సోనియాగాంధీకి లేఖ రాసిన సిద్ధూ

ABN , First Publish Date - 2021-10-17T20:41:58+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ లేఖ..

సోనియాగాంధీకి లేఖ రాసిన సిద్ధూ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ లేఖ రాశారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ సింగ్ చన్నీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన ప్రాధాన్యతా క్రమాలను ఆ లేఖలో సిద్ధూ ప్రస్తావించారు. ఈనెల 15న సోనియాగాంధీకి రాసిన నాలుగు పేజీల లేఖలోని వివరాలను ఆదివారంనాడు ఆయన బహిరంగ పరిచారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 13 పాయింట్ల ఎజెండాతో కూడిన పంజాబ్ మోడల్‌ను రూపొందించానని, దానిని వివరించేందుకు తనకు సమయం కేటాయించాలని ఆ లేఖలో సోనియాను సిద్ధూ కోరారు.


గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసిన దుండగులను శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం, విద్యుత్, ఉద్యోగాలు, డ్రగ్స్ వంటి  అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆ లేఖలో సిద్ధూ సూచించారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం, ఇసుక మైనింగ్, కేబుల్ మాఫియాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాగా, తన ఆందోళలను పరిగణనలోకి తీసుకుంటామని పార్టీ హామీ ఇవ్వడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగాల్సిందిగా తనకు సూచించినట్టు సిద్ధూ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిద్ధూ రాజీనామా వ్యవహారం ముగిసిందని, ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారని ఏఐసీసీ పంజాబ్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్ గత శుక్రవారం ప్రకటించారు.

Updated Date - 2021-10-17T20:41:58+05:30 IST