Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 16 2021 @ 11:30AM

KCR అంతరాత్మగా వెంకట్రామిరెడ్డి.. అసలు రహస్యం ఇదేనా?!

ఆయన ఎప్పటి నుంచో అధికార పార్టీ ఏజెంట్‌ అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సర్కార్‌ జీతం తీసుకుంటూ సార్‌ పార్టీకి పని చేస్తున్నాడనే ఆరోపణలు ప్రతీ నిత్యం వినివినీ జనాలకు అలవాటైపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఉద్యోగానికి రాజీనామా పక్కా అనే పుకార్లు వచ్చాయి. విపక్షాల విమర్శలు ఏమో కాని ఆయన రాజీనామా చేయడం, సార్‌ దగ్గర సెల్యూట్‌ కొట్టడం రెండూ జరిగిపోయాయి. పుట్టి పెరిగిన ఉమ్మడి జిల్లా నుంచి సారు పెద్దల సభకు వెళ్లడమే తరువాయి అనే ప్రచారం జరుగుతోంది. 


అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం కేసీఆర్‌ స్టైలే వేరు అంటారు రాజకీయ పండితులు. ఊహకందని నేతలను తెరమీదకు తీసుకొచ్చి ప్రత్యర్థులను, పార్టీలోని అనుంగు మిత్రులను షాక్‌లోకి నెట్టేయడం కేసీఆర్‌కు అలవాటే అంటారు విశ్లేషకులు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో మాజీ ప్రధాని కూతురు వాణిదేవిని హైదరాబాద్‌ నుంచి బరిలో నిలిపి విజయం సాధించడంతో సిట్టింగ్‌ బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలను మట్టికరిపించారు సీఎం కేసీఆర్‌. తాజాగా పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని రాజకీయాల్లోకి దించేశారు కేసీఆర్‌. 

కేసీఆర్‌ అంతర్మాతగా వెంకట్రామిరెడ్డి

పేరుకు వెంకట్రామిరెడ్డి సిద్ధిపేట జిల్లా కలెక్టరే కాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంతర్మాత అంటారు ఆయన గురించి తెలిసిన నేతలు, అధికారులు. ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా అటు తర్వాత సిద్ధిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కేసీఆర్ చెప్పిన ప్రతీపని కాదనకుండా చేస్తూ ఆయన మనసు చూరగొనడమే కాకుండా ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈమధ్య కాలంలో కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో జనం చూస్తుండగానే వంగివంగి దండాలు పెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆ తర్వాత వరి పంట విషయంలో ఆయన చేసిన హెచ్చరికలు ఫక్తు రాజకీయ నేతగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. 


నమ్మకం కుదిరితే న్యాయం చేసే కేసీఆర్‌!

నమ్మిన వ్యక్తులను అందలం ఎక్కించడంలో కేసీఆర్‌ ముందుంటారనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. వెంకట్రామిరెడ్డిని ఎప్పటి నుంచో ప్రజా ప్రతినిధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగిన అవకాశం కోసం వేచిచూశారనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తొలుత మల్కాజ్‌గిరి ఎంపీగా  వెంకట్రామిరెడ్డిని కారు గుర్తుపై పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. కాని చివరి నిమిషంలో ఆలోచన విరమించుకున్న కేసీఆర్‌..వెంకట్రామిరెడ్డిని వెయిట్‌ చేయమన్నారని ప్రగతిభవన్‌ రాజకీయాలు తెలిసినవారు అనే మాట. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ వెంకట్రామిరెడ్డినే కేసీఆర్‌ బరిలో నిలుపుతారనే వ్యాఖ్యలు వినిపించాయి. అది కూడా కుదరలేదు. చివరకు ఎమ్మెల్సీ రూపంలో వెంకట్రామిరెడ్డికి అవకాశం కల్పించేందుకు కేసీఆర్‌ ఫిక్సయ్యారు. దీంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ అప్పటికప్పుడు రాజీనామా చేయడం, ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. 

కలెక్టర్‌ నుంచి ప్రజాప్రతినిధిగా మారనున్న వెంకట్రామిరెడ్డి

వెంకట్రామిరెడ్డి ఉద్యోగ పదవీకాలం కొన్ని నెలలు మాత్రమే మిగిలిఉంది. ఎమ్మెల్సీ కోలాహలం మొదలవడంతో కేసీఆర్‌ తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టి వెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి పెద్దల సభలో కూర్చోపెట్టాలని నిర్ణయం తీసుకోవడం కొద్దిమందికి ఆశ్చర్యం కలిగించినా ప్రగతిభవన్‌ వర్గాలకు ఈ విషయం గురించి ఎప్పటి నుంచో తెలుసనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


కలెక్టర్‌గా ఉన్నపుడే గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గుసగుసలు 

ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డిది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి సమీప ప్రాంతం. వెంకట్రామిరెడ్డి కుటంబానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలున్నాయి. స్వతహాగా సంపన్న కుటుంబం. వెంకట్రామిరెడ్డి సోదరుడు సత్యనారాయణరెడ్డి కూడా కలెక్టర్‌గా పనిచేసినవారే. ఉమ్మడి మెదక్‌ జిల్లా, సిద్ధిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్‌లో అన్నీతానై చూస్తుండేవారు. ఆయన్నే ఆ ప్రాంత ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులే కాదు సామాన్యులు గుసగుసలాడుకునేవారు. మల్లన్నసాగర్‌ ఇష్యూలో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా దాన్ని పూర్తి చేయించడంలో వెంకట్రామిరెడ్డి పనితీరుకు కేసీఆర్‌ ఫిదా అయినట్లు రాజకీయవర్గాలు అంటుంటాయి. గిఫ్ట్‌గా కేసీఆర్‌ ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డిని పెద్దలసభలో తన పక్కన కూర్చోబెట్టుకునే అవకాశం కల్పించనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


వెంకట్రామిరెడ్డిపై విమర్శలు

వెంకట్రామిరెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తరుచూ విమర్శలు చేస్తుంటారు. ప్రతిపక్షాలు ఆయన పనితీరుపై ఆరోపణలు గుప్పిస్తుంటాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా సార్‌ మెప్పు పొందిన వెంకట్రామిరెడ్డి త్వరలో ఎమ్మెల్సీ కానున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పుట్టిపెరిగిన కరీంనగర్‌ లేదా కలెక్టర్‌గా పనిచేసిన మెదక్‌ జిల్లాల నుంచి స్థానిక సంస్థల కోటాలో వెంకట్రామిరెడ్డిని బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయని రెండు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement