సాయిబాబా విడుదలకు గొంతు కలపండి!

ABN , First Publish Date - 2020-05-28T07:39:58+05:30 IST

నాగపూర్ సెంట్రల్ జైలులో డా.జి.ఎన్. సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దుర్భర స్థితిలో ఉన్నది. ఆయన పెరోల్ కోసం చేసుకున్న దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. సాయిబాబా సోదరుడి కుటుంబం కొవిడ్ కంటైన్మెంట్ జోనులో ఉండటాన్ని ఇందుకు...

సాయిబాబా విడుదలకు గొంతు కలపండి!

ఇప్పుడు సాయిబాబా పదే పదే సృహతప్పిపోతున్న సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి. పట్టుకోసం వేళ్ళను వంచలేని పరిస్థితికి చేరుకున్నారు. మూడుసార్లు ఛాతీలో నొప్పి వచ్చింది. అయినా జైలు అధికారులు మార్చి నుంచి ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్ళటం మానేశారు. జైలు అధికారులు ఆయనకే సాయమూ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు, ఆయన చావుకు ఆయన్ను వదిలేసినట్టు కనిపిస్తోంది.


నాగపూర్ సెంట్రల్ జైలులో డా.జి.ఎన్. సాయిబాబా ఆరోగ్య పరిస్థితి దుర్భర స్థితిలో ఉన్నది. ఆయన పెరోల్ కోసం చేసుకున్న దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. సాయిబాబా సోదరుడి కుటుంబం కొవిడ్ కంటైన్మెంట్ జోనులో ఉండటాన్ని ఇందుకు కారణంగా చూపింది. కానీ ఇది తప్పుడు సమాచారం. ఆయన సోదరుడి ఇల్లు ఏ రెడ్ జోన్‌లోనూ లేదు. నాగపూర్‌లోని వేసవి వేడి వల్ల సాయిబాబా ఆరోగ్యం అత్యంత క్షీణస్థితికి చేరింది. సాయిబాబా తన తొంభై శాతం అంగవైకల్యం, రెండు చేతులూ పూర్తిగా పనిచేయకపోవటం.. ఈ కారణాలను చూపుతూ ఇటీవల తనకు సహాయకులను ఏర్పాటు చేయమని పెట్టుకున్న విన్నపాన్ని జైలు తిరస్కరించింది. వైకల్యం కారణంగా ఆయన సాయం లేకుండా సొంత పనులు చేసుకోలేరు, టాయిలెట్‌కు కూడా పోలేరు, మంచం నుంచి వీల్‌చైర్‌కు కూడా మారలేరు.


ఆయన ఇదివరకు పెట్టుకున్న బెయిల్ అర్జీలను తిరస్కరించిన సందర్భంలో హైకోర్టు ఆయన కోసం ఇద్దరు సహాయకులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు చెప్పింది, కానీ ఈ సహాయకులు తమంతట తాము మంచితనంతో సాయం చేస్తున్న సహఖైదీలు మాత్రమే. జైలు అధికారులు ఆయనకు సాయంగా ఎలాంటి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఇప్పటిదాకా సాయం చేసిన ఆ ఇద్దరు ఖైదీలు వారి స్వంత ఇబ్బందుల వల్ల ఇక మీదట సాయం చేయలేమని అన్నారు. దీనివల్ల ఆయన ఒంటరిగా, తన మంచంలోంచి కూడా కదలలేని స్థితిలో, నిస్సహాయంగా మిగిలిపోయారు. కొత్త సహాయకుడి కోసం డా.సాయిబాబా చేసుకున్న విన్నపాన్ని జైలు అధికారులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇప్పుడు ఆయన పదే పదే సృహతప్పిపోతున్న సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి. పట్టుకోసం వేళ్ళను వంచలేని పరిస్థితికి చేరుకున్నారు. మూడుసార్లు ఛాతీలో నొప్పి వచ్చింది.


అయినా జైలు అధికారులు మార్చి నుంచి ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్ళటం మానేశారు. జైలు అధికారులు ఆయనకే సాయమూ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు, ఆయన చావుకు ఆయన్ను వదిలేసినట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో, ఆయన పట్ల న్యాయంగా వ్యవహరించి బెయిల్ జారీ చేయమనీ, ఆ విధంగా ఆయనకు సరైన వైద్యం అందించే వీలు కలిగించినట్టవుతుందనీ, ఆయన కనీస మానవ మర్యాదను కాపాడినట్టు అవుతుందని ఆయన కుటుంబంగా మేము జైలు అధికారుల్ని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మానవ హక్కుల కార్యకర్తల్ని, సంఘాల్ని, అంగవికలుర సంఘాల్ని, పౌర సమాజాన్ని సాయిబాబా విడుదల కోసం మాతో గొంతు కలపమని ప్రార్థిస్తున్నాం. 

వసంత కుమారి (సాయిబాబా సహచరి)

Updated Date - 2020-05-28T07:39:58+05:30 IST