కూలీల కొరత.. యంత్రాల వాత!

ABN , First Publish Date - 2021-05-05T06:05:47+05:30 IST

కూలీల కొరత.. యంత్రాల వాత!

కూలీల కొరత.. యంత్రాల వాత!

  • హార్వెస్టర్‌కు గంటకు రూ.2400 వసూలు 
  •  ఆందోళన చెందుతున్న అన్నదాతలు

పరిగి: ఆరుగాలం శ్రమించి పండించిన పంట కోతకు వచ్చిన దశలో కూలీల కొరతతో  రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వరి పంట కోతకు వచ్చింది. అయితే వేసవి ఎండలు, ఆపై కరోనా కష్టాలు, కూలీల కొరతతో అష్టకష్టాలు పడాల్సి వస్తోందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా వరిపంట ఆశాజనకంగా ఉంది. జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 15,807 మంది రైతులు 69,667 ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు చేశారు. ప్రస్తుతం  వరి పంట చేతికిరావడంతో రైతులు పొలాల్లో బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే, ఎండవేడిమికి కూలీలు వరి కోత అంటేనే జంకుతున్నారు. ఒక్కో కూలీకి రూ.250, దావత్‌ ఇస్తామన్నా వారు వరికోతలకు రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కూలీల కొరతతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు యంత్రాలు కూడా దొరకక నానా అవస్థలు పడుతున్నారు. కూలీల కొరత కారణంగా యంత్రాల యజమానులు కూడా కిరాయిని పెంచేస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం వరికోత యంత్రానికి గంటకు రూ.1800-2000వరకు కిరాయి తీసుకునేవారు. ప్రస్తుతం గంటకు రూ.2100 నుంచి రూ.2400 తీసుకుంటున్నారు. కూలీలు, యంత్రాలు దొరకకపోవడంతో పాటు రెండు రోజులుగా వర్షాలు కూడా పడుతుండడంతో చేతికొచ్చిన పంట ఎక్కడ చేజారుతుందోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉపాధి పనులను పంట కోతలకు అనుసంధానం చేస్తే ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

  • కూలీలు వస్తే ఒట్టు

వరి పంట చేతికొచ్చి వారం అయింది. కోద్దామంటే కూలీ వస్తే ఒట్టు. మిషన్‌తో కోయిద్దామన్నా విపరీతమైన డిమాండ్‌. నాలుగైదు రోజులు వేచిచూసినా హార్వెస్టర్‌ దొరకడం లేదు. డిమాండ్‌ చూసి వారు కూడా రేట్లు పెంచుతున్నారు. ప్రభుత్వం యంత్రాల ధరను నియంత్రించి రైతులను ఆదుకోవాలి.

 -మేకల వెంకటయ్య, రైతు 

Updated Date - 2021-05-05T06:05:47+05:30 IST