ఏజెన్సీలో కలకలం

ABN , First Publish Date - 2020-05-13T07:05:28+05:30 IST

సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అజ్ఞాత నేతల వరుస అరెస్టుల పర్వం ఏడాది తర్వాత మళ్లీ ఒక్కసారి ఏజెన్సీలో కలకలం

ఏజెన్సీలో  కలకలం

పోలీసుల అదుపులో న్యూడెమోక్రసీ నేత సూర్యం?

రాయల వర్గం మహబూబాబాద్‌  జిల్లా కార్యదర్శిగా కార్యకలాపాలు

రెండోసారి పోలీసులకు చిక్కిన శ్యామ్‌.. 

ధ్రువీకరించని రూరల్‌ జిల్లా పోలీసులు


మహబూబాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అజ్ఞాత నేతల వరుస అరెస్టుల పర్వం ఏడాది తర్వాత మళ్లీ ఒక్కసారి ఏజెన్సీలో కలకలం రేగింది. ఆ పార్టీ రాయల వర్గం మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి హోదాలో ఉండి దళ కమాండర్‌గా కొనసాగుతున్న సూర్యం అలియాస్‌ సోమభాస్కర్‌ మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పార్టీ వర్గాలకు సమాచారం అందింది.


వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం అసరవెల్లి, నర్సాపురం ప్రాంతంలో స్పెషల్‌ పార్టీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతోనే అదుపులో తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు మరో దళకమాండర్‌ శ్యామ్‌ అలియాస్‌ బూర్క ప్రతాప్‌ కూడా పోలీసులకు చిక్కినట్లు పేర్కొంటున్నారు. ఆ ఇద్దరి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు పార్టీ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా సూర్యం, శ్యామ్‌లను  భేషరతుగా విడుదల చేయాలని, కేసులు ఏమైనా ఉంటే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్‌తో వివిధ మండలాల్లో పార్టీ వర్గాలు ఆందోళనలు చేపట్టాయి. 


కొరకరాని కొయ్యగా సూర్యం

వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన సోమభాస్కర్‌ అలియాస్‌ సూర్యం రెండు దశాబ్ధాలుగా న్యూడెమోక్రసీ పార్టీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ దళకమాండర్‌ స్థాయికి ఎదిగారు. పీడీఎ్‌సయూ విద్యార్థి నేతగా, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత  2000 సంవత్సరంలో ముస్మి ఏరియా దళకమాండర్‌గా నియమితులయ్యారు. కొత్తగూడ సబ్‌ డివిజనల్‌ కమిటీ కార్యదర్శిగా, డివిజన్‌ కార్యదర్శిగా పని చేశాడు. ప్రస్తుతం న్యూడెమోక్రసీ మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఆయనను టార్గెట్‌గా చేసుకున్న పోలీస్‌ ప్రత్యేక బృందాలు పలుమార్లు సూర్యం ఆశ్రయం పొందిన ప్రాంతాలపై నిఘా వేశాయి.


ఈ సందర్భంగా పోలీసుల రాకను పసిగట్టి గంగారం మండలం బావురుగొండ, ఖానాపురం మండలం కీర్యాతండ, నల్లబెల్లి మండలం కొండాపూర్‌, బయ్యారం మండలం మిర్యాలపెంట, తాజాగా నల్లబెల్లి మండలం మురళీనగర్‌ పోలీసుల కూంబింగ్‌, ఎన్‌కౌంటర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. 


మళ్లీ అజ్ఞాతంలో శ్యామ్‌

సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పాఖాల కొత్తగూడ దళ కమాండర్‌ బూర్క ప్రతాప్‌ అలియాస్‌ శ్యామ్‌.. 2017 సెప్టెంబరులో కొత్తగూడ మండలం లక్ష్మిపురం శివారు ముస్మీ గ్రామంలో అరెస్టయ్యారు. అప్పట్లో ఆయన వద్ద నుంచి కిట్‌ బ్యాగ్‌, ఐదు రౌండ్ల ఎస్‌ఎల్‌ఆర్‌ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన శ్యామ్‌.. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి దళ కమాండర్‌గా కొనసాగుతున్నారు. కొత్తగూడ మండలం గుంజేడు గ్రామానికి చెందిన శ్యామ్‌ 2005లోనే అప్పటి దళకమాండర్‌ తోలెం రామారావు అలియాస్‌ గణేష్‌ ఆటపాటలకు ఆకర్షితుడై పార్టీపై అభిమానం పెంచుకుని దళ సభ్యుడిగా చేరాడు.


2010లో కొత్తగూడ మండలంలోని బక్కచింతలపల్లి వద్ద అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గణేష్‌ చనిపోగా అప్పట్నుంచి సూర్యం దళంలో దళ సభ్యుడిగా చేరాడు. తాజాగా దళ కమాండర్‌ సూర్యంతో పాటు శ్యామ్‌ కూడా పోలీసులకు చిక్కాడని తెలియడంతో పార్టీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ ఇద్దరి ఆరెస్టుతో ఇక న్యూడెమోక్రసీ పార్టీలో అజ్ఞాతదళ నేతలేవరు లేకుండాపోయారు. అయితే అరెస్టులను పోలీసు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

Updated Date - 2020-05-13T07:05:28+05:30 IST