అమెరికాలో కరోనా విలయం.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!

ABN , First Publish Date - 2020-04-03T22:42:55+05:30 IST

కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అమెరికాలో నమోదైనన్ని కరోనా కేసులు.. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇతర దేశంలో కూడా నమోదు కా

అమెరికాలో కరోనా విలయం.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!

వాషింగ్టన్: కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అమెరికాలో నమోదైనన్ని కరోనా కేసులు.. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇతర దేశంలో కూడా నమోదు కాలేదు. యూఎస్‌ఏలో ఇప్పటి వరకు 2.45లక్షల మందికి వైరస్ సోకింది. దాదాపు 6వేల మంది మరణించారు. ఈ నేపథ్యంలో చేసిన ఓ పరిశోధనలో కొన్ని షాకింగ్ నిజాలు బయటికొచ్చాయి. కరోనా వైరస్ సోకే అవకాశం, దాని తీవ్రత కేవలం వృద్ధులపై మాత్రమే అత్యధికంగా ఉంటుందని అంతా భావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మహమ్మారి బారిన పడిన వారిలో 50ఏళ్లలోపు వారి సంఖ్య కేవలం 10 నుంచి 15 శాతమే అని వెల్లడించింది.


కానీ.. తాజా గణాంకాలు ప్రస్తుతం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. తాజా పరిశోధన ప్రకారం కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌లో.. మహమ్మారి బారిన పడ్డ ప్రతి ఐదుగురిలో ఒకరు 50ఏళ్ల లోపువారే ఉన్నారు. ఓ మీడియా సంస్థకు ఇంటర్యూ ఇచ్చిన డాక్టరు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. కరోనా లక్షణాలతో కొద్ది రోజుల క్రితం తన వద్దకు వచ్చిన ఓ యువకుడికి  ఐసోలేషన్‌లో ఉంటూ, మెడికేషన్ తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. అనంతరం అదే యువకుడు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరినట్లు వివరించారు. 


కరోనా వైరస్ వృద్ధులపై అత్యధిక ప్రభావం చూపుతుందని ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు కూడా విశ్వసించాయని చెప్పారు. అందుకే యువకులు, మధ్యవయసు వారు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించినట్లు గుర్తుచేశారు. అయితే ఆయా దేశాల్లో కూడా మార్చి రెండో వారంనాటికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయిందన్నారు. అమెరికాలోలాగే.. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కూడా వైరస్ బారినపడిన యువకులు, మధ్య వయసు వారి సంఖ్య క్రమంగా పెరిగిందన్నారు.


అంతేకాకుండా వైరస్ ప్రభావం కేవలం వృద్ధులపై మాత్రమే అత్యధిక ఉంటుందనుకుంటే పొరపాటుపడ్డట్లే అని తేల్చి చెప్పారు. ఈ వైరస్ ప్రభావం అందరిపై ఓకేలా ఉంటుందని స్పష్టం చేశారు. యూఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్యపై చైనా ఇచ్చిన సమాచారంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. 


Updated Date - 2020-04-03T22:42:55+05:30 IST