California స్కూళ్లల్లో షాకింగ్ పరిణామం.. విద్యార్థుల తల్లిదండ్రులే నేరుగా పాఠశాలలకు వెళ్లి..

ABN , First Publish Date - 2021-08-29T08:46:30+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడి స్థానిక స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలలకు వెళ్లి నిరసనలు చేయడం ప్రారంభించారు.

California స్కూళ్లల్లో షాకింగ్ పరిణామం.. విద్యార్థుల తల్లిదండ్రులే నేరుగా పాఠశాలలకు వెళ్లి..

ఎన్నారై డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడి స్థానిక స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా పాఠశాలలకు వెళ్లి నిరసనలు చేయడం ప్రారంభించారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడి స్కూళ్లు పాటిస్తున్న కొన్ని విధానాలు. ఇటీవలి కాలంలో డెల్టా వేరియంట్ విజృంభించడంతో అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాలో కూడా పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఎవరైనా పిల్లలు స్కూల్‌కు వెళ్లడానికి భయపడి ఆన్‌లైన్ క్లాసులకు దరఖాస్తు చేసుకున్నారో అంతే సంగతులు. ఇలా వర్చువల్ అకాడెమీ ఎంచుకున్న విద్యార్థులు మళ్లీ స్కూల్‌కు వచ్చి చదువుకోవాలంటే వెంటనే కుదరదు. వెయిటింగ్ లిస్టులో పడాల్సిందే. దీన్నే వర్చువల్ అకాడమీ విధానం అంటున్నాయీ స్కూళ్లు.


ఒక వేళ స్కూల్‌కు పిల్లలను పంపితే కరోనా భయం, స్కూల్ వద్దంటే మళ్లీ స్కూల్లో అడుగు పెట్టడం ఆలస్యమవుతుందనే భయం.. ఈ రెంటి మధ్య తల్లిదండ్రులు నలిగిపోతున్నారు. వీళ్లలో అత్యధికులు మంచి స్కూల్ కోసం ఆ పరిసర ప్రాంతాల్లో మిలియన్ డాలర్లు పెట్టి ఇల్లు కొనుక్కున్న వాళ్లే. దీంతో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ‘‘మా అమ్మాయికి వ్యాక్సిన్ వేయించాం. అయినా సరే స్కూల్‌కు వెళ్లిన వారానికే తనకు జ్వరం వచ్చేసింది. కరోనా తనకు రాకపోయినా తన నుంచి ఇంట్లో పెద్దవాళ్లకు వస్తే పరిస్థితేంటి?’’ అని కొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఊహే భయంకరంగా ఉందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని స్కూళ్లకు వెళ్లిన తల్లిదండ్రులు.. తమకు ఆన్‌లైన్ క్లాసులు కావాలని, వాటితోపాటు స్కూల్‌కు రావాలనుకున్నప్పుడు ‘హోం స్కూల్ స్పాట్’ (స్కూలుకు వచ్చి చదువుకునే అనుమతి) కావాలని డిమాండ్లు చేస్తున్నారు.

Updated Date - 2021-08-29T08:46:30+05:30 IST