కొత్త మున్సిపాలిటీల్లో..స్ట్రీట్‌ వెండర్స్‌ సర్వే

ABN , First Publish Date - 2020-05-28T09:48:08+05:30 IST

కొత్త మున్సిపాలిటీల్లో స్ట్రీట్‌ వెండర్స్‌ (వీధి వ్యాపారుల)ను గుర్తించే కార్యక్రమానికి మెప్మా అధికారులు శ్రీకారం చుట్టారు.

కొత్త మున్సిపాలిటీల్లో..స్ట్రీట్‌ వెండర్స్‌ సర్వే

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 21 మున్సిపాలిటీల్లో షురూ

నిధులు విడుదల చేసిన మెప్మా ఫ 33 రకాల సమాచార సేకరణ  మెప్మా, ఆర్పీలతో సర్వే


తాండూరు : కొత్త మున్సిపాలిటీల్లో స్ట్రీట్‌ వెండర్స్‌ (వీధి వ్యాపారుల)ను గుర్తించే కార్యక్రమానికి మెప్మా అధికారులు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర మున్సిపల్‌ శాఖ, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ కొత్త మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. అర్బన్‌ స్ట్రీట్‌ వెండర్స్‌ ఎస్‌యూఎస్‌వీ పేరిట ఈ సర్వేను మెప్మా ఆధ్వర్యంలో ఆర్పీలు చేపడతారు. 33 రకాల సమాచారాన్ని ఆర్పీలు సేకరించనున్నారు. ఇందుకు పట్టణ ప్రాంతంలో వీధి విక్రయదారుల పురోభివృద్ధి కోసం సర్వే పేరిట ఫార్మాట్లలో వివరాలను పూర్తిచేయ నున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 21 మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మున్సిపాలిటీలకు సర్వే ఫార్మట్‌కు రూ.3, సర్వేకు రూ.5లు, డేటాఎంట్రీకి రూ.5లు చెల్లించనున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. 


సర్వే చేయనున్న మున్సిపాలిటీలు, బడ్జెట్‌ వివరాలు

వికారాబాద్‌ జిల్లాలోని పరిగికి రూ.5,928, కొడంగల్‌కు రూ.4,641, రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్‌కు రూ.13,611, మణికొండకు రూ.5,525, నార్సింగ్‌కు రూ.8,190, బండ్లగూడకు రూ.11,427, శంషాబాద్‌కు రూ.11,508, ఆదిభట్లకు రూ.5,018, శంకర్‌పల్లికి రూ.6,760, తుక్కుగూడకు రూ.6,240, ఆమనగల్లుకు రూ.8,229, మేడ్చల్‌లోని జవహర్‌నగర్‌కు రూ.14,482 నిధులు కేటాయించారు.


దమ్మాయిగూడకు రూ.6,968, నాగారంకు రూ.8,294, పోచారంకు రూ.7,136, ఘట్‌కేసర్‌కు రూ.7,758, గుండ్లపోచంపల్లికి రూ.4,888, తుంకుంటకు రూ.7,865, నిజాంపేటకు రూ.15,873, కొంపల్లికి రూ.7,267, దుండిగల్‌కు రూ.13,260 నిధులు మంజూరయ్యాయి. 


సర్వే వివరాలు

నగర పంచాయతీ, మున్సిపాలిటీ వివరాలతోపాటు వ్యక్తిగత వివరాలు, ఫాంలో నింపుతారు. విద్యార్హతలు, వీధి వ్యాపారులైన పండ్లు, కూరగాయలు, పూలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, చేతి వృత్తులు వంటి 31 రకాల వివరాలు నమోదు చేస్తారు. స్థానిక, స్థానికేతర కుటుంబసభ్యుల సంఖ్య, ఏదైనా ప్రభుత్వ పథకంలో లబ్ధిపొంది ఉంటే.. దాని వివరాలు, పట్టణంలో ఎన్నేళ్ల నుంచి నివసిస్తున్నారు?.. వలస రావడానికి గల కారణం, వీధి వ్యాపారం పద్ధతి, వ్యాపారం కోసం ఉపయోగించే వాహనం వివరాలు, విక్రయదారుల సంఘంలో సభ్యుల బ్యాంకు ఖాతా, గుర్తింపుకార్డులు, బ్యాంకు అప్పుల వివరాలను సేకరిస్తున్నారు. మున్సిపల్‌ వ్యాపారుల చట్టం 2014 సెక్షన్‌ 5 ప్రకారం డిక్లరేషన్‌ కూడా తీసుకోనున్నారు.

Updated Date - 2020-05-28T09:48:08+05:30 IST