శ్రేయస్‌ షో..

ABN , First Publish Date - 2021-11-26T10:11:18+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఆరంభంలో తడబడినా.. చివరి సెషన్‌లో కోలుకుంది.

శ్రేయస్‌ షో..

అరంగేట్రంలోనే అదుర్స్‌

చాన్స్‌ దక్కితే చాలు.. ఏ ఫార్మాట్‌లోనైనా భారత యువ క్రికెటర్లు అదరగొడుతున్నారు. తాజాగా శ్రేయాస్‌ అయ్యర్‌ కెరీర్‌ తొలి టెస్టులోనే కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకున్నాడు. స్వింగ్‌.. స్పిన్‌ ఇలా బంతులేవైనా దీటుగా ఎదుర్కొంటూ 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. పేసర్లు జేమిసన్‌, సౌథీ జోరుతో భారత్‌ ఓ దశలో 145/4 స్కోరుతో కష్టాల్లో పడిన వేళ.. వెటరన్‌ జడేజాతో కలిసి శ్రేయాస్‌ జట్టుకు అండగా నిలిచాడు. ఐదో వికెట్‌కు ఈ జోడీ  శతక భాగస్వామ్యం నెలకొల్పగా.. ఓపెనర్‌ గిల్‌ కూడా సత్తా చాటాడు. 


  కాన్పూర్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఆరంభంలో తడబడినా.. చివరి సెషన్‌లో కోలుకుంది. శ్రేయాస్‌ అయ్యర్‌ (136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 బ్యాటింగ్‌), జడేజా (100 బంతుల్లో 6 ఫోర్లతో 50 బ్యాటింగ్‌) అజేయ హాఫ్‌ సెంచరీలతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. ఆరంభంలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (93 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) కూడా ఆకట్టుకున్నాడు. దీంతో గురువారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు సాధించింది. శ్రేయా్‌స-జడేజా మధ్య ఐదో వికెట్‌కు అజేయంగా 113 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇక యువ బ్యాటర్స్‌ చెలరేగిన చోట వెటరన్స్‌ రహానె (35), పుజార (26) నిరాశపరిచారు. మరోవైపు వెలుతురు    లేమితో ఆరు ఓవర్ల ముందే తొలిరోజు ఆటను నిలిపివేశారు. జేమిసన్‌కు మూడు, సౌథీకి ఓ వికెట్‌ దక్కింది. 


గిల్‌ జోరు: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ను పేసర్లు కైల్‌ జేమిసన్‌, సౌథీ కొత్త బంతితో ఇబ్బందిపెట్టారు. ముఖ్యంగా కైల్‌ స్వింగ్‌ బంతులను ఎదుర్కొనేందుకు ఓపెనర్లు మయాంక్‌, గిల్‌ కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత్‌ 21 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. ఇక పిచ్‌పై పగుళ్లు కనిపిస్తుండడంతో ఏడో ఓవర్‌లోనే లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ను రంగంలోకి దించారు. బంతి టర్న్‌తో పాటు బౌన్స్‌ కూడా అవడంతో గిల్‌, పుజార ఆచితూచి ఆడారు. కానీ కాస్త కుదురుకున్నాక గిల్‌ స్వేచ్ఛగా ఆడాడు. ముఖ్యంగా ఎజాజ్‌ను లక్ష్యంగా చేసుకుని 17వ ఓవర్‌లో 6,4తో చెలరేగాడు. లంచ్‌ విరామానికి ముందు గిల్‌ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. భారత్‌ 82/1 స్కోరుతో బ్రేక్‌కు వెళ్లింది.


3 వికెట్లు.. 72 పరుగులు: రెండో సెషన్‌లో మాత్రం కివీస్‌ బౌలర్లు ఆధిక్యం కనబరచారు. దీంతో భారత్‌ మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. చక్కగా కుదురుకున్న గిల్‌ను విరామానంతరం తొలి ఓవర్‌లోనే జేమిసన్‌ కళ్లు చెదిరే బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి అతడి బ్యాట్‌, ప్యాడ్‌ మధ్య నుంచి వెళ్లి వికెట్లను పడగొట్టింది. దీంతో రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక క్రీజులో ఉన్న సీనియర్‌ బ్యాటర్స్‌ పుజార, రహానె 34, 37వ ఓవర్లలో చెరో ఫోర్‌తో కాస్త ఆశలు రేకెత్తించారు. కానీ కీలక సమయంలో వికెట్లు సమర్పించుకున్నారు. స్పిన్‌లోనూ ఇబ్బందిపడిన పుజార కీపర్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వికెట్‌ సౌథీ పడగొట్టాడు.  కాసేపటికే జేమిసన్‌ ఓవర్‌లో కట్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రహానె బౌల్డ్‌ అయ్యాడు. శ్రేయాస్‌, జడేజా మరో వికెట్‌ కోల్పోకుండా టీ బ్రేక్‌కు వెళ్లారు.


శ్రేయా్‌స-జడ్డూ ఎదురుదాడి: చివరి సెషన్‌లో మాత్రం వికెట్‌ కోసం కివీస్‌ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి టెస్టే అయినా శ్రేయాస్‌ వైవిధ్యభరిత షాట్లతో ఎదురుదాడికి దిగాడు. స్నిన్నర్‌ సోమర్‌విల్లే బౌలింగ్‌లో కాస్త ఇబ్బందిపడినా ఆ తర్వాత పుంజుకున్నాడు. అటు వెటరన్‌ జడేజా తన ఫామ్‌ను చాటుకోవడంతో భారత్‌ ఈ సెషన్‌లో జోరు ప్రదర్శించింది. 64వ ఓవర్‌లో అయ్యర్‌ రెండు వరుస ఫోర్లు బాదాడు. అలాగే 94 బంతుల్లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్‌ విలియమ్సన్‌ బౌలర్లను మార్చుతూ ఒత్తిడి పెంచాలనుకున్నాడు. కానీ ఫలితం లేకపోయింది. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఈ జోడీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. 75వ  ఓవర్‌లో జడ్డూ 4, అయ్యర్‌ సిక్సర్‌తో 12 రన్స్‌ వచ్చాయి. రెండో కొత్త బంతి తీసుకున్నాక 82వ ఓవర్‌లో జడ్డూ 2 ఫోర్లు బాది అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక 84వ ఓవర్‌లో శ్రేయాస్‌ సిక్సర్‌ కొట్టాడు. ఆ తర్వాత వెలుతురు లేమితో ఆటను ముగించారు.


భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) బ్లండెల్‌ (బి) జేమిసన్‌ 13; గిల్‌ (బి) జేమిసన్‌ 52; పుజార (సి) బ్లండెల్‌ (బి) సౌథీ 26; రహానె (బి) జేమిసన్‌ 35; శ్రేయాస్‌ (బ్యాటింగ్‌) 75; జడేజా (బ్యాటింగ్‌) 50; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 84 ఓవర్లలో 258/4. వికెట్ల పతనం: 1-21, 2-82, 3-106, 4-145. బౌలింగ్‌: సౌథీ 16.4-3-43-1; జేమిసన్‌ 15.2-6-47-3; ఎజాజ్‌ పటేల్‌ 21-6-78-0; సోమర్‌విల్లే 24-2-60-0; రచిన్‌ రవీంద్ర 7-1-28-0.


కల నెరవేరిన వేళ..

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): నాలుగేళ్ల కిందటే దక్కాల్సిన టెస్ట్‌ జట్టు స్థానం శ్రేయాస్‌ అయ్యర్‌కు ఎట్టకేలకు గురువారం లభించింది. అందునా..భుజం గాయానికి శస్త్రచికిత్స జరిగి సుదీర్ఘకాలం రెస్ట్‌లో ఉన్నాక లభించిన చాన్స్‌ కావడంతో అయ్యర్‌ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. అందుకే కాబోలు..న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌ ప్రారంభానికి ముందు గవాస్కర్‌ నుంచి అందుకున్న ‘క్యాప్‌’ను అతడు అపురూపంగా ముద్దాడాడు. గత మార్చిలో పుణెలో ఇంగ్లండ్‌తో వన్డే సందర్భంగా 26 ఏళ్ల శ్రేయా్‌సకు భుజం గాయమైంది. ఆపరేషన్‌ చేయించుకున్న అతడు చాలాకాలం ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందువల్లే భారత్‌లో జరిగిన ఐపీఎల్‌-14 తొలి దశలో పాల్గొనలేదు. శస్త్రచికిత్స, తర్వాత ఐపీఎల్‌-2లో పునరాగమనం చేశాడు. అనంతరం టీ20 వరల్డ్‌కప్‌ ప్రాబబుల్స్‌కు ఎంపికైనా తుది 15 మందిలో మాత్రం స్థానం దక్కలేదు.


ద్రవిడ్‌కు ఎంతో నమ్మకం: అయ్యర్‌ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడి 33 నెలలు అవుతోంది. అయినా అతడు టెస్ట్‌ జట్టులో స్థానం సంపాదించగలిగాడంటే అందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అయ్యర్‌పై ఉన్న నమ్మకమే. కాగా కోచ్‌ ద్రవిడ్‌ ఆహ్వానం మేరకు విచ్చేసిన గవాస్కర్‌ తన చేతుల మీదుగా క్యాప్‌ అందించాడు. టెస్ట్‌ అరంగేట్ర ఆటగాళ్లకు మాజీలు క్యాప్‌లు ఇవ్వడం ఆస్ట్రేలియా జట్టులో కొనసాగుతోంది. టీమిండియాలోనూ గతంలో ఈ సంప్రదాయం ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కెప్టెన్‌ లేదా కోచ్‌లలో ఒకరు ఈ క్యాప్‌ అందజేస్తున్నారు. ద్రవిడ్‌ కోచ్‌ అయ్యాక గత సంప్రదాయాన్ని పునరుద్ధరించాడు. 

Updated Date - 2021-11-26T10:11:18+05:30 IST