ఈసారి వ్రతం ఇలా...

ABN , First Publish Date - 2020-07-24T05:30:00+05:30 IST

మహిళలు పవిత్రంగా భావించి, నియమ నిష్ఠలతో నోములూ, వ్రతాలూ నిర్వహించే మాసం శ్రావణం. ఈ నెలలో వరలక్ష్మీ వ్రతానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. కుటుంబం సంపదతో, సౌభాగ్యంతో ఉండాలన్న అభీష్టంతో ఆచరించే వ్రతం...

ఈసారి వ్రతం ఇలా...

మహిళలు పవిత్రంగా భావించి, నియమ నిష్ఠలతో నోములూ, వ్రతాలూ నిర్వహించే మాసం శ్రావణం. ఈ నెలలో వరలక్ష్మీ వ్రతానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. కుటుంబం సంపదతో, సౌభాగ్యంతో ఉండాలన్న అభీష్టంతో ఆచరించే వ్రతం ఇది. వరప్రదాయిని అయిన వరలక్ష్మీని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించిన ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. శ్రీ మహాలక్ష్మి అలమేలుమంగగా అవతరించిన దివ్య స్థలంగా ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా తిరుచానూరులో ప్రతియేటా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. 

ఈ ఏడాది కూడా ఈ నెల 31న వరలక్ష్మీ వ్రతాన్ని తిరుచానూరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ,  కరోనా వ్యాప్తి కారణంగా భక్తులను అనుమతించే పరిస్థితి లేదు. ఆ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ ఈ వ్రతాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నారు. అయితే భక్తుల విజ్ఞాపనల మేరకు ఆన్‌లైన్‌ (వర్చ్యువల్‌)గా ఈ వ్రతం జరపాలని ఆలయ వర్గాలు నిర్ణయించాయి. 


భక్తుల ఇళ్ళకే ప్రసాదాలు

తిరుచానూరు నుంచి వరలక్ష్మీ వ్రతం ఎస్వీబీసీ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. దాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షిస్తూ, అర్చకస్వాములు సూచించిన విధంగా సంకల్పం, గోత్రనామాలు చెప్పుకొని, ఇంట్లోనే వ్రతం చేసుకోవచ్చు. కాగా, అన్‌లైన్‌ ద్వారా వ్రతం టిక్కెట్లు తీసుకొనే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ టిక్కెట్లు పొందిన వారి పేర్లు, గోత్రనామాల వివరాలను అమ్మవారి మూలవిరాట్‌ పాదాల దగ్గర ఉంచి పూజలు నిర్వహిస్తారు. దీని కోసం టీటీడీ వెబ్‌సైట్‌లో రూ. 1,001 చెల్లించి, రశీదును ఆన్‌లైన్‌లోనే పొందాలి. 

ఈ విశిష్టమైన సేవలో పాల్గొనే వారికి మొదటి శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారికి సమర్పించిన ఉత్తరీయం, రవిక, పసుపు, కుంకుమ, కంకణాలు, గాజులను ప్రసాదంగా పోస్ట్‌ ద్వారా వారి చిరునామాకు పంపిస్తారు. టిక్కెట్లను జూలై 22 సాయంత్రం అయిదు నుంచి జారీ చేస్తున్నారు. వీటిని జూలై 30వ తేదీ సాయంత్రం అయిదు వరకూ... దేశ విదేశాల్లో ఉన్న భక్తులెవరైనా బుక్‌ చేసుకోవచ్చు. అయితే విదేశాల్లోని భక్తులకు ప్రసాదం పంపే అవకాశం లేదని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి. 

Updated Date - 2020-07-24T05:30:00+05:30 IST