మురుగుశుద్ధి నీళ్లు..పట్టా భూముల్లోకి!

ABN , First Publish Date - 2020-02-07T14:26:55+05:30 IST

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో మురుగు నీటికోసం అండర్‌గ్రౌండ్‌ పైపులైన్‌ వేస్తున్న ప్రజారోగ్యశాఖ అధికారులు, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నీటిని పట్టా భూముల్లోకి వదిలి సమస్యలను సృష్టిస్తున్నారు.

మురుగుశుద్ధి నీళ్లు..పట్టా భూముల్లోకి!

45 రోజుల్లో 30 లక్షల లీటర్లు వదిలిన ప్రజారోగ్య శాఖ అధికారులు

భూములు పాడవుతున్నాయని పట్టాదారుల ఆందోళన

నీళ్లలో అడుగు పెడితే కాళ్లకు బొబ్బలు వస్తున్నాయని ఆవేదన

నీటి శుద్ధిలో నిర్లక్ష్యమూ వెలుగులోకి..


సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో మురుగు నీటికోసం అండర్‌గ్రౌండ్‌ పైపులైన్‌ వేస్తున్న ప్రజారోగ్యశాఖ అధికారులు, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నీటిని పట్టా భూముల్లోకి వదిలి సమస్యలను సృష్టిస్తున్నారు. రోజూ చింతల చెరువులోకి వదలాల్సిన 30 లక్షల లీటర్ల నీటిని ఇలా వదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సిద్దిపేట పట్టణాన్ని స్వచ్ఛ సిద్దిపేటగా తీర్చిదిద్దే క్రమంలో సుమారు రూ. 268 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు రెండేళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. మొత్తం 325 కిలోమీటర్ల పైపులైన్‌ వేయాల్సి ఉండగా 260 కి.మీ. మేరా పూర్తయింది. ఇళ్లలో నుంచి వచ్చే మురుగు నీటిని వీటి ద్వారా బయటకు పంపించనున్నారు. ఈ నీటిని శుద్ధి చేసేందుకు మున్సిపల్‌ పరిధిలో 11 సీవేజ్‌ ట్రీట్‌మెంటు ప్లాంట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అందులో మొట్టమొదట చింతల చెరువు సమీపంలో ఒక సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. నర్సాపూర్‌ చెరువు సమీపంలో మరో ప్లాంట్‌ నిర్మాణ దశలో ఉన్నది. మిగిలినవి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు.


మొదట్లోనే  సమస్య...

చింతల చెరువు సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు మురుగు నీటిని తరలించేందుకు సుమారు 8వేల ఇంటి కనెక్షన్లు ఇవ్వనున్నారు. అండర్‌ గ్రౌండ్‌ పైపులైన్‌కు ఇంటి మురుగునీటి పైపులను కలిపే బాధ్యత ఇంటి వారిదేనని నిర్ణయించారు. ఇలా కనెక్షన్‌ ఇప్పించాలంటే ఒక్కో ఇంటికి కనీసం రూ. 3 వేల నుంచి రూ. 4 వేలు ఖర్చు వస్తుంది. ఇంటి ఎదుట వేసుకున్న స్లాబ్‌ పగులగొట్టి తిరిగి వేసుకోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. దీంతో చాలా మంది కనెక్షన్‌ కలుపడానికి వెనుకంజ వేశారు. దీంతో ప్రజారోగ్య శాఖ వారే కనెక్షన్‌ ఇచ్చి అందుకయ్యే ఖర్చు ఇంటి యజమాని నుంచి ఆస్తిపన్నుతో పాటు వసూలు చేయాలని మున్సిపల్‌ సమావేశంలో నిర్ణయించారు. ఈ క్రమంలో చింతల చెరువు ప్లాంట్‌ పరిధిలో సుమారు 3500 కనెక్షన్లు ఇచ్చారు. వాటి ద్వారా రోజులు సుమారు 30 లక్షల లీటర్ల నీరు శుద్ధి చేస్తున్నారు. ఇలా శుద్ధి చేసిన నీటిని చింతల చెరువులోకి వదులాలన్నది ప్రణాళికలో భాగం. ప్లాంట్‌ ప్రారంభమైన తర్వాత పంటలు వేసుకున్న వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ భూములు మునిగిపోతున్నాయని పంటలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దశలో ఆగ్రహంతో చెరువు మత్తడి రాళ్లు తొలగించారు. దీంతో ఎటూ తోచని అధికారులు సమస్యను పరిష్కరించలేక, చెరువు కట్ట కింది భాగంలోని పట్టా భూముల్లోకి నీరు వదలడం ప్రారంభించారు.  అందుకు చెరువు కట్ట కింది భాగంలో నీటిపారుదలశాఖ వారు నిర్మించిన చిన్న జాలు కాలువలను ఆధారం చేసుకున్నారు.


జాలు కోసం నిర్మించిన కాలువ

సాధారణంగా చెరువు నిండినపుడు మట్టికట్ట నుంచి కొంత జాలు వస్తుంది. ఈ నీరు కట్టకింది భాగంలో గల పట్టా భూముల్లోకి వెళ్లకుండా నివారించేందుకు ఈ కాలువ కట్టిస్తారు. అదే రీతిలో చింతల చెరువు కట్ట కింద  సుమారు 900 మీటర్ల చిన్న కాలువ నిర్మింపజేశారు. చెరువు కట్టకు రెండు వైపులా వచ్చే నీరు తూము ప్రాంతంలో వెళ్లేందుకు వీలుగా ఇది ఉంది. చెరువు తూము మూసివేయడంతో పంటలకు నీరు వదలడం లేదు. ఆ కాలువను ఆసరా చేసుకుని ప్రజారోగ్యశాఖ వారు ముందు చూపు లేకుండా చెరువులోకి వదిలే నీటిని కాలువలోకి పంపించారు. సుమారు 45 రోజుల నుంచి ఈ తతంగం నడుస్తున్నది. కాలువలో నీరు ఎటూ పోయే మార్గం లేకపోవడంతో రోజులు 30లక్షల లీటర్ల నీరు కాలువలో నుంచి పొంగి పొర్లి పట్టా భూముల్లోకి వెళ్తుంది. ఈ విషయమై మున్సిపల్‌, ప్రజారోగ్యశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. అందులో నడిస్తే కాళ్లకు బొబ్బలొస్తున్నాయని తెలిపారు. ఇది నీటి శుద్ధిలో లోపంగా భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు విధానాన్ని అనుసరించకపోతే భవిష్యత్తులో అన్ని సీవేజీ ప్లాంట్ల వద్ద ఇదే సమస్య తలెత్తే ప్రమాదమున్నది.

Updated Date - 2020-02-07T14:26:55+05:30 IST