భుజం భుజం కలిపి..

ABN , First Publish Date - 2020-10-01T05:38:48+05:30 IST

భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం అనేకమంది త్యాగధనులు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టారు. జాతీయోద్యమ చరిత్రలో గాంధీజీతో...

భుజం భుజం కలిపి..

అసంఖ్యాక ముస్లింలు గాంధీజీకి సన్నిహితంగా, ఉద్యమ భాగస్వాములుగా వెలుగొందారు. ఆ స్నేహబంధాలు భాగస్వామ్యాలు దేశ స్వాత్రంత్ర్యోద్యమంలో  ముస్లింలు నిర్వహించిన విశిష్ట పాత్రను విశదం చేస్తున్నాయి. ఈ వాస్తవాలను నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా తెలియజేయవలసిన అవసరమున్నది.


భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం అనేకమంది త్యాగధనులు తమ ధన ప్రాణాలను పణంగా పెట్టారు. జాతీయోద్యమ చరిత్రలో గాంధీజీతో భుజం భుజం కలిపి నడిచిన సహచరులు అసంఖ్యాకంగానే ఉన్నారు. అందులో ముస్లింల సంఖ్య కూడా లెక్కకు మిక్కిలి. మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా కొంతమంది ముస్లిం సహచరుల గురించి తెలుసుకోవటం, స్మరించుకోవటం సముచితం. గాంధీజీ స్వగ్రామం పోరుబందర్‌కు చెందిన‌ అబ్దుల్లాహ్ హాజీ ఆందం జవేరీ అనే ముస్లిం వ్యాపారి దక్షిణాఫ్రికాలో మెసర్స్‌ దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ పేరుతో వ్యాపారం నిర్వహించేవారు. ఆ వ్యాపారాలకు సంబంధించి అక్కడి న్యాయస్థానాల్లో కొన్ని వ్యాజ్యాలు నడిచేవి. తన కంపెనీ వ్యవహారాలు చూస్తున్న న్యాయవాదులకు సహకరించడానికి తమ గ్రామస్థుడైన యువన్యాయవాదిని పిలిపించుకుంటే బాగుంటుందని భావించిన అబ్దుల్లా, గాంధీజీని అక్కడికి రప్పించుకున్నారు. అప్పటి నుంచి ఆయన గాంధీకి అన్ని విషయాల్లో సహకరిస్తూ మార్గదర్శిగా నిలిచారు. 


ఈ క్రమంలో అబ్దుల్లా ద్వారా దక్షిణాఫ్రికాలో భారతీయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి గాంధీజీ తెలుసుకున్నారు. వాటిని ఆయన స్వయంగా చూశారు, అనుభవించారు కూడా. ఈ దుర్మార్గపు వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనే నిర్ణయానికొచ్చిన అబ్దుల్లా, గాంధీజీ ఇద్దరు కలసి ‘నాటల్ ఇండియన్ కాంగ్రెస్’ (ఎన్‌ఐసీ)అనే సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి దాదా అబ్దుల్లా అధ్యక్షుడు, గాంధీజీ కార్యదర్శి. హాజీ మహెమూద్, అబ్దుల్ ఖాదిర్, హాజీ హబీబ్, మూసా హాజీ ఆదం, సహా మరో 15మందికి పైగా ముస్లిం ప్రముఖులు ఉపాద్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులుగా ఉండేవారు. దాదా అబ్దుల్లా జీవించి ఉన్నంతకాలం గాంధీకి వెన్నుదన్నుగా ఉండి, అనేక విషయాల్లో మార్గదర్శకులుగా నిలిచారు. దక్షిణాఫ్రికాలో అబ్దుల్లా సహచర్యం గురించి ఆత్మకథలో వివరిస్తూ, ‘ప్రజాసేవ చేయాలనే కోరిక, దానికి కావలసిన శక్తి నాకు అక్కడే లభించాయి’ అని గాంధీజీ రాసుకున్నారు.


దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చాక ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చంపారన్ రైతాంగ పోరాటాన్ని భుజానికెత్తుకున్నారు. దీని కోసం ఆయన ఎంచుకున్న ఆయుధం దక్షిణాఫ్రికాలో విజయం సాధించిపెట్టిన ‘సత్యాగ్రహమే’. చంపారన్ రైతాంగ పోరాట నాయకులు షేక్ గులాబ్, ముహమ్మద్ మోనిస్ అన్సారీ గాంధీజీకి కుడిభుజంగా నిలిచి సహకరించారు. 


దక్షిణాఫ్రికాలో మాదిరిగానే ఆయన ఇక్కడ కూడా వివక్షను ఎదుర్కోక తప్పలేదు. పాట్నాలోని బాబూ రాజేంద్రప్రసాద్ (అప్పటికాయన న్యాయవాదే) ఇంటికి వెళ్లినప్పుడు ఆయన లేకపోవడంతో గాంధీజీని పని మనుషులు లోపలికి రానీయలేదు. కనీసం బావిలో నీళ్ళు తోడుకొని తాగడానికి గాని, మరుగుదొడ్డి వాడుకోడానికి గాని అనుమతించలేదు. ఈ విషయాలను గాంధీజీ ఆత్మకథలో రాసుకోవడమే కాకుండా, కొడుకు మదన్‌లాల్ గాంధీకి కూడా ఉత్తరం ద్వారా తెలియజేస్తూ, ‘బాబూజీ ఇంటి పనిమనుషులు మమ్మల్ని బిచ్చగాళ్ళకంటే హీనంగా పరిగణించార’ని రాశారు. లండన్లోని తన సహచరుడు అడ్వకేట్ మౌలానా మజ్హరుల్ హఖ్ పాట్నాలోనే ఉంటున్న విషయం గుర్తుకొచ్చి బాబూజీ ఇంట తనకెదురైన పరిస్థితిని వివరిస్తూ గాంధీజీ ఆయనకి కబురు పెట్టారు. మజ్హరుల్ హఖ్ ఆఘమేఘాల మీద గాంధీజీ దగ్గరికొచ్చి ఆయనకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సంఘటన గురించి కూడా గాంధీజీ ‘చంపారన్ మచ్చ’ పేరుతో ఆత్మకథలో రాసుకున్నారు. ఈ సంఘటన తరువాత ఆయన చంపారన్ చేరుకొని అక్కడి రైతుల గోసను విన్నారు. నీలిమందు సాగు చేయాలని ఆంగ్లపాలకులు తమపై జరుపుతున్న దాడుల్ని, దుర్మార్గాల్ని వాళ్లు ఏకరువు పెట్టారు. చంపారన్ రైతుల్లో గాంధీజీకి ఉన్న ఆదరణ, తదనంతర పరిణామాలనూ పసిగట్టిన బ్రిటిష్‌ అధికారి ఇర్విన్ ఆయన అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. గాంధీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు విషమిచ్చి చంపే బాధ్యతను తన ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న బతఖ్ మియా అన్సారీకి అప్పగించారు. గాంధీజీని చంపితే ఊహకు కూడా అందని బహుమతులతో సత్కరిస్తానని, పథకం విఫలమైతే నరకం చూపించి అనంత లోకాలకు పంపుతానని భయపెట్టాడు. కాని బతఖ్ మియా తన ప్రాణాలకు తెగించి బాపూజీ ప్రాణాలు రక్షించారు. ఆనాడు అన్సారీ రక్షించి ఉండకపోతే గాంధీజీ లాంటి నాయకుడు ఏమైపోయి ఉండేవాడో, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ఎలాంటి మలుపులు తిరిగేదో ఉహిస్తేనే భయమేస్తుంది.


చంపారన్ రైతాంగ పోరాటంలో విజయం సాధించిన గాంధీజీ భారత జాతీయ ఉద్యమంలోకి దూకారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అలీ బ్రదర్స్‌గా ప్రసిద్ధి చెందిన మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, మౌలానా షౌకత్ అలీ జౌహర్, వారి కుటుంబం అండదండలు గాంధీజీకి కొండంత బలాన్నిచ్చాయి. అలీ సోదరులతో గాంధీజీ ఎంతగా కలిసిపోయారంటే, వారి తల్లి ఆబాదీబాను బేగంకు తాను మూడవ సంతానమని చెప్పుకునేవారు. 


ఉద్యమ అవసరాల కోసం ఆపద్బాంధవుడిలా గాంధీజీని ఆదుకున్న మరో సహచరుడు ఉమర్ సుభానీ. బొంబాయిలో ఏ సమావేశం జరిగినా, ఎంత పెద్ద కార్యక్రమం నిర్వహించినా వాటికయ్యే ఖర్చులో సగానికి సగం ఉమర్ సుభానీ ఒక్కడే భరించేవాడు. అంతే కాకుండా ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేయడానికి అలుపెరుగని ప్రయత్నం చేసేవాడు. 1921లో తిలక్ స్వరాజ్యనిధికి విరాళాలు సేకరించే సమయంలో గాంధీజీకి బ్లాంక్ చెక్కు ఇచ్చి ఎంతకావాలో రాసుకోండి అన్న ఉదార గుణసంపన్నుడు ఉమర్ సుభానీ. గాంధీజీకి మరో ప్రాణ స్నేహితుడు ఇమాం అబ్దుల్ ఖాదిర్ బావజీర్. దక్షిణాఫ్రికా నుంచి కుటుంబంతో సహా ఆయన గాంధీ వెంట భారతదేశానికి వచ్చేశాడు. దక్షిణాఫ్రికాలో అత్యంత సంపన్న, విలాస జీవితాన్ని త్యాగం చేసి సబర్మతీ ఆశ్రమంలో సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడిన త్యాగధనుడు. ఆయన సతీమణి, ఇద్దరు కుమార్తెలు కూడా ఆశ్రమంలోని ప్రెస్‌లోనే పని చేసేవారు. అబ్దుల్ ఖాదిర్ కూతురు ఫాతిమా బేగం వివాహాన్ని గాంధీజీ స్వయంగా దగ్గరుండి జరిపించారు. 1920 ఏప్రిల్ 2న జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించి గాంధీజీ పేరిట ప్రచురితమైన ఆహ్వానపత్రిక భారత జాతీయోద్యమ సాహిత్య చరిత్రలో కలికితురాయిగా నిలిచిపోయింది. తను పెళ్ళిపెద్దగా వ్యవహరించి జరిపిన ఈ వివాహ విశేషాలను తన సారథ్యంలో వెలువడే నవజీవన్ పత్రికలో విశేషంగా ప్రచురించారు.


జాతి గర్వించదగ్గ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా -మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడు. 1920లో తొలిసారిగా గాంధీజీని కలుసుకున్నది మొదలు చివరివరకు ఆయనతో భుజంభుజం కలిపి నడిచారు. అహింసాపథంలో సాగిన ఖిలాఫత్ సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. దేశ విభజనను నిర్ద్వందంగా వ్యతిరేకించారు. పదేళ్ళకు పైగా జైలు జీవితం గడిపారు. భారతదేశానికి తొలి విద్యా మంత్రిగా సేవలందించారు. స్వాత్రంత్ర్యోద్యమ కాల మంతా గాంధీజీకి సన్నిహితంగా ఉంటూ ఉద్యమ భాగస్వాములుగా వెలుగొందిన ముస్లింల జాబితా చాలానే ఉంది. జాతీయోద్యమంలో వారి భాగ స్వామ్యానికి సంబంధించిన వాస్తవాల గురించి సంక్షిప్తంగానైనా ప్రజలకు పరిచయం చేయడం, ముఖ్యంగా యువతరానికి తెలియజేయడం మనందరి కర్తవ్యం.

యండి. ఉస్మాన్ ఖాన్

ఫ్రీలాన్స్ జర్నలిస్టు

Updated Date - 2020-10-01T05:38:48+05:30 IST