12 దాటితే అన్నీ మూతే..!

ABN , First Publish Date - 2021-05-05T07:09:49+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమలకు యధావిధిగా బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

12 దాటితే అన్నీ మూతే..!

తిరుమలకు యధావిధిగా బస్సులు


చిత్తూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం బుధవారం నుంచి కఠిన నిబంధనలతో కర్ఫ్యూను ప్రకటించింది. నేటి నుంచి రెండు వారాల పాటు తాజా నిబంధనలు అమలు కానున్నాయి. ఇప్పటికే జిల్లాలోని నగరాలు, పట్టణాలు సహా కొన్ని మండలాల్లో స్వచ్ఛంద పాక్షిక లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఆయా ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత పలురకాల ఆంక్షలు అమలవుతున్నాయి.అయితే మద్యం దుకాణాలు తెరచుకునే ఉండడం, రవాణా సేవలకు అనుమతి ఉండడం, బయట తిరిగే వాహనాలు, ప్రజల పట్ల పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఈ పాక్షిక లాక్‌డౌన్‌ కరోనా కట్డడికి ఉపయోగపడలేదు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ సక్రమంగా అమలైతే.. కరోనాను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆ తర్వాత మద్యం సహా అన్నిరకాల దుకాణాలూ మూత పడతాయి. అత్యవసరాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. 12 తర్వాత 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఐదుగురికి మించి గుమికూడరాదు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా రోడ్ల మీద కనిపించకూడదు. 12 గంటల తర్వాత సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా బస్సులకు, ఇతర వాహనాలకు అనుమతి ఇవ్వలేదు.అయితే తిరుపతి-తిరుమల మధ్య మాత్రం ఆర్టీసీ బస్సులను నడిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చెన్నై, వేలూరులకు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులను మాత్రం రద్దు చేశారు. సొంతవాహనాలు, ట్యాక్సీల్లో వచ్చే భక్తులు 12 గంటలలోపు అలిపిరికి చేరుకుని దర్శన టికెట్లు చూపితేనే తిరుమలకు అనుమతించనున్నారు.


ఇక రోడ్లన్నీ ఖాళీనే

జిల్లాలోని అన్ని రకాల డిపోల పరిధిలో 1382 బస్సు సర్వీసులుండగా.. వీటి ద్వారా రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వస్తోంది. అలాగే స్కూటర్లు, ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు వంటి వాహనాలు 1,27,041 ఉన్నాయి. నేటి మధ్యాహ్నం నుంచి అవన్నీ ఇక రోడ్ల మీద కనిపించకూడదు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా మన జిల్లాకు బస్సు సర్వీసులున్నాయి. నేటి మధ్యాహ్నం నుంచి ఆయా రాష్ట్రాల సరిహద్దులను మూసేస్తున్నారు.అలాగే జిల్లాలో 285 ప్రభుత్వ మద్యం షాపులున్నాయి. వీటితో పాటు 39 బార్‌ అండ్‌ రెస్టారెంట్లున్నాయి. ప్రస్తుతం పాక్షిక లాక్‌డౌన్‌ అమలు అవుతున్న ప్రాంతాలు సహా అన్నిచోట్లా మద్యం దుకాణాలు ఉదయం 11 నుంచి  రాత్రి 8 గంటల వరకు తెరచుకుంటున్నాయి.తాజా నిబంధనల ప్రకారం బుధవారం నుంచి మద్యం షాపులు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరచుకోనున్నాయి. బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.


ఆలయాల్లో ఏకాంత సేవలు

దేవాదాయశాఖ సహా ప్రైవేటు ఆలయాలు, మఠాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. తీర్థ ప్రసాదాలు, హారతి, శఠగోపం ఉండవు. మధ్యాహ్నం తర్వాత ఆలయాలు మూసేసి భక్తులు లేకుండా ఏకాంత సేవలు నిర్వహిస్తారు. ఈ మేరకు జిల్లా అర్చక సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వర ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌, సెక్రటరీ సుధాకర్‌ గురుకుల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


ఎకో టూరిజం, పార్కులు మూసివేత

జిల్లా అటవీ శాఖ పరిధిలోని ఏకో టూరిజం పార్కులు మూసివేయనున్నట్లు అటవీ శాఖ జిల్లా పశ్చిమ, తూర్పు డివిజన్‌ డీఎఫ్‌వోలు నరేంద్రన్‌, రవిశంకర్‌లు తెలిపారు. తూర్పు డివిజన్‌ పరిధిలోని వరదయ్యపాళ్యం మండలంలోని ఉబ్బలమడుగు ఎకో టూరిజం, చిత్తూరు నగరంలో గంగిరేణి చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నగరవనం, దానికి సమీపంలోని జింకల పార్కు మూసివేస్తున్నారు. అదే విధంగా పశ్చిమ డివిజన్‌ పరిధిలోని మదనపల్లెలోని హార్సీలీ హిల్స్‌, కమ్యూనిటీ బేస్డ్‌ ఏకో టూరిజం, రామకుప్పం మండలంలో ఏర్పాటు చేసిన ననియాల ఎకో టూరిజం కేంద్రాలు మూతబడనున్నాయి.


పెట్రోల్‌, గ్యాస్‌ కృత్రిమ కొరత సృష్టించొద్దు: జేసీ

ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు, ఆయిన్‌- గ్యాస్‌ కంపెనీలు వినియోగదారులకు సరిపోయేంత స్టాకును సిద్ధంగా ఉంచుకోవాలని రెవెన్యూ జేసీ మార్కండేయులు ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సంబంధిత కంపెనీల ప్రతినిధులు, పోలీసులతో సమావేశమయ్యారు. వినియోగదారులకు సమస్యలుంటే కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూంలోని డిప్యూటీ తహసీల్దార్లకు 9440919025, 7386011171, 9866655986 నెంబర్లలో ఫిర్యాదు చేయాలన్నారు.


కర్ఫ్యూ సమయంలో మూతపడేవి...

 అన్ని రకాల దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు


 కర్ఫ్యూ సమయంలో అనుమతి ఉన్నవి

 ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవలు

 పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు, విద్యుత్‌ కార్యాలయాలు,  నీటి సరఫరా, పారిశుధ్యం, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీస్‌, కరోనా జాగ్రత్తలతో పరిశ్రమలకు అనుమతి.

 కోర్టు ఉద్యోగులు, నగరపాలక, పురపాలక ఉద్యోగులు, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు అవసరాన్ని బట్టి గుర్తింపు కార్డులతో తిరగొచ్చు.

 వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందితో పాటు ప్రభుత్వ,, ప్రైవేటు వైద్యసేవలందించే సిబ్బంది గుర్తింపుకార్డులతో తిరగొచ్చు. 

 గర్భిణులు, వ్యాధిగ్రస్థులు వైద్య అవసరాలకు తిరగవచ్చు

 వైద్య సేవల్లో భాగంగా తిరిగే వాహనాలకు అనుమతి

 విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌కు టికెట్‌ కలిగి వెళ్లే ప్రయాణికులకు అనుమతి

ఇప్పటికే నిర్ణయించిన  వివాహాది కార్యక్రమాలకు కేవలం 20 మందితో అనుమతి. దానికి కూడా స్థానిక అధికారుల అనుమతి తప్పనిసరి.

Updated Date - 2021-05-05T07:09:49+05:30 IST