

Shocking : ఆమె MBBS చదివి.. బాబా చేతిలో ఇలా మోసపోయిందేంటి.. అసలేం జరిగింది..!?

  • డాక్టర్‌కు బురిడీ కొట్టిన బాబా
  • పరీక్షలో పాస్‌ అయ్యేందుకు పూజల పేరుతో డబ్బు వసూళ్లు

హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : ఆమె ఎంబీబీఎస్‌ చేసింది. అయినప్పటికీ బురిడీ బాబా చేతికి చిక్కి మోసపోయింది. ఫారెన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌లో పాస్‌ అయ్యేందుకు పూజలు చేస్తానంటే వేలాది రూపాయలు ముట్టచెప్పింది. చివరకు మోసపోయినట్లు గుర్తించి గచ్చిబౌలి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధి కొండాపూర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ (28) పశ్చిమ బెంగాల్‌లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎంట్రెన్స్‌ టెస్టు రాసినప్పటికీ సెలెక్ట్‌ కాలేదు.


తన సోదరి ఫేస్‌బుక్‌ చూస్తుండగా ఓ పోస్టు ఆమెను ఆకర్షించింది. బిశ్వజీత్‌జా అనే స్వామీజీ (బాబా) పూజలు చేస్తే ఎలాంటి పరీక్ష అయినా పాసవ్వచ్చనేది ఆ పోస్టు సారాంశం. దీంతో బాధితురాలి అక్క ఫేస్‌బుక్‌ఖాతాలో స్వామిజీకి మెసేజ్‌ పెట్టింది. స్వామీజీ స్పందించడంతో అతడికి సోదరి ఇబ్బందిని వివరించింది. జాతక దోషాలు ఉన్నాయని, అందుకే పరీక్షలో విజయం సాధించలేకపోతుందని స్వామీజీ చెప్పాడు. ఆమె స్వామీజీకి బాధితురాలి ఫోన్‌నెంబర్‌ ఇచ్చింది. స్వామీజీ శిష్యులు రంగంలోకి దిగి ఆన్‌లైన్‌లో బాధితురాలి పూర్తివివరాలు తెలుసుకున్నారు.


ఆమె హాల్‌ టికెట్‌, వివరాలు వాట్సా్‌ప్‌లో పంపారు. పరీక్షలో పాస్‌ కావాలంటే పూజలు చేయాలని అందుకు కొంత ఖర్చువుతుందని స్వామీజీ చెప్పాడు. ఆమె పలుమార్లు అతడి ఖాతాలో రూ.80 వేల దాకా జమ చేసింది. స్వామీజీకి మొదటి సారి 21,900 ఆన్‌లైన్‌లో పంపిన అనంతరం 2020 డిసెంబర్‌లో ఫారిన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు రాసింది. అప్పుడు కూడా పాస్‌కాలేదు. ఇలా ఎందుకు జరిగిందంటూ స్వామీజీని అడగడంతో పూజలో ఏదోలోపం జరిగి ఉంటుందని నమ్మించాడు. ఈ సారి కాలభైరవ ప్రత్యేక పూజ చేద్దామని చెప్పాడు. అందుకు బాధితురాలి నుంచి రూ.14వేలు, రూ.8వేలు ఇలా పలు మార్లు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. అనంతరం ఈ ఏడా ది కూడా పరీక్ష పాస్‌కాలేదు.


మళ్లీ స్వామీజీని ప్రశ్నించగా అతడి నుంచి స్పందన రాలేదు. దీంతో తా ను మోసపోయానని గుర్తించిన బాధితురాలు గచ్చిబౌలిలోని సైబర్‌క్రైం పోలీసులకు జూలై 30న ఫిర్యా దు చేసింది. ఆ స్వామీజీ అకౌంట్‌, ఫోన్‌నెంబర్‌ ఆ ధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ సురే ష్‌ తెలిపారు. నిందితుడు నార్త్‌ ఇండియన్‌ అయివుంటాడని భావిస్తున్నామన్నారు. నిందితుడి ఫొటోను సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఉన్నత విద్యావంతులు సైతం బాబాల చేతిలో మోసపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. బురిడీ బాబాకు డబ్బులు ఇచ్చి ఆరునెలలు గడవడంతో రికవరీకి కొంత సమయం పడుతుందన్నారు.

Updated Date - 2021-09-07T19:03:36+05:30 IST