షాపులు రెడీ

ABN , First Publish Date - 2020-05-27T08:58:00+05:30 IST

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలకుపైగా మూతబడిన వస్త్ర, నగలు, పాదరక్షల దుకాణాలు ఇక తెరచుకోనున్నాయి! అవే కాకుండా, రహదారుల పక్కన ఆహార పదార్థాలను

షాపులు రెడీ

  • నగలు, వస్త్రాలు, చెప్పుల దుకాణాలకు ఓకే
  • షరతులతో పురపాలక శాఖ అనుమతి
  • తోపుడు బళ్లపై ఆహార విక్రయాలకూ ఓకే
  • పానీపూరీ విక్రయాలపై మాత్రం నిషేధం
  • మాస్కు, శానిటైజ్‌ తర్వాతే షాపులోకి
  • రిజిస్టర్‌లో కొనుగోలుదారుల పేర్లు
  • గ్లౌజులుంటేనే ఆభరణాలను తాకాలి
  • పెద్ద షాపుల్లో ప్రీ బుకింగ్‌ తప్పనిసరి
  • ట్రయల్‌ రూమ్‌లను అసలే వాడొద్దు
  • డిజిటల్‌ లావాదేవీలే ప్రోత్సహించాలి
  • పాదరక్షల డిస్‌ఇన్ఫెక్షన్‌కు ఏర్పాట్లు
  • లాంజ్‌లో ప్రత్యామ్నాయ సీటింగ్‌


అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలకుపైగా మూతబడిన వస్త్ర, నగలు, పాదరక్షల దుకాణాలు ఇక తెరచుకోనున్నాయి! అవే కాకుండా, రహదారుల పక్కన ఆహార పదార్థాలను (పానీపూరీ వంటివి మినహాయించి) అమ్మేవారు కూడా మళ్లీ తమ వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు! ఈ మేరకు తగు షరతులతో అనుమతిస్తూ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నిరోధానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, సిబ్బంది సహా కొనుగోలుదారులంతా తప్పనిసరిగా మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించేలా చూడాలని ఆదేశించారు. భారీ దుకాణాలకు వచ్చే కొనుగోలుదారులు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకుని, ఆ తర్వాత వచ్చేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గతవారంలో పలు ఇతర దుకాణాలను తెరచుకునేందుకు అనుమతించే సందర్భంలో అవి పాటించాలని నిర్దేశించిన నిబంధనలన్నీ వీటికి వర్తిస్తాయని శ్యామలరావు తెలిపారు.


ఈ జాగ్రత్తలు పాటించాలి...

1) భారీస్థాయి దుకాణాల సందర్శకులు ఆన్‌లైన్‌లో పేర్లు బుక్‌ చేసుకున్న తర్వాతే రావాలి. కొనుగోలుదారులతో పాటు సిబ్బందికి కూడా థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలి. చేతులను శానిటైజ్‌ చేసిన తర్వాత లోనికి అనుమతించాలి. 2) సిబ్బంది మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించాలి. 3) భారీ దుకాణాలు- ఫ్రాంచైజ్‌ల నిర్వాహకులు.. సందర్శకుల పాదరక్షల డిస్‌ఇన్ఫెక్షన్‌ కోసం ఏర్పాట్లుచేయాలి. 4) కొవిడ్‌ లక్షణాలున్న కస్టమర్లు లేదా సిబ్బందిని లోనికి అనుమతించరాదు 5) ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలతోపాటు ప్రతి కౌంటర్‌ వద్ద శానిటైజర్లను ఉంచాలి. 6) కొనుగోలుదారుల పేర్లు, వివరాలు నమోదు చేసేందుకు ప్రవేశద్వారాల వద్ద రిజిస్టర్లు ఉంచాలి. 7) నగల దుకాణాల్లో వినియోగదారులకు డిస్పోజబుల్‌ గ్లౌజులు అందజేయాలి. 8) ట్రయల్‌ రూమ్స్‌కు అనుమతి లేదు 9) వాలెట్‌ పార్కింగ్‌ సదుపాయమున్న దుకాణాలు.. కొనుగోలుదారుల కార్ల తాళాలు శానిటైజ్‌ చేయాలి. పార్కింగ్‌ ప్రదేశాల్లో ఉద్యోగులు మాస్క్‌లు, గ్లౌజ్‌లు వేసుకోవాలి 10) టాయ్‌లెట్లలో శానిటైజర్లు, సబ్బులు, పేపర్‌ న్యాప్‌కిన్లను అందుబాటులో ఉంచాలి 11) లిఫ్ట్‌లో సిబ్బంది మాత్రమే బటన్లు ఆపరేట్‌ చేయాలి. 12) కస్టమర్లంతా ఆరడుగుల దూరం పాటించేలా టేపులు/ రంగులతో వృత్తాలు గీయించాలి. 13) లాంజ్‌ ఏరియాల్లో ఆల్టర్నేట్‌ సీటింగ్‌ ఉండాలి. రిఫ్రె్‌షమెంట్లు, వార్తాపత్రికలు, మేగజైన్లు ఉంచరాదు. 14) నగదు లావాదేవీలను తగ్గించి, డిజిటల్‌ పేమెంట్లు పెంచేందుకు ప్రయత్నించాలి.


సంచార ఆహార విక్రయశాలలు: 1) తీసుకుని వెళ్లి తినేందుకే తప్ప అక్కడికక్కడే తినేందుకు అనుమతి లేదు. 2) మున్సిపల్‌ కమిషనర్లు జారీచేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉన్న స్ట్రీట్‌వెండర్లు మాత్రమే వ్యాపారాలు చేసుకోవాలి. అవి లేనివారు దగ్గర్లోని వార్డు సచివాలయాలకు వెళ్లి, గుర్తింపు కార్డులు పొందవచ్చు. 3) విక్రేతలందరూ మాస్క్‌లు, చేతి గ్లౌజ్‌లను ధరించాలి 4) పానీపూరీ వంటి ఆహార పదార్థాలను విక్రయించరాదు 5) మాస్క్‌లు ధరించనివారికి ఆహార పదార్థాలను అమ్మరాదు. ఏకకాలంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా చూడాలి. 6) ఒకే ప్రదేశంలో ఉండి అమ్మకాలు జరిపే వ్యాపారులు ముగ్గుపొడి లేదా బ్లీచింగ్‌ పౌడర్‌తో కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించేలా బండ్ల ముందు వృత్తాలు గీయాలి. భౌతికదూరం పాటించాలి. 7) విక్రేతలు సబ్బు లేదా శానిటైజర్లు, శుభ్రమైన తువ్వాలును తప్పనిసరిగా దగ్గర ఉంచుకుని కనీసం ప్రతి అర్ధగంటకు ఒకసారి చేతులను శుభ్రపరచుకుంటూ ఉండాలి. 8) కొవిడ్‌ లక్షణాలున్న వారు విక్రయాలు చేయరాదు.

Updated Date - 2020-05-27T08:58:00+05:30 IST