ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత

ABN , First Publish Date - 2022-01-25T04:39:08+05:30 IST

జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత
రక్త పరీక్ష గది వద్ద వేచి ఉన్న రోగులు

సిరంజీలు లేక బయట కొంటున్న రోగులు      

గైనకాలజిస్టు లేక గర్భిణులకు ఇబ్బందులు

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 24 : జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. మందుల కొరత తీవ్రంగా ఉందని, సిరంజీలతో పాటు లేక ఇతర మందులను బయట దుకాణాల్లో తెచ్చుకోవాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు లేక నాలుగు నెలల నుంచి గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు, వైరల్‌ఫీవర్‌, దగ్గు, జలుబు, నొప్పుల జ్వరాలు అధికంగా ఉన్నాయని, సోమవారం ఆస్పత్రి ఆవరణం రోగులతో కిటకిటలాడింది. కొన్ని మందులు, సిరంజీలు లేకపోవడంతో రోగులు బయటకు వెళ్లి తెచ్చుకున్నారు. ఈ విషయంపై జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా మందుల కొరత జిల్లాలోనే ఉందన్నారు. ప్రస్తుతం ధరలు పెరిగాయని, ఇస్తున్న బడ్జెట్‌ తగ్గించడంతో సమస్యలు ఉన్నాయన్నారు. గైనకాలజిస్టు పోస్టు నాలుగు నెలలకు పైగా ఖాళీగా ఉందన్నారు. పులివెందులలోనే కాక ఇతర ప్రాంతాల్లో కూడా గైనకాలజిస్టు పోస్టులు భర్తీ కాలేదన్నారు. ఇక్కడికి ప్రతిరోజూ 400 మందికిపైగా ఓపీకి వస్తున్నారన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రి గ్రేడ్‌-1 ఫార్మసిస్టు బండారు దస్తగిరి మాట్లాడుతూ మందుల కొరత ఈనెల 20వ తేదీ నుంచి ఉందని, రెండు రోజుల నుంచి సిరంజీలు అయిపోయాయని, కడప నుంచి మందులు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిని ఎమ్మెల్యే సందర్శించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.



Updated Date - 2022-01-25T04:39:08+05:30 IST