టూరిజంలోనూ ‘దుకాణం’

ABN , First Publish Date - 2021-06-23T09:09:51+05:30 IST

దశలవారీ మద్య నిషేధం అంటే ఏంటి? విడతల వారీగా షాపులు తగ్గించడం! కానీ విచిత్రమైన పేర్లతో విలాసవంతంగా కొత్త రకం మద్యం షాపులను అందుబాటులోకి తెస్తే దాన్ని ఏమనాలి? దాని ఉద్దేశం, లోగుట్టు వైసీపీ ప్రభుత్వ పెద్దలకే తెలియాలి

టూరిజంలోనూ ‘దుకాణం’

మందుపై మరింత రాబడే లక్ష్యంగా టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్లు

వంద వరకు పెడుతున్న సర్కారు

ప్రీమియం సరుకు మాత్రమే విక్రయం

భారీగా లాభాలు పిండుకునేందుకేనా?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దశలవారీ మద్య నిషేధం అంటే ఏంటి? విడతల వారీగా షాపులు తగ్గించడం! కానీ విచిత్రమైన పేర్లతో విలాసవంతంగా కొత్త రకం మద్యం షాపులను అందుబాటులోకి తెస్తే దాన్ని ఏమనాలి? దాని ఉద్దేశం, లోగుట్టు వైసీపీ ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. నిన్న మద్యం మాల్స్‌! ఇప్పుడు టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్లు (టీఎ్‌ఫసీ)! పేరు ఏదైనా వీలైనంత ఎక్కువ మద్యం అమ్మడమే ఎక్సైజ్‌ శాఖ లక్ష్యం. కొత్తగా పర్యాటక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు పెంచేందుకు పెడుతున్న టీఎ్‌ఫసీల నుంచీ మరింత ఆదాయం రాబట్టుకొనేందుకు సిద్ధమవుతోంది. దీనిపై గతంలోనే ప్రతిపాదనలు సిద్ధంచేయగా, కొద్దికాలం కిందట ఎక్సైజ్‌ అనుమతులు మంజూరుచేసింది. తాజాగా విశాఖ సహా మరికొన్ని నగరాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వంద సెంటర్లు ఏర్పాటుచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం టూరిజం శాఖకు అద్దె చెల్లించనున్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. 


2020-21లో రూ.17500 కోట్ల ఆదాయం మద్యం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది. దాన్ని రూ.20వేల కోట్లు దాటించే విధంగా బడ్జెట్‌లో అంచనాలు వేసి.. అందుకు అనుగుణంగా చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఇప్పటికే వాకిన్‌ సెంటర్ల పేరుతో మద్యం మాల్స్‌ ఏర్పాటుచేసింది. ఖరీదైన బ్రాండ్లు కొనేవారు క్యూ లైన్లలో నిలబడేందుకు ఇబ్బందిపడుతున్నారన్న ఉద్దేశంతో ఈ మాల్స్‌ తెచ్చింది.  మద్య నిషేధం చేసే రాష్ర్టానికి విలావంతమైన మద్యం షాపులు పెట్టాల్సిన అవసరం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. కానీ పైకి దశలవారీ నిషేధమని చెబుతున్నా లోలోపల ఆదాయం పెంచుకునే మార్గాలపైనే దృష్టిపెట్టింది.


ఏమిటీ సెంటర్లు?

సాధారణ మద్యం షాపుల తరహాలోనే టూరిజం ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఉంటాయి. అయితే సాధారణ షాపుల్లోలాగా చీప్‌ లిక్కర్‌, మీడియం రకం బ్రాండ్లు కాకుండా ప్రీమియం బ్రాండ్లు మాత్రమే వాటిలో అమ్మాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే టూరిజం శాఖ పరిధిలో 13 బార్లు ఉన్నాయి. ఇటీవల మరో 21 బార్లు మంజూరుచేశారు. అయితే వాటిని టూరిజం శాఖే నిర్వహిస్తుంది. కేవలం మద్యం సరఫరా చేయడం తప్ప ఎక్సైజ్‌ శాఖకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు బార్లతో పాటు మరింత అమ్మకాలు పెంచేందుకు ఎక్సైజ్‌ శాఖే పర్యాటక ప్రాంతాల్లో షాపులు పెడుతోంది. దానివల్ల టూరిజం బార్లకు వెళ్లలేని వారికి షాపుల్లో మద్యం దొరుకుతుంది. అటు బార్లు, ఇటు షాపులు ఉంటే అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2021-06-23T09:09:51+05:30 IST