Abn logo
Mar 25 2021 @ 00:52AM

సుహృద్భావ సంకేతాలు

పాకిస్థాన్‌ డే సందర్భంగా భారతప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పాకిస్థాన్‌ ప్రధానికి శుభాకాంక్షలు తెలియచేశారు. 1940 మార్చి 23న ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్‌ ప్రత్యేక దేశాన్ని డిమాండ్‌ చేస్తూ లాహోర్‌ తీర్మానాన్ని ఆమోదించింది. మోదీ తన లేఖలో ఉభయదేశాల మధ్యా చక్కని సంబంధాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పాకిస్థాన్‌తో భారతదేశం సామరస్య పూర్వక బంధాన్ని ఆకాంక్షిస్తోందనీ, ఇందుకోసం విశ్వసనీయమైన వాతావరణం ఏర్పడాలనీ అన్నారు. కొవిడ్‌ను పాకిస్థాన్‌ చక్కగా ఎదుర్కొందనీ, మహమ్మారి వల్ల తలెత్తిన సవాళ్ళను కూడా పాకిస్థాన్‌ సమర్థంగా ఎదుర్కోగలదన్న నమ్మకం తనకున్నదనీ మోదీ ఆ లేఖలో రాశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా పాక్‌ అధ్యక్షుడికి లేఖరాశారట.


పండుగలూ పబ్బాలకు రాసుకొనే ఈ తరహా లేఖలకు ప్రాధాన్యం ఇవ్వక్కరలేదని అంటున్నప్పటికీ, ఉభయదేశాల మధ్యా ఇటీవలి కాలంలో మొగ్గతొడుగుతున్న సుహృద్భావానికి ఇవి సంకేతాలు కాకపోవు. ఐదురోజుల క్రితం పాక్‌ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కొవిడ్‌ బారిన పడినట్టుగా ఆయన కార్యాలయ అధికారి ట్విట్టర్‌లో ప్రకటిస్తే, ఆ రోజు సాయంత్రమే ఇమ్రాన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మోదీ సందేశాన్ని పంపారు. బయట వేసవి వేడి పెరుగుతున్నా, ఉభయదేశాల మధ్య మాత్రం కొద్దిరోజులుగా చల్లని వాతావరణమే సాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇకపై కచ్చితంగా పాటించాలని సంకల్పం చెప్పుకోవడంతో అధీనరేఖలో పరిస్థితి సవ్యంగా ఉంది. ఆ తరువాత, పాకిస్థాన్‌ ఆర్మీచీఫ్‌ జావేద్‌ బాజ్వా నోటినుండి మరో మంచి మాట వినిపించింది. భారత్‌తో చర్చలకు తాము సిద్ధమని సూచిస్తూ, గతాన్ని పక్కనబెట్టి ఒక సానుకూల దృక్పథంతో ఉభయదేశాలు ముందుకు సాగాలన్నారు. ఇందుకు భారతదేశం కశ్మీర్‌లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచాలన్నారు తప్ప, దాని ప్రతిపత్తికి సంబంధించి భారత్‌ ఇటీవల చేసిన మార్పుచేర్పులన్నీ తిరగదోడాలన్న గతకాలపు వాదన చేయలేదు. భారత్‌తో తాము స్నేహన్ని కోరుకుంటున్నామనీ, పాకిస్థాన్‌తో మైత్రివల్ల ఆపార ఖనిజవనరులున్న మధ్య ఆసియానుంచి భారత్‌ ఎంతో లాభపడవచ్చుని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. భారత్‌ కూడా చర్చలూ ఉగ్రవాదమూ ఒకే ఒరలో ఇమడవన్న వాదనని ఈ మధ్య గట్టిగా చేయడం లేదు. పాకిస్థాన్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని భారత విదేశాంగశాఖ కార్యదర్శి గతవారం అన్నారు. బుధవారం లోక్‌సభలో పరిశ్రమలశాఖ సహాయమంత్రి ఒక ప్రకటన చేస్తూ, సత్సంబంధాలతో పాటు, ద్వైపాక్షిక వాణిజ్యానికి కూడా భారత్‌ సిద్ధంగా ఉన్నదన్నారు. 2019 ఆగస్టులో వాణిజ్యాన్ని రద్దుచేసుకున్న పాకిస్థాన్‌ దానిని పునరుద్ధరించుకోవచ్చునని అన్నారు.


ఇండస్‌ నదీజలాల శాశ్వత కమిషన్‌ విషయమై చర్చించడానికి సోమవారం పాకిస్థాన్‌నుంచి ఒక బృందం భారత్‌ వచ్చింది. ఈ తరహా చర్చలు జరగడం రెండున్నరేళ్ళ తరువాత ఇదే ప్రథమం. 2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి, అనంతర పరిణామాలతో ఉభయదేశాల మధ్యా ఘర్షణ పతాకస్థాయికి చేరింది. వాణిజ్యంలో దానికున్న ఆప్తమిత్ర హోదా రద్దయింది, దాని ఉత్పత్తులపై సుంకాలు రెట్టింపైనాయి, సరిహద్దురేఖకు అటూ ఇటూ సాగే వర్తకమూ నిలిచిపోయింది. కశ్మీర్‌ ప్రతిపత్తిలో మార్పుతో ఈ దూరం మరింత హెచ్చింది. ఇప్పుడు శాంతిస్థాపన దిశగా విశేష కృషి జరుగుతోందని అనలేం కానీ, అతుకు వేసే ప్రయత్నం మాత్రం సాగుతోంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆంక్షల దెబ్బతో పాకిస్థాన్‌ వైఖరిలో ఈ మార్పువచ్చిందనీ, ఇది నిలబడేది కాదనీ కొందరు అనుమానిస్తున్న మాటా నిజమే. కానీ, పార్లమెంటులో ఇమ్రాన్‌ తన బలాన్ని రుజువుచేసుకున్న అనంతరం అటువైపు నుంచి నిర్దిష్టంగా వెలువడుతున్న సానుకూల సంకేతాలను స్వీకరించడంలో కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. సరిహద్దుకు అటూఇటూ సాగే బస్సు సర్వీసునూ, వర్తకాన్నీ అనుమతించడం ద్వారా భారత్‌ సైతం మంచిని పెంచవచ్చు. బంధాన్ని బలోపేతం చేసుకోవడానికీ, పెంచడానికీ ఉభయదేశాలూ వేగంగా అడుగులు వేయకపోతే, ఏవో చిన్నచిన్న కారణాలతో తిరిగి అవిశ్వాసం రాజుకొని, సాధించిన దానిని సైతం నిలబెట్టుకోలేని పరిస్థితులు దాపురించవచ్చు.