సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి పోరాడుతాం

ABN , First Publish Date - 2020-06-01T10:05:18+05:30 IST

సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం పోరాడుతామని రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ అరుణ్‌, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు.

సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి పోరాడుతాం

రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ అరుణ్‌


కర్నూలు(న్యూసిటీ), మే 31: సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం పోరాడుతామని రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ అరుణ్‌, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. సిద్ధేశ్వరం నాలు గో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. సిద్ధేశ్వర అలుగు నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు 400 టీఎంసీల  నీరు కేటాయించాలని వారు కోరారు. సీమలో కరువు-వలస నివారణకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుల ఐక్యవేదిక కన్వీనర్‌ శివనాగిరెడ్డి, వేదిక  కో కన్వీనర్‌ జి.విజయభాస్కర్‌రెడ్డి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ రామక్రిష్ణారెడ్డి, విద్యార్థి ఫెడరేషన్‌ నాయకులు రవికుమార్‌, రాజు, న్యాయవాది నారాయణరెడ్డి పాల్గొన్నారు. 


నంద్యాల:  సిద్ధేశ్వరం అలుగు నిర్మించే వరకు పోరాడుతామని రాయలసీమ సాగు నీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వైఎన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాలలోని కార్యాలయంలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా సాగునీటి సాధన సమితి నాయకులు నిర్వహించారు. వైఎన్‌రెడ్డి మాట్లాడుతూ సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన రాయలసీమ హక్కుల పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ఈ ప్రజా శంకుస్థాపన రాష్ట్ర చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీసిందని అన్నారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, ప్రభుత్వం వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సాగునీటి సాధన సమితి నాయకులు వెంకటేశ్వరనాయుడు, మహేశ్వరరెడ్డి, పట్నం రాముడు, రమణారెడ్డి, నిట్టూరి సుధాకర్‌రావు, నాగేశ్వరరెడ్డి, శ్రీహరి, శ్రీనివాసరెడ్డి, కాశీమియా,  కృష్ణమోహన్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, రాఘవేంద్రగౌడ్‌, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


ఆళ్లగడ్డ: రాష్ట్రంలోని వైసీపీ ప్రభభుత్వం జీవోలతో సరిపెట్టకుండా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి తాలుకా నాయకుడు సురేంద్రనాధరెడ్డి కోరారు. పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ సిద్ధే శ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి నాలుగు ఏండ్లు పూర్తి చేసుకుందని, నియోజకవర్గంలోని గ్రామాల్లోని రైతులు సంబరాలు జరుపుకున్నారన్నారు.  రాయలసీమకు నీరివ్వాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203ను అమలు చేసి రైతులను, ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 


శిరివెళ్ల: సిద్ధేశ్వరం అలుగు రిజర్వాయర్‌ను ప్రభుత్వం వెంటనే నిర్మిం చాలని రైతు సంఘం నాయకుడు గురజాల మనోజ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని కోటపాడు గ్రామంలో రైతు సంఘం నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి చట్టబద్ధ నీటి హక్కులు కల్పించాలని ఆయన అన్నారు. చెరువుల నిర్మాణానికి ప్రత్యేక ఇరిగేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. రైతు సంఘం నాయకులు జయసింహారెడ్డి, శివనాగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, దస్తగిరి, మహమ్మద్‌ హుసేన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T10:05:18+05:30 IST