Abn logo
Aug 5 2021 @ 11:48AM

పాకిస్థాన్‌లో సిద్ధి వినాయక దేవాలయం విధ్వంసం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణం జరిగింది. పెద్ద ఎత్తున దూసుకొచ్చిన దుండగులు సిద్ధి వినాయక దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఆ దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసి, కొన్నిటిని తగులబెట్టారు. లాహోర్ నుంచి 590 కిలోమీటర్ల దూరంలో ఉన్న రహీం యార్ ఖాన్ జిల్లా, భోంగ్ నగరంలో బుధవారం దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ముస్లిం సెమినరీని అపవిత్రం చేసినట్లు ఆరోపిస్తూ, దుండగులు ఈ దాడి చేశారని పోలీసులు తెలిపారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముస్లిం సెమినరీని అపవిత్రం చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భోంగ్ నగరవాసులను ప్రేరేపిస్తూ బుధవారం ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో దుండగులు సిద్ధి వినాయక దేవాలయంపై ఇనుప చువ్వలు, కర్రలు, రాళ్ళు, ఇటుకలతో దాడి చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. 


ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 100 హిందూ కుటుంబాలకు భద్రత కల్పించేందుకు పాకిస్థాన్ రేంజర్స్‌ను మోహరించారు. పాకిస్థాన్‌లో అధికారంలో ఉన్న పాకిస్థాన్ తెహరీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీ నేత డాక్టర్ రమేశ్ కుమార్ వంక్వానీ ఈ దేవాలయం విధ్వంసానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. దీనిపై చర్య తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరారు.