కార్పొరేషన్‌లో ‘ఖాళీ’ పాలన

ABN , First Publish Date - 2021-06-16T04:41:36+05:30 IST

నెల్లూరు నగర పాలికను అధికారుల కొరత వేధిస్తోంది. పాలనాధినేతగా ఐఏఎస్‌ అధికారి ఉన్నప్పటికీ ఇతర కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండటం పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజా అవసరాలకు సంబంధించిన ముఖ్య విభాగాల అధికారుల స్థానాలు భర్తీ కాకపోవడం, ఆయా పోస్టుల్లో నెలల కాలంగా ఇన్‌చార్జులే పాలన సాగిస్తుండటంతో ప్రజా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. పాలనాపరంగా సంస్కరణలకు ఇన్‌చార్జులు సాహసించలేకున్నారు.

కార్పొరేషన్‌లో  ‘ఖాళీ’ పాలన

నగరపాలికలో భర్తీకాని కీలక పోస్టులు

6 నెలలుగా డిప్యూటీ కమిషనర్‌ కరువు

ఏడాదైనా రాని ఏడీసీ 

డీసీపీ, ఏసీపీలుగా ఇన్‌చార్జులు 

టీపీఎస్‌, బీఐ స్థానాలూ ఖాళీ..

మితిమీరిన రాజకీయ జోక్యం

రావడానికి అధికారుల విముఖత

గాడి తప్పుతున్న పాలన


నెల్లూరు (సిటీ), జూన్‌ 15 : 


నెల్లూరు నగర పాలికను అధికారుల కొరత వేధిస్తోంది. పాలనాధినేతగా ఐఏఎస్‌ అధికారి ఉన్నప్పటికీ ఇతర కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండటం పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజా అవసరాలకు సంబంధించిన ముఖ్య విభాగాల అధికారుల స్థానాలు భర్తీ కాకపోవడం, ఆయా పోస్టుల్లో నెలల కాలంగా ఇన్‌చార్జులే పాలన సాగిస్తుండటంతో ప్రజా సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. పాలనాపరంగా సంస్కరణలకు ఇన్‌చార్జులు సాహసించలేకున్నారు. వారికి దిగువ స్థాయి ఉద్యోగుల నుంచి కూడా ఆశించిన మద్దతు లభించని దుస్థితి నెలకొంది. కమిషనర్‌గా దినేష్‌కుమార్‌ పాలనలో అనేక మార్పులు చేస్తున్నా... క్షేత్ర స్థాయిలో వాటి అమలు ఆశించినంతగా లేకపోవడంతో మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

ఇవన్నీ ఖాళీ..

పన్నుల వసూలులో సమర్థంగా వ్యవహరించి కార్పొరేషన్‌ ఖజానాను నింపుతూ, సంస్థ ఆర్థిక పరిపుష్ఠికి కృషి చేయాల్సిన డిప్యూటీ కమిషనర్‌ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. గతంలో ఆ కుర్చీలో ఉన్న పార్థసారఽథి పన్నుల వసూళ్లలో ఏర్పడిన వివాదంతో సుధీర్ఘ సెలవులోకి వెళ్లారు. అప్పటి నుంచి మరో అధికారిని నియమించలేదు. ఆర్వోగా ఉన్న సమ్మద్‌ ఇన్‌చార్జి హోదాలో డీసీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ నేతల ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో డిప్యూటీ కమిషనర్‌గా నెల్లూరుకు వచ్చేందుకు అధికారులు ఎవరూ సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతోంది. పైగా రాజకీయ నాయకుల అండ దండలతో ఏళ్ల నుంచి పాతుకుపోయిన వారే ఆర్‌ఐలుగా కొనసాగుతూ సమర్థుడైన అధికా రి రాకుండా తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


పారిశుధ్య పర్యవేక్షణ భాధ్యతలను చూడాల్సిన అదనపు కమిషనర్‌ పోస్టు ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఎంపీడీవోగా పని చేస్తున్న గోపీ డిప్యుటేషన్‌పై ఈ పోస్టులో కొంతకాలం పనిచేశారు. ఆయన కలెక్టర్‌ ఆగ్రహానికి గురై తిరిగి స్వస్థానానికి వెళ్లిపోయా రు. అప్పటి నుంచి ఈ కుర్చీ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్‌ కార్యదర్శిగా ఉన్న హేమావతి ఇన్‌చార్జి ఏసీగా ఉన్నప్పటికీ ఈ విభాగంలో అనేక కీలక నిర్ణయాలు, వాటి అమలు కుంటుపడుతోంది. 


కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సిటీ ప్లానింగ్‌ విభాగం దాదాపుగా ఇన్‌చార్జుల పాలనలోనే సాగుతోంది. జిల్లా ప్లానింగ్‌ అధికారి బాబురావు ప్రస్తుతం డీసీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు రెగ్యులర్‌ పోస్టులోనే సమయమంతా సరిపోతుం డగా కార్పొరేషన్‌ బాధ్యతలకు అతి తక్కువ సమయమే కేటాయించగలుగుతున్నారు. ఇక, ఏసీపీగా పనిచేసిన గుణశేఖర్‌ ఉద్యోగ విరమణ పొందడంతో ఆ పోస్టు  ఖాళీగా ఉంది. మరో ఏసీపీకి ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక టీపీఎస్‌ పోస్టులు ఆరు ఉండగా ప్రస్తుతం ఇద్దరే రెగ్యులర్‌ అధికారులు ఉన్నారు. అలాగే, ఇద్దరు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లకుగాను ఒక్కరే ఉన్నారు. ట్రేసర్లు ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒక్కరే పని చేస్తున్నారు. వీరంతా సాధారణ పాలనకే పరిమితం అవుతూ ఆక్రమ కట్టడాల జోలికి వెళ్లడం లేదు. దీంతో అనధికార నిర్మాణాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


భర్తీ ఎప్పుడో...?

నెల్లూరు నగర పాలక సంస్థలో కీలక పోస్టులన్నీ ఖాళీ అయి నెలలు గడుస్తున్నా ఒక్క పోస్టును కూడా భర్తీ చేయకపోవడం పలు కారణాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్‌లో  రాజకీయ జోక్యం, నాయకుల పెత్తనం, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పనిచేసేందుకు ఇతర ప్రాంతాల అధికారులు ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు తమకు అనుకూలమైన వారిని నియమించుకోవడం కోసం అధికార పార్టీ నేతలు వేచి చూసే ధోరణిలో ఉంటూ పోస్టులు భర్తీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా అధికారుల కొరతతో పాలన గాడి తప్పుతోంది. ఇన్‌చార్జులుగా బాధ్యతలు చేపట్టిన వారు ఆ పోస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. 

Updated Date - 2021-06-16T04:41:36+05:30 IST