హైదరాబాద్‌లో వెంటిలేటర్‌ అంబులెన్స్‌ల కొరత..

ABN , First Publish Date - 2021-05-04T12:52:12+05:30 IST

అత్యవసర సమయంలో ప్రాణాలను దక్కించేందుకు అంబులెన్స్‌ చేసే సాయం

హైదరాబాద్‌లో వెంటిలేటర్‌ అంబులెన్స్‌ల కొరత..

  • ప్రైవేటులోనూ అరకొరగానే లభ్యత
  • ‘గ్రేటర్‌’ పరిధిలో 200 మాత్రమే
  • కరోనా నేపథ్యంలో పెరిగిన డిమాండ్‌
  • రూ.20వేలకు పైగా చార్జీలు వసూలు
  • 108లో వెంటిలేటర్‌ సౌకర్యం కరవు

హైదరాబాద్‌ సిటీ : అత్యవసర సమయంలో ప్రాణాలను దక్కించేందుకు అంబులెన్స్‌ చేసే సాయం అంతా ఇంతాకాదు. వాటిల్లోనూ వెంటిలేటర్‌ ఉన్నవైతే.. రోగుల పాలిట సంజీనే. కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో నగరంలో వెంటిలేటర్‌ అంబులెన్సుల కొరత తీవ్రంగా ఉంది. నగరంలో వెంటిలేటర్‌ అంబులెన్సులు అత్యావశ్యకంగా మారాయి. డిమాండ్‌ పెరిగినా వాటి లభ్యత మాత్రం లేదు. ప్రైవేటులోనూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. పది కిలోమీటర్ల పరిధిలో ఒక వెంటిలేటర్‌ అంబులెన్స్‌ను బుక్‌ చేయాలంటే కనీసం రూ.20వేలు ఖర్చు పెట్టక తప్పడం లేదు. ఆ ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నా.. అంబులెన్స్‌ దొరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది.


కరోనాతో వెలుగులోకి..

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి, రోగుల అవసరాల నేపథ్యంలో నగరంలో వెంటిలేటర్‌ అంబులెన్సులు డిమాండ్‌ మేరకు లేవన్న విషయం వెలుగుచూసింది. 108కు ఫోన్‌ చేయగానే వచ్చే అంబులెన్సుల్లోనూ  ఆక్సిజన్‌ మాత్రమే ఉంటుంది. అది కూడా కొన్నింటిలోనే. ఖైరతాబాద్‌లో చింతలబస్తీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందాడు. శ్వాస సమస్య తలెత్తడంతో మలక్‌పేటలోని ఏరియా ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులు భావించారు. అప్పటికే శ్వాస అందకపోవడంతో వెంటిలేటర్‌ అమర్చాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఆస్పత్రికి వెంటిలేటర్‌ ఉన్న అంబులెన్స్‌ లేకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌ను రూ.22వేలకు మాట్లాడుకుని తరలించారు. ఇలాంటి ఘటనలు రోజూ నగరంలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. నగరంలో సుమారు పది వరకు అంబులెన్స్‌ సేవల సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల వద్ద ఉన్న అంబులెన్స్‌లలో సుమారు 70 నుంచి 80వరకు మాత్రమే వెంటిలేటర్‌ అంబులెన్స్‌లున్నాయి.


సామాన్యులను ఆదుకోండి..

ప్రైవేటు ఆస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెంటిలేటర్‌ అంబులెన్స్‌లు గ్రేటర్‌ పరిధిలో 100కు పైగా ఉన్నట్లు తెలిసింది. కార్పొరేట్‌ ఆస్పత్రులకు మాత్రమే ఒక్కో బ్రాంచ్‌కి కనీసం 2 నుంచి 3 వెంటిలేటర్‌ అంబులెన్స్‌లున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన 68ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి నుంచి ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులు భావించారు. కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ సంస్థకు రూ.18 వేలు చెల్లించాల్సి వచ్చింది. సెకండ్‌ వేవ్‌కు ముందు అంబులెన్స్‌ చార్జి రూ.6వేల లోపు మాత్రమే ఉండేది. ప్రస్తుత పరిస్థితి, ప్రైవేటు అంబులెన్స్‌ సంస్థలకు అవకాశంగా మారింది. దీంతో.. ప్రభుత్వం మరిన్ని వెంటిలేటర్‌ అంబులెన్సులను ఏర్పాటుచేసి, సామాన్యులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-05-04T12:52:12+05:30 IST