ఫిర్యాదు చేయడానికొచ్చిన మహిళతో SI ప్రేమాయణం.. గుడిలో పెళ్లి.. ఆమెకు అసలు విషయం తెలిసి...

ABN , First Publish Date - 2021-07-22T07:05:04+05:30 IST

భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో ప్రేమాయణం సాగించాడు....

ఫిర్యాదు చేయడానికొచ్చిన మహిళతో SI ప్రేమాయణం.. గుడిలో పెళ్లి.. ఆమెకు అసలు విషయం తెలిసి...

  • పెళ్లి కాలేదని నమ్మించి మోసం
  • ఓ ఆలయంలో వివాహం, మల్కాజిగిరిలో కాపురం
  • వివాహమైందని తెలిసి మహిళ ఆత్మహత్యాయత్నం
  • బాధితురాలి ఫిర్యాదుతో ఎస్‌ఐను సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు


హైదరాబాద్ సిటీ/బేగంపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : ఉన్నతాధికారులు చెప్పిన ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ను తనకు అనుకూలంగా మలుచుకున్నాడో ఎస్‌ఐ. వాహనం పోయిందని వచ్చిన మహిళతో ఫ్రెండ్లీగా మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. భర్తతో విడాకులు తీసుకున్న ఆమెతో చనువు పెంచుకుని తనకింకా పెళ్లి కాలేదని నమ్మించాడు. ఇద్దరూ ఓ ఆలయంలో వివాహం చేసుకోవడంతో పాటు నగరంలోని ఓ ప్రాంతంలో కాపురం పెట్టారు. కొద్ది రోజులకే ఆ ఎస్‌ఐకు వివాహమైనట్లు తెలిసి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఎస్‌ఐను సస్పెండ్‌ చేశారు. అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లాకు చెందిన ఉయ్యాల మధు బేగంపేటలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి చిలకలగూడకు బదిలీ అయ్యాడు. ద్విచక్ర వాహనం పోయిందని వచ్చిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు.


అసలు విషయం తెలిసిందిలా..!?

తనకు వివాహం కాలేదని నమ్మించాడు. భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో ప్రేమాయణం సాగించాడు. సికింద్రాబాద్‌లోని ఓ ఆలయంలో వివాహం చేసుకుని మల్కాజిగిరిలో కాపురం పెట్టాడు. కొద్ది నెలల కలిసి ఉన్న అనంతరం రాత్రి వేళల్లో మధు ఇంటికి రాక పోవడంపై మహిళకు అనుమానం కలిగింది.  ఆరా తీయగా అతడికి ముందే పెళ్లయిందన్న విషయం తెలుసుకుంది. పెళ్లి కాలేదని నమ్మించి మోసం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో మధు టప్పాచబుత్రా ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నతాధికారులు అతడిని ఈనెల 15న సస్పెండ్‌ చేశారు. ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని భావించిన సదరు మహిళ ఈనెల 19న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ ప్రాంతంలో చాకుతో చేతిని కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు అమెను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బేగంపేటలో ఎస్‌ఐగా పనిచేసినప్పుడున్న పరిచయడంతో ఓ హోటల్‌లో కొద్ది రోజులు ఉంచాడని మహిళ ఫిర్యాదు అందుకున్న బేగంపేట పోలీసులు అతనిపై 417,420,493,495 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు రావడంతో ఆ కేసు కూడా నమోదు చేసినట్లు తెలిసింది. 

Updated Date - 2021-07-22T07:05:04+05:30 IST