ఆలయాలకు లాక్‌... ఆదాయం డౌన్‌

ABN , First Publish Date - 2020-05-21T10:09:38+05:30 IST

కరోనా ప్రభావం దేవాదాయ శాఖపై భారీగా పడింది. ప్రభుత్వ ఆంక్షలతో అన్ని ఆలయాలను మూసివేయడంతో హుండీ కానుకలు, ఆర్జిత

ఆలయాలకు లాక్‌... ఆదాయం డౌన్‌

దేవాదాయశాఖపై కరోనా ప్రభావం

భద్రాద్రి సహా ఇరు జిల్లాల్లోని ఆలయాలు మూత

నిత్యకల్యాణాలు, ఆర్జితసేవలు లేకపోవడమే కారణం


ఖమ్మం ఎడ్యుకేషన్‌, మే 20: కరోనా ప్రభావం దేవాదాయ శాఖపై భారీగా పడింది. ప్రభుత్వ ఆంక్షలతో అన్ని ఆలయాలను మూసివేయడంతో హుండీ కానుకలు, ఆర్జిత సేవల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.  మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు ఇరు జిల్లాల్లో సుమారు రూ.3.66కోట్ల ఆదాయానికి గండి పడినట్టు అంచనా. గతేడాది ఇదే సమయంలో ఖమ్మం జిల్లాలో రూ.1.24కోట్లకుపైగా ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.22.38లక్షలు, భద్రాద్రి జిల్లాలో గతేడాది రూ.4.38కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.1.72కోట్లు ఆదాయం వచ్చింది. అయితే ఈ సమయంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికంగా నష్టపోయింది. శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయానికి గతేడాది రూ.3.68కోట్లు రాగా ఈ ఏడాది రూ.5కోట్లు వస్తుందని అంచనా వేశారు. కానీ రూ.1.31కోట్లు మాత్రమే వచ్చింది. 


కరోనా ఆంక్షలే కారణం.. 

ఇరుజిల్లాల్లోని ఆలయాల్లో ఆదాయం తగ్గడానికి కరోనా ఆంక్షలు ప్రధానంగా కారణమయ్యాయి. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించినా భక్తులను అనుమతించక పోవడంతో హుండీలు నిండలేదు. ఖమ్మం జిల్లాలోని ఆదాయం వచ్చే ఆలయాలు 72 ఉండగా ప్రధానంగా 20 ఆలయాల ఆదాయానికి గండి పడింది. వీటిలో 40 రోజుల కాలానికి రూ.22లక్షల ఆదాయం తగ్గింది. భద్రాద్రి జిల్లాలో ఆదాయం వచ్చే ఆలయాలు 22 ఉండగా.. 10 ప్రధాన ఆలయాలకు రూ. 1.73కోట్ల ఆదాయం తగ్గింది. ఆలయాల్లో నిత్య కల్యాణ ఉత్సవాలు, శాంతి కల్యాణాలు నిలిచిపోయాయి. వేసవిలో సెలవులతో సాధారణంగా అధికంగా భక్తులు వచ్చేవారు. కానీ లాక్‌డౌన్‌తో భక్తులు రాలేదు. ఆలయాల ఆవరణలోని వివిధ రకాల దుకాణాలు మూసివేయడంతో వ్యాపారులకు ఆదాయం రాక.. వారు ఆలయాలకు అద్దెలు చెల్లించని పరిస్థితి. అశ్వారావుపేట వినాయకపురంలోని చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం,  వేంసూరు మండలంలోని కుంచపర్తి ముత్యాలమ్మ జాతరలు, సింగరేణి మండలంలోని ఉసిరికాయపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయంలో ఉగాది ఉత్సవాలు జరగకపోవడంతో ఆదాయం భారీగా తగ్గింది.


ఇరుజిల్లాల్లోని ఆలయాలకు సంబంధించి ఇలా... 

భద్రాద్రి జిల్లా పాల్వంచ పెద్దమ్మ తలి ఆలయానికి గతేడాది రూ.50.46లక్షలు రాగా ఈ ఏడాది రూ.65.85లక్షలు అంచనా వేశారు. కానీ రూ.15.38లక్షల ఆదాయాన్ని కోల్పోయింది. కొత్తగూడెంలోని శ్రీవిజయ విఘ్నేశ్వర స్వామి టెంపుల్‌కు రూ.16లక్షలు, అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం రూ.12లక్ష,లు, అశ్వారావుపేట మండలం వినాయక పురంలోని చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం సుమారు రూ.5లక్షల ఆదాయాన్ని కోల్పోయాయి. పాల్వంచలోని శ్రీ రామాలయం భజన మందిరం రూ.3.50లక్షల ఆదాయాన్ని కోల్పోయింది. 


ఖమ్మం జిల్లాలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి గతేడాది రూ.65.38లక్షలు రాగా ఈ ఏడాది రూ.8.61లక్షలు మాత్రమే వచ్చింది. ఖమ్మంలోని లక్ష్మీనరసింహస్వామి (గుట్ట) ఆలయానికి గతేడాది రూ.5.38లక్షల ఆదాయం రాగా ఈ సారి రూ.6.50లక్షలు రావాల్సి ఉండగా రూ.1.11లక్షలు తగ్గింది. నగరంలోని కమాన్‌బజార్‌ వేంకటేశ్వరస్వామి ఆలయం గతేడాది రూ.6.20లక్షలు ఆదాయం రాగా ఈ ఏడాది రూ.6.76లక్షలకు గాను రూ.55వేలకు తగ్గింది. కాల్వొడ్డులోని  శ్రీ సత్యనారాయణ సహిత వీరాంజనేయ స్వామి టెంపుట్‌కు గతేడాది రూ.13.18లక్షల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.15.30లక్షల ఆదాయానికి గాను రూ.2.11లక్షలు తగ్గింది. రెడ్డిపల్లిమారెమ్మ తల్లి ఆలయానికి రూ.1.32వేల ఆదాయం, వేంసూరు మండంలోని కందుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.1.20లక్షలు, మధిర సీతారామచంద్రస్వామి ఆలయం రూ.24వేలు,  పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయం రూ.33వేలు, ఖమ్మంలోని పవనసుతజలాంజనేయ ఆలయంలో రూ.1.53లక్షలు, శ్రీ గుంటు మల్లేశ్వరస్వామి ఆలయానికి రూ.34వేలు, ఖమ్మంలోని చెరువుబజార్‌ శ్రీ దాసాంజనేయస్వామి ఆలయం రూ.1.35లక్షలు, చింతకాని చెన్నకేశవస్వామి ఆలయానికి రూ.34వేలు, ఖమ్మంలోని పర్ణశాల రామాలయానికి రూ.1.17లక్షల ఆదాయం తగ్గింది. కల్లూరులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి రూ.82వేలు, వైరా మండలంలోని గొల్లపూడి పులిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.27వేలు, ఏన్కూరు మండలంలోని నాచారం అద్భుత వేంకటేశ్వరాలయానికి రూ.28వేలు, కారేపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సుమారు రూ.14వేల ఆదాయం తగ్గింది.

Updated Date - 2020-05-21T10:09:38+05:30 IST