Abn logo
Jun 18 2021 @ 02:44AM

టెన్షన్‌.. టెన్షన్‌!

తప్పించుకున్న మావోయిస్టుల జాడ కోసం జల్లెడ

క్షతగాత్రుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి?

ఒడిసాలోకి వెళ్లకుండా దిగ్బంధం

రంగంలోకి ఐదుకంపెనీల బలగాలు

భయాందోళనలో విశాఖ గిరిజనులు

నర్నీపట్నం చేరిన నక్సల్స్‌ మృతదేహాలు


చింతపల్లి, రంపచోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతాలవి! ఆరుగురు మావోయిస్టులను కాల్చిచంపిన ‘తీగలమెట్ట’ ఎన్‌కౌంటర్‌.. ఆ ప్రశాంతతను చెదరగొట్టింది. ఎన్‌కౌంటర్‌లో గాయపడి తప్పించుకొన్న అగ్రనాయకుల కోసం కొనసాగుతున్న భారీ గాలింపు చర్యలు మరింతగా ఏజెన్సీ గిరిజనులను భయపెడుతున్నాయి. విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల ఘటన నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీస్‌ బలగాలు గురువారం విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలను ఉధృతం చేశాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి గాయాలతో తప్పించుకున్న మావోయిస్టులు...ధారకొండ మీదుగా ఒడిసా భూభాగంలోకి వెళ్లిపోయే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో పోలీసులు అటు తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం, ఇటు విశాఖ జిల్లా కొయ్యూరు, జీకేవీధి మండలాల్లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. సుమారు ఐదు కంపెనీల ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఎదురు కాల్పుల నుంచి మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌, ఈస్టు డివిజన్‌ కార్యదర్శి అరుణ అలియాస్‌ వెంకట రవిచంద్ర, గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి జగన్‌ అలియాస్‌ కాకూరి పండన్న తప్పించుకున్నట్టు పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. తప్పించుకున్న మావోలు జీకేవీధి మండలం ధారకొండ మీదుగా ఒడిసా భూభాగంలోకి వెళ్లిపోయే అవకాశముందని భావించి, ఆయా ప్రాంతాలను దిగ్బంధం చేసినట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో జోరు వర్షాలు కూంబింగ్‌కు ప్రతిబంధకంగా మారాయి. కాగా, ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గురువారం సాయంత్రం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


కొత్త స్థావరాల అన్వేషణలో..

తూర్పుగోదావరిలోని మన్యం సరిహద్దుల్లోనే ఉంది తీగలమెట్ట. ఇన్ఫార్మర్లపై దాడులు వంటి ఘటనలు తప్ప తూర్పు మన్యంలో మావోయిస్టుల కదలికలు పెద్దగా లేవనే ఇన్నాళ్లు భావిస్తూ వచ్చారు. అలాంటిది పదుల సంఖ్యలో తీగలమెట్టలో మావోయిస్టులు బస చేస్తున్నట్టు.. తాజా ఎన్‌కౌంటర్‌ ఘటనతో బయటపడటం పోలీసువర్గాలను విస్మయపరుస్తోంది. చనిపోయిన ఆరుగురు మావోయిస్టుల్లో లలిత మినహా తక్కిన వారందరూ స్థానికేతరులే కావడం కూడా పోలీసుల అనుమానాలను మరింత పెంచుతోంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, 30 నుంచి 40 మంది వరకూ మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ సమయంలో అక్కడ ఉన్నారు.  


కాపాడిన మూడంచెల భద్రత

మూడంచెల భద్రతా వ్యూహమే తీగలమెట్ట ఎన్‌కౌంటర్‌ నుంచి మావోయిస్టు అగ్రనేతలను కాపాడిందని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2016లో జరిగిన రామ్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో 30 మందికిపైగా మావోయిస్టులు, అగ్రనేతలు మరణించడానికి భద్రతా వైఫల్యమే ప్రధాన కారణంగా తేల్చారు. అప్పటినుంచి మూడంచెల భద్రతా వ్యూహాన్ని అగ్రనేతల విషయంలో అమలుచేస్తున్నారు. ఈ వ్యూహం ప్రకారం..అగ్రనేతలు సమావేశాల సమయంలో దళ సభ్యులకు కొద్దిదూరంలో బస చేస్తున్నారు. తీగలమెట్టలో కూడా ఈ తరహాలోనే తొలిఅంచెపై కాల్పులు మొదలుకాగానే.. మూడో అంచెలో ఉన్న అగ్రనేతలు సురక్షితంగా తప్పించుకున్నట్టు తెలిసింది.


అగ్రనేతలు తీగలమెట్ట వచ్చారనే పక్కా సమాచారంతో సాగించిన కూంబింగ్‌లో సమన్వయ లోపాలెన్నో బయటపడ్డాయి. గ్రేహౌండ్స్‌ బలగాలు కొయ్యూరు మండలం మంప వైపు నుంచి గాలింపునకు వెళ్లగా, జీకేవీధి మండలం ధారకొండ నుంచి సాయుధ పోలీసు బలగాలు తీగలమెట్టవైపు కదిలాయి. మావోయిస్టులు బసచేసిన ప్రాంతాన్ని నలువైపుల నుంచి ముట్టడించాలన్నది వ్యూహం. అయితే తొలుత ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసు బృందం.. మరో బృందం రాకముందే మావోయిస్టులపై కాల్పులకు దిగింది. దీంతో ఘటనా స్థలానికి కొంత దూరంలో ఉన్న అగ్రనేతలు, ద్వితీయశ్రేణి నేతలు తప్పించుకోగలిగారని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి.