నీరుగారుతున్న దళిత బస్తీ...

ABN , First Publish Date - 2020-08-03T10:30:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బస్తీ పథకాన్ని భూముల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని నిరుపేద

నీరుగారుతున్న దళిత బస్తీ...

జిల్లాలో వేధిస్తున్న భూముల కొరత

విక్రయాలకు ముందుకు రాని పట్టేదారులు

మార్కెట్‌ ధర లభించకపోవడంతో అనాసక్తి

అధికారుల ప్రకటనలకు స్పందన కరువు

జిల్లాలో ఇప్పటి వరకు సేకరించింది శూన్యం


మంచిర్యాల టౌన్‌, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బస్తీ పథకాన్ని భూముల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు 2014లో కేసీఆర్‌ ప్రభుత్వం దళిత బస్తీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిం చే దళిత నిరుపేదలు జీవనాధారం కోసం వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం దళిత బస్తీ కింద ఒక్కో కుటుంబానికి మూడెకరాల స్థలం ఇవ్వ డం ద్వారా వారిని భూ యజమానులుగా తీర్చిదిద్దడంతోపాటు వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని నిర్ణయించింది. లబ్ధిదారులను మూడు సెగ్మెంట్లు రూరల్‌, సెమీ అర్బన్‌, అర్బన్‌ దళితులుగా విభజించి భూ పంపిణీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కుటుంబంలోని మహిళ పేరిట భూమి పట్టా జారీ చేయడంతోపాటు రిజిస్ట్రేషన్‌, ఇతర ఖర్చులు ప్రభుత్వమే భరించేలా పథకాన్ని రూపొందించింది. అయితే అనుకున్న రీతిలో అమలు చేయకపోవడంతో జిల్లాలో దళిత బస్తీ పథకం నీరుగారుతోంది. 


ముందుకు సాగని పథకం...

భూముల కొరత కారణంగా జిల్లాలో దళితబస్తీ పథకం ముందుకు సాగడం లేదు. మంచిర్యాల జిల్లాగా ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఒక్క దళిత కుటుంబానికి కూడా భూమి మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మినహా ఇటీవల కాలంగా నిరుపేద దళితులకు భూ పంపిణీ జరుగలేదు. గ్రామాల పరిధిలో సరిపడినన్ని ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం, పట్టా భూములు విక్రయించేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో జిల్లాలో ఈ పథకం నీరుగారుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం అధికారులు పట్టేదారుల నుంచి భూమి కొనుగోలు కోసం ఇటీవల ప్రకటనలు విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద బ్యానర్లు కట్టడం లాంటి చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఇంత వరకు లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు దరఖాస్తు ప్రక్రియ కూడా చేపట్టలేదు. పంపిణీకి సరిపడా భూములు అందుబాటులో లేనిదే లబ్ధిదారుల ఎంపిక చేపడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో అధికారులు ఆ దిశగా ముందుకు సాగడం లేదు. 


గిట్టుబాటు ధర లేకనే...

దళితులకు పంపిణీ చేసేందుకు పట్టేదారుల నుంచి భూములు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా గిట్టుబాటు ధర ప్రకటించక పోవడంతో యజమానులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసే భూముల ధర ఎకరానికి రూ. 2 లక్షల నుంచి 7 లక్షల వరకు ప్రకటించింది. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు భూములు విక్రయించేందుకు యజమానులు ఆసక్తి కనబరచడం లేదు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన కన్నెపల్లి, వేమనపల్లి, భీమిని మండలాల్లో సైతం ఎకరాకు రూ. 7 లక్షలు పైనే ధర పలుకుతోంది. దీనికి తోడు జిల్లాలోని కొన్ని రకాల నేలలు పామాయిల్‌ తోటలకు పెంపకానికి అనువుగా ఉండటం తో ప్రస్తుతం వాటికి డిమాండ్‌ పెరిగింది. ఈ కారణంగా దళిత బస్తీ కింద పంపిణీ చేసేందుకు భూములు దొరకడం లేదు. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటిస్తే తప్ప భూము లు విక్రయించేందుకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 


రైతులు ముందుకు రావడం లేదు..ఎస్సీ సేవా సహకార సంఘం ఈడీ హరినాథ్‌రెడ్డి

జిల్లాలో దళిత కుటుంబాలకు పంపిణీ చేసేందుకు అవసరమైన భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నిసార్లు ప్రకటనలిచ్చినా భూములు విక్రయించేందుకు రైతులు ముందుకు రావడం లేదు. మార్కెట్లో భూముల ధరలు ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో అమ్మడానికి యజమానులు ఆసక్తి కనబరచడం లేదు. 

Updated Date - 2020-08-03T10:30:56+05:30 IST